కేఏ పాల్ యెమెన్ ఎంట్రీ.. నిమిషా ఉరిశిక్షను ఆపేశాడట..

ఈ క్రమంలో పాల్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. "ఎనిమిదేళ్లుగా నిమిషను కాపాడటంలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైంది.;

Update: 2025-07-16 05:12 GMT

ప్రజాశాంతి పార్టీ అధినేత డాక్టర్ కేఏ పాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియను తానే కాపాడానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసిన కేఏ పాల్, తాను నిమిష ప్రాణాలను ఎలా రక్షించాడన్న విషయాన్ని వివరించారు.

మూడు రోజుల నిరంతర శ్రమతో...

"నిమిష ప్రియకు ఉరిశిక్ష విధించకూడదని మూడు రోజులు రాత్రింబవళ్లు శ్రమించాను. హూతీ - యెమెన్ ప్రభుత్వ పెద్దలతో నేరుగా మాట్లాడి వారిని ఒప్పించాను. నా ప్రయత్నాల వల్లే ప్రస్తుతం ఆమెకు ఉరిశిక్ష వాయిదా పడింది" అని పాల్ వెల్లడించారు.

మోదీ ప్రభుత్వంపై విమర్శలు

ఈ క్రమంలో పాల్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. "ఎనిమిదేళ్లుగా నిమిషను కాపాడటంలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. వారు సనా నగరంలో ప్రభుత్వం లేదంటూ చేతులెత్తేశారు. కానీ అది అబద్ధం. హూతీ ప్రభుత్వం పూర్తిగా పనిచేస్తోంది. నేను వెళ్లి వాళ్లను కలిశాను. మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ సెమీ ఆరియన్ షేక్ అహ్మద్ గారు ఎంతో సహాయం చేశారు" అని వివరించారు.

మిలియన్ డాలర్ల హామీ

నిమిష ప్రియపై మరణ శిక్ష విధించకుండా ఆ కేసులో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారంగా మిలియన్ డాలర్లు ఇవ్వాలని హామీ ఇచ్చినట్టు కేఏ పాల్ తెలిపారు. "ఆ డబ్బులు నేను ఇవ్వాలా? లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? వారం లోగా ఆ మొత్తాన్ని సమర్పించాలి. అప్పటివరకు మాత్రమే ఉరిశిక్ష వాయిదా పడింది. తిరిగి యెమెన్ అధికారులను కలుస్తాను" అని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా...

కేఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. వాస్తవంగా నిమిష ప్రియను కాపాడిన ఘనత కేఏ పాల్‌కే చెందిందా? కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహాయపడలేదా? అనే అంశాలపై తీవ్ర చర్చ జరుగుతోంది.

నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష సమస్య ఒకవైపు మానవతా కోణాన్ని తాకుతుండగా, రాజకీయ నేతల ప్రకటనలు మరోవైపు వివాదాస్పదంగా మారుతున్నాయి. పాల్‌ వ్యాఖ్యలు నిజమైతే, ఆయన పాత్రను కేంద్రం ఎందుకు గుర్తించలేదన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై కేంద్రం నుంచి అధికారిక స్పందన ఏమైనా వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News