జస్టిస్ వర్మపై అభిశంసన షురూ.. తీర్మానం స్వీకరించిన స్పీకర్
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ వర్మ ప్రభుత్వ నివాసంలో 2024 మార్చిలో అగ్ని ప్రమాదం జరగ్గా.. మంటలను ఆర్పే క్రమంలో అగ్నిమాపక సిబ్బందికి కాలిన నోట్ల కట్టలు కనిపించాయి.;
భారత న్యాయవ్యవస్థలో అలహాబాద్ హైకోర్టుది ప్రత్యేక చరిత్ర...! మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై అనర్హత వేటు నుంచి అనేక సంచలన కేసుల్లో సంచలన తీర్పులు ఇచ్చిన ఘనత ఈ హైకోర్టు సొంతం. ఇలాంటి న్యాయస్థానం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తోంది. కారణం... ఆ కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం. ఈ ప్రక్రియను లోక్ సభ మంగళవారం అధికారికంగా ప్రారంభించింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సభలో చదివి వినిపించారు.
ఆ నోట్ల కట్టల వెనుక...
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ వర్మ ప్రభుత్వ నివాసంలో 2024 మార్చిలో అగ్ని ప్రమాదం జరగ్గా.. మంటలను ఆర్పే క్రమంలో అగ్నిమాపక సిబ్బందికి కాలిన నోట్ల కట్టలు కనిపించాయి. సంచలనంగా మారిన ఈ ఘటనపై న్యాయ విచారణ నిర్వహించారు. సంబంధిత నగదుపై జస్టిస్ వర్మకు రహస్య లేదా క్రియాశీల నియంత్రణ ఉందంటూ నివేదిక పేర్కొంది. దీని ఆధారంగా జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించాలంటూ భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ సిఫార్సు చేశారు. మాజీ న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో పాటు లోక్‌సభ సభ్యులు 146 మంది ఎంపీలు సంతకాలు చేసిన అభిశంసన తీర్మాన నోటీసును గత నెల 31న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు.
ముగ్గురు సభ్యులతో ప్యానెల్
జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు సీజే జస్టిస్ మణీందర్ మోహన్, సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్య సభ్యులు. నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని కమిటీకి సూచించారు. ఈ కమిటీకి.. నోట్ల కట్టల కేసులో సాక్షులను పిలిచి ప్రశ్నించే అధికారం కూడా ఉంది. స్పీకర్ కు నివేదిక ఇచ్చాక.. తర్వాత సభలో ప్రవేశపెట్టి ఓటింగ్ చేపడతారు.
కాగా, నోట్ల కట్టల ఘటన బయటపడిన సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉన్నారు. ఆయన అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీని వేశారు. జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని ఈ కమిటీ తేల్చింది. దీన్ని జస్టిస్ వర్మ.. సుప్రీంకోర్టులో సవాల్ చేసినా ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.