జూబ్లీ "హీట్".. "ప‌ది"పోతున్న పోలింగ్.. పార్టీల‌కు గుబులే!

జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం హైద‌రాబాద్ న‌డి బొడ్డున ఉన్న ప్రాంతం. ఇక్క‌డ రాజ‌కీయ చైత‌న్యం కూడా ఎక్కువే.;

Update: 2025-10-14 23:30 GMT

జూబ్లీహిల్స్.. విద్యావంతులు.. అత్యంత‌ సంప‌న్నులు.. ఎగువ మ‌ధ్య త‌ర‌గ‌తి.. పేద‌లు కూడా నివ‌సించే ప్రాంతం. అన్ని వ‌ర్గాల వారు ఉన్నందున జూబ్లీహిల్స్ లో ఎన్నిక‌లు అంటే పోలింగ్ శాతం భారీగా న‌మోద‌వాలి. క్రితం సారికి ఈ సారికి శాతం పెరుగుతూ పోవాలి. కానీ ప‌రిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఒక‌సారి ఇలా జ‌రిగిందంటే స‌రే అనుకోవ‌చ్చు. రెండోసారి కూడా జ‌ర‌గ‌డం.. ఈసారి ఉప ఎన్నిక కావ‌డంతో కాస్త ఆలోచించాల్సిన విష‌యంగానే ఉంది.

పోలింగ్ ప‌డిపోతే...

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో జ‌రుగుతోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌. నవంబ‌రు 11న జ‌ర‌గ‌నున్న పోలింగ్ అధికార‌ కాంగ్రెస్, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ తో పాటు కేంద్రంలో అధికారంలో ఉంటూ తెలంగాణ‌లో అధికారంపై గురిపెట్టిన బీజేపీకి అత్యంత కీల‌కం. ఈ నేప‌థ్యంలో మూడు పార్టీలు హోరాహోరీగా త‌ల‌ప‌డ‌డం ఖాయం. అలాంట‌ప్పుడు పోల్ అయ్యే ప్ర‌తి ఓటు కూడా కీల‌క‌మే. రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మ‌రింత వేడెక్కితే ఫ‌లితంలో తేడా అత్యంత త‌క్కువ‌గా ఉండే అవ‌కాశం లేక‌పోలేదు.

గ‌త రెండు ఎన్నిక‌ల్లో ఇలా...

జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం హైద‌రాబాద్ న‌డి బొడ్డున ఉన్న ప్రాంతం. ఇక్క‌డ రాజ‌కీయ చైత‌న్యం కూడా ఎక్కువే. అగ్ర సినీ తార‌లే కాదు.. ప్ర‌ధాన పార్టీల ముఖ్య నాయ‌కులు నివసించే ప్రాంతం. కానీ, గ‌త రెండు ఎన్నిక‌ల్లో జూబ్లీహిల్స్ లో పోలింగ్ ప‌డిపోతోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అనంత‌రం 2009లో ఖైర‌తాబాద్ నుంచి జూబ్లీహిల్స్ ఏర్ప‌డింది. మొద‌టి ఎన్నిక‌ను వ‌దిలేస్తే 2014లో జ‌రిగిన రెండో ఎన్నిక‌లో 56 శాతం పోలింగ్ న‌మోదైంది. 2018కి వ‌చ్చేస‌రికి అది 47.58కు ప‌డిపోయింది. 2023లో మ‌రింత త‌గ్గి.. 45.59 శాతానికి ప‌రిమిత‌మైంది.

-గ‌త మూడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే 2009లో మాత్ర‌మే 50 శాతం పైగా పోలింగ్ జ‌రిగింది. ఆ త‌ర్వాత స‌గంలోపే న‌మోదైంది.

మ‌రి ఉప ఎన్నిక‌లో...?

జూబ్లీహిల్స్ ఏర్పాట‌య్యాక తొలిసారిగా ఉప ఎన్నిక జ‌రుగుతోంది. దీంతో పోలింగ్ శాతంపై ప్ర‌ధాన పార్టీల‌కు గుబులు ప‌ట్టుకుంది. ఎన్ని త‌క్కువ ఓట్లు న‌మోదైతే అంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర‌య్యే అవ‌కాశం ఉండ‌డం ఖాయం. మ‌రి ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ ఏం జ‌రుగుతుందో చూద్దాం..?

Tags:    

Similar News