అందరిదీ 'అదుర్స్' డైలాగే.. లేటెస్టుగా జోగి మాటలు

ఏపీలో పలు కేసుల్లో అరెస్టు అయిన నిందితులు అంతా అదుర్స్ సినిమాను ఎక్కువగా చూశారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.;

Update: 2025-11-28 15:30 GMT

ఏపీలో పలు కేసుల్లో అరెస్టు అయిన నిందితులు అంతా అదుర్స్ సినిమాను ఎక్కువగా చూశారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఏ కేసు పెట్టినా అంతా ఒకే డైలాగ్ చెబుతున్నారన్న ప్రచారంతో నిందితులైన నేతల టార్గెట్ గా పలు రకాల మీమ్స్ వదులుతున్నారు. సోషల్ మీడియా కేసుల నుంచి మద్యం స్కాం, టీటీడీ పరాకామణి చోరీ, కల్తీ నెయ్యి కేసు, మద్యం కల్తీ కేసు ఇలా పలు రకాల అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన నిందితులు తమ విచారణలో ‘‘తెలియదు, గుర్తులేదు, మరచిపోయా!’’ అంటూ ఒకే డైలాగ్ చెబుతున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారీ కేసులో సీఐడీ సిట్ అరెస్టు చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ కూడా విచారణలో ఇవే సమాధానాలు చెబుతున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.

నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రామును సిట్ పోలీసులు నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్నారు. తొలిరోజు విచారణలో ఆ ఇద్దరికి వేర్వేరుగా ప్రశ్నించారని చెబుతున్నారు. ఇద్దరు అన్నదమ్ములకు సమారు వంద చొప్పున ప్రశ్నలు అడుగగా, మెజార్టీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని ప్రచారం జరుగుతోంది. ఎక్కువ ప్రశ్నలకు తెలియదు, మరచిపోయా, గుర్తులేదు అన్న సమాధానాలు జోగి బ్రదర్స్ చెప్పారని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏ1, ఏ2గా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు, జగన్మోహనరావుతో పరిచయాలు, వారిద్దరితో జోగి బ్రదర్స్ సాగించిన ఫోన్ సంభాషణలపైనే విచారణ సాగిందని అంటున్నారు.

అయితే ఇబ్రహీంపట్నంలో తమ ఇళ్లు ఎదురెదురుగా ఉండటం వల్లే వారితో పరిచయం ఉందని, అదేవిధంగా వారి యోగక్షేమాలు తెలుసుకోడానికి అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటామని జోగి బ్రదర్స్ సిట్ పోలీసులకు వివరించినట్లు చెబుతున్నారు. అయితే ఏ2 నుంచి జోగి తమ్ముడు రాము 9 లక్షలు తీసుకున్న విషయంపై పోలీసులు ప్రశ్నించగా, పోలీసులు చెబుతున్న ప్రదేశానికి తాను వెళ్లలేదని, డబ్బు లావాదేవీలు ఏం జరగలేదని వివరణ ఇచ్చారని అంటున్నారు. మరోవైపు జోగిని ఆయన ఇంట్లోనే కలిశానని నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు గతంలో చెప్పగా, అసలు అతడు తన ఇంటి మెట్టే ఎక్కలేదని మాజీ మంత్రి జోగి స్పష్టం చేశారంటున్నారు.

ఇక తొలిరోజు విచారణ ఆలస్యం కావడంతో జోగి కస్టడీని మరో రోజు పొడిగిస్తూ విజయవాడ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెల 30 వరకు జోగి బ్రదర్స్ సిట్ అదుపులో ఉండనున్నారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు, కార్యకర్తలను పలు కేసుల్లో అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగులతోపాటు గన్నవరం, మంగళగిరిల్లో టీడీపీ కార్యాలయాలపై దాడి, ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేత పట్టాభి ఇళ్లపై దాడులతోపాటు లిక్కర్ స్కాం, టీటీడీ పరకామణి, కల్తీ నెయ్యి, భూకబ్జాలు ఇలా చాలా కేసుల్లో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు విచారణలో ఒకే విధమైన సమాధానాలు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అదుర్స్ సినిమాలో బాగా పాపులర్ డైలాగు అయిన తెలియదు, గుర్తులేదు, మరచిపోయా అన్న మూడు మాటలనే వైసీపీకి చెందిన నిందితులు చెబుతున్నారని టీడీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది.

Tags:    

Similar News