నేతల తలరాతలు మార్చిన 'జంపింగ్'.. తెలంగాణ ఫలితం చిత్ర విచిత్రం
బీఆర్ ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వారు గెలుపు గుర్రం ఎక్కగా.. అదేసమయంలో కాంగ్రెస్ నుంచి అలిగి, టికెట్ రాలేదని పార్టీ మారిన వారినిప్రజలు ఓడించారు.;
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం.. నేతల తలరాతలను మార్చేసిన విషయం తెలిసిందే. వీరిలోనూ ముఖ్యంగా ఎన్నికలకు ముందు.. చివరకు నోటిఫికేషన్ వచ్చి.. నామినేషన్ల ఘట్టం ప్రారంభమయ్యాక కూడా నాయకులు చాలా మంది అటు ఇటు మారి కండువాలు కప్పుకొన్నారు. అయితే.. ఇలా జంపింగ్ చేసిన వారిలో చిత్ర విచిత్ర ఫలితం వచ్చింది. బీఆర్ ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వారు గెలుపు గుర్రం ఎక్కగా.. అదేసమయంలో కాంగ్రెస్ నుంచి అలిగి, టికెట్ రాలేదని పార్టీ మారిన వారినిప్రజలు ఓడించారు.
బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరి గెలుపు గుర్రం ఎక్కిన నాయకులు వీరే.. వేముల వీరేశం( నకిరేకల్), జూపల్లి కృష్ణారావు(కొల్లాపూర్), కసిరెడ్డి నారాయణ రెడ్డి(కల్వకుర్తి), మందుల సామేల్(తుంగతుర్తి), తుమ్మల నాగేశ్వరరావు(ఖమ్మం.), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(పాలేరు), పాయం వేంకటేశ్వర్లు(పినపాక), కోరం కనకయ్య(ఇల్లందు).
ఇక, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి బీఆర్ ఎస్‌లో చేరి ఓడిపోయిన నాయకులు చాలా మంది ఉన్నారు. వీరిలో వనమా వెంకటేశ్వర్ రావు(కొత్తగూడెం), సండ్ర వెంకటవీరయ్య(సత్తుపల్లి), రేగా కాంతారావు(పినపాక), హరిప్రియ నాయక్(ఇల్లందు), చిరుమర్తి లింగయ్య(నకిరేకల్), గండ్ర వెంకట రమణ రెడ్డి(భూపాల పల్లి), మెచ్చ నాగేశ్వరరావు(అశ్వారావు పేట), ఉపేందర్ రెడ్డి(పాలేరు), సురేందర్(ఎల్లారెడ్డి), హర్షవర్ధన్ రెడ్డి(కొల్లాపూర్), పైలెట్ రోహిత్ రెడ్డి(తాండూర్).