మాజీ మంత్రి రిటైర్మెంట్ కి రెడీ...కొడుక్కి మాత్రం ?

ఒకనాడు తెలుగుదేశంలో ఒక వెలుగు వెలిగి ఏపీకి తొలి టీడీపీ ప్రెసిడెంట్ గా పనిచేసిన వారు కిమిడి కళా వెంకట్రావు. ఆయన 1983 నుంచి తన రాజకీయాలను కొనసాగిస్తూ వస్తున్నారు.

Update: 2026-05-31 04:10 GMT

తెలుగుదేశం పార్టీలో సీనియర్ల శకం దాదాపుగా ముగిసినట్లే అని అంటున్నారు. ఇంకా ఉత్సాహంగా పార్టీ కోసం పనిచేయాలీ అనుకుంటే వారి సలహా సూచనలు తీసుకుంటారు కానీ కీలకమైన పదవులలో మాత్రం చాన్స్ ఉండదని చెప్పకనే చెప్పేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ సీనియర్లకు దొరకడం దుర్లభమే అన్న మాట కూడా వినిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ యువ నేత జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ టీడీపీని నవ శకం వైపుగా నడిపిస్తునారు. దాంతో కొత్త వారికి నాలుగు పదుల వయసు లోపు వారికి మాత్రమే అధికంగా అవకాశాలు అయితే పార్టీలో ఉన్నాయని చెబుతున్నారు తెలుగుదేశం పుట్టాక ఇంత పెద్ద ఎత్తున పరిణామ ప్రక్రియ కొత్త రూపు తీసుకోవడం అన్నది ఇదే ప్రథమం. దాంతో సీనియర్లు కూడా విషయం మొత్తం అర్ధం చేసుకుని తమదైన వ్యూహాలకు పదును పెడుతున్నారు.

రిటైర్మెంట్ బెస్ట్ :

ఒకనాడు తెలుగుదేశంలో ఒక వెలుగు వెలిగి ఏపీకి తొలి టీడీపీ ప్రెసిడెంట్ గా పనిచేసిన వారు కిమిడి కళా వెంకట్రావు. ఆయన 1983 నుంచి తన రాజకీయాలను కొనసాగిస్తూ వస్తున్నారు. అన్న ఎన్టీఆర్ నుంచి నేరుగా టికెట్ సాధించి ఎమ్మెల్యేగా గెలిచి అదే ఎన్టీఆర్ కేబినెట్ లో పలు కీలక మంత్రిత్వ శాఖలతో పాటు ఏకంగా హోం శాఖ కూడా చేపట్టిన ఘనత కిమిడి కళా వెంకట్రావుకు దక్కుతుంది. ఇక ఆయన రాజ్యసభకు కూడా వెళ్ళి ఆరేళ్ళ పాటు ఆ పదవిలో ఉన్నారు. గతంలో ఉణుకూరు నుంచి అనేక సార్లు ఎమెల్యేగా గెలిచిన ఆయన 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజనలో ఎచ్చెర్లకు మారారు. అక్కడ 2014లో గెలిచి చంద్రబాబు కేబినెట్ లో విద్యుత్ శాఖను నిర్వహించారు.

చివరి నిముషంలో సీటు :

ఇక జగన్ ప్రభంజనంలో 2019 ఎన్నికల్లో ఓటమి పాలు అయిన కళా వెంకట్రావు అయిదేళ్ళ పాటు ఎచ్చెర్లలోనే గట్టిగా పనిచేసి విజయ ఢంకా మోగించడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే పొత్తులలో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్ళిపోయింది. ఈశ్వరరావు ఎమ్మెల్యే అయ్యారు. కళా వెంకటరావుని చీపురుపల్లికి బదిలీ చేశారు. అలా చివరి నిముషంలో వచ్చినా అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ మీద భారీ మెజారిటీతో కళా గెలిచి వచ్చారు. కళాకు మంత్రి వర్గంలో స్థానం ఖాయమని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేశారు. అయితే కళాకు కాకుండా కొత్తగా తొలిసారి ఎమ్మెల్యే అయిన గజపతినగరం నేత కొండపల్లి శ్రీనివాస్ కి మంత్రి యోగం పట్టింది. దాంతో కళా వర్గం డీలా పడింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి మీద కూడా కళా ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. మరి ఆ ఆశ ఏ మేరకు నెరవేరుతుందో తెలియదు. మంత్రి అయితే లేదని కళా వర్గం డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.

ఎచ్చేర్ల మీదనే ఫోకస్ :

ఇదిలా ఉంటే చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా కళా ఎచ్చెర్ల మీదనే ఫోకస్ పెట్టారని అంటున్నారు. పైగా చీపురుపల్లిలో కళా తమ్ముడి కుమారుడు కిమిడి నాగార్జున పోటీలో ఉన్నారు. ఆయన 2019లో అక్కడ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2029లో ఆయనకు టికెట్ ఖాయమని అంటున్నారు. ఆయన ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్ తో పాటు విజయనగరం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తన కుమారుడు కిమిడి రాం మల్లిక్ కి ఎచ్చెర్ల టికెట్ కేటాయించాలని కళా టీడీపీ పెద్దలను కోరుతున్నారని అంటున్నారు. ఆ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తారని కూడా చెబుతున్నారు. వేరే చోటకు ఈసారి కళా కుటుంబం వెళ్లేది లేదని కూడా అంటున్నారు. మొత్తానికి మూడేళ్ళ ముందే కళా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం వ్యూహ రచన చేస్తున్నారు. అంతే కాదు తాను ఇక మీదట ఎన్నికల్లో పోటీ చేసేది లేదని కూడా ఆయన అనుచరులతో చెబుతున్నారని ప్రచారం అయితే సాగుతోంది. మొత్తానికి ఈ సీనియర్ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News