జగన్ ఇలాకాలో ఉప ఎన్నికల సమరం !

ఎన్నికలు ఎపుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక ఉద్ధండులు ఉన్న చోట పార్టీ అధినేతల సొంత ఇలాకాలో ఎన్నికలు అంటే మరింతగా ఆసక్తి పెరుగుతుంది.;

Update: 2025-07-28 19:06 GMT

ఎన్నికలు ఎపుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక ఉద్ధండులు ఉన్న చోట పార్టీ అధినేతల సొంత ఇలాకాలో ఎన్నికలు అంటే మరింతగా ఆసక్తి పెరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సొంత ఇలాకా అయిన కడపలో ఉప ఎన్నికల నగరా మోగింది. కడప జిల్లా పరిధిలో రెండు జెడ్పీటీసీలకు ఉప ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం నిర్ణయించింది. దాంతో ఉప ఎన్నికలకు రంగం సిద్ధం అయిపోయింది.

అనివార్యం అయిన ఉప ఎన్నికలు :

కడప జిల్లాలో రెండు చోట్ల జడ్పీటీసీ ఎన్నికలు అనివార్యంగా వచ్చాయి. ఒకటి చూస్తే ఒంటిమెట్ట జెడ్పీటీసీ. ఇక్కడ 2021లో జెడ్పీటీసీగా గెలిచిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆ తర్వాత రాజంపేట జెడ్పీ ఛైర్మన్ గా నెగ్గారు. ఆ పదవి లో ఉంటూ ఆయన 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున రాజంపేట నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అదే విధంగా పులివెందులలో జెడ్పీటీసీగా నెగ్గిన ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఎన్నికలు వచ్చాయి

కసరత్తు పూర్తి అయింది :

ఇక ఒంటిమెట్టలో చూస్తే . పులివెందులలో మొత్తం 10,601 ఓట్లు నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు. అలాగే ఒంటిమిట్టలో 24,606 ఓట్లు ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఇక జెడ్పీటీసీ ఎన్నికల కోసం అవసరమైన పోలింగ్ కేంద్రాలను కూడా ఇప్పటికే గుర్తించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల కోసం పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది.

డేట్ టైం ఫిక్స్ :

ఇక ఈ రెండు చోట్లతో పాటు ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం చూస్తే కనుక జూలై 30వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆగస్టు రెండో తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు ఐదో తేదీ వరకూ సమయం ఉంది. ఆగస్టు 12న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆగస్టు 14వ తేదీ కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

జగన్ కి ప్రతిష్టాత్మకమేనా :

పులివెందుల జెడ్పీటీసీ జగన్ కి ఎంతో ప్రతిష్ఠాత్మకం అని అంటున్నారు. అలాగే ఒంటిమెట్ట కూడా కీలకమే అని చెబుతున్నారు. అయితే ఈ రెండు జెడ్పీటీసీల మీద వైసీపీ హైకమాండ్ ఎంతవరకూ సీరియస్ గా తీసుకుంటుంది అన్నది చర్చగా ఉంది. ఎందుకంటే ఈ రెండింటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినా అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఫలితం తారు మారు అయితే ఇబ్బంది అవుతుంది. అలాగని వదిలేస్తే ఈజీగానే ఓటమిని అంగీకరించినట్లు అవుతుంది. మొత్తానికి వైసీపీకి ఇది ఒక అగ్నిపరీక్ష గానే ఉంది అని అంటున్నారు అయితే కూటమి పెద్దలు మాత్రం వీటిని గట్టిగానే తీసుకుంటున్నారు. కడపలో వైఎస్ జగన్‌కు గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తున్న టీడీపీ కూటమి ఈ ఎన్నికలను ఉపయోగించుకునే అవకాశాలు అధికంగానే ఉన్నాయని చెబుతున్నారు. చూడాలి మరి ఈ ఎన్నికల విషయంలో వైసీపీ హైకమాండ్ అనుసరించే విధానాలు ఏమిటో. వ్యూహాలు ఎలా ఉంటాయో.

Tags:    

Similar News