'అమ్మ' మరణంపై సామాజిక కార్యకర్త ప్రశ్నలు.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ

కోట్లాది మంది తమిళులకు ‘అమ్మ’గా దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితతో ఉన్న భావోద్వేగ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2026-06-13 12:30 GMT

కోట్లాది మంది తమిళులకు ‘అమ్మ’గా దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితతో ఉన్న భావోద్వేగ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తుదిశ్వాస విడిచి దగ్గర దగ్గర తొమ్మిదిన్నరేళ్లు అవుతోంది. ఈ డిసెంబరుకు పదేళ్లు పూర్తవుతాయి. ఇప్పటికి ఆమె మరణం మీద ఉన్న సందేహాలకు సమాధానాలు పూర్తిగా రాని పరిస్థితి. గతంలో నియమించిన అరుముగస్వామి కమిషన్ ఇచ్చిన రిపోర్టు కొత్త గందరగోళానికి కారణమైందే తప్పించి.. క్లారిటీ ఇచ్చింది లేదు. సదరు కమిషన్ రిపోర్టులో పేర్కొన్న అంశాల మీద ఇంతకాలం జరిగిందేమీ లేదు. కమిషన్ లేవనెత్తిన సందేహాలు.. అనుమానాలకు తదుపరి చర్యలు ఏమిటి? అంటే.. న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్లుగా చెప్పటమే తప్పించి.. చేసిందేమీ లేదు.

ఇదిలా ఉండగా.. గత నెలలో సామాజిక కార్యకర్తగా.. సమాచార హక్కు చట్టం ద్వారా పలు అంశాలపై ప్రశ్నలు అడగటం ద్వారా సామాన్యులకు పలు అంశాల మీద అవగాహన కల్పించే అలవాటున్న రామక్రిష్ణన్.. దివంగత మాజీ ముఖ్యమంత్రి మరణం తర్వాత ఏర్పాటు చేసిన దర్యాప్తు.. ఆ తర్వాత ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు బయటకు వచ్చేలా మూడు ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానాలు తాజాగా వెలుగు చూశాయి. దీంతో.. అమ్మ మరణం తమిళనాడులో మరోసారి చర్చకు తెర తీసినట్లైంది. ఇంతకూ సామాజిక కార్యకర్త రామక్రిష్ణన్ అడిగిన మూడు ప్రశ్నలు.. వాటికి ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానాలు చూస్తే.. మదిలో కొత్త ప్రశ్నలు మెదలటం ఖాయం.

1. జస్టిస్ ఎ అరుముగస్వామి కమిషన్ సమర్పించిన తుది దర్యాప్తు రిపోర్టులో ప్రస్తావించిన సిఫార్సులు.. నేరారోపణలపై తమిళనాడు ప్రభుత్వం తీసుకున్నతదుపరి చర్యలేంటి?

2. ప్రస్తుత స్థితి ఏంటి? కమిషన్ రిపోర్టు ఇచ్చి సుదీర్ఘకాలం గడుస్తున్నప్పటికి.. ఈ విచారణ ప్రక్రియకు సంబంధించిన ఫైళ్లు ప్రస్తుతం ఏ ప్రభుత్వ అధికారి వద్ద పెండింగ్ లో ఉన్నాయి?

3. జయలలితకు వైద్య చికిత్సను అందించిన అపోలో ఆసుపత్రిలో 75 రోజుల పాటు చికిత్స చేసినందుకు అయిన ఖర్చు ఎంత? ఆసుపత్రి బిల్లును ప్రభుత్వం చెల్లించిందా? మరేదైనా సంస్థ చెల్లించిందా? దానికి సంబంధించిన అధికారిక రికార్డుల వివరాలు ఇవ్వగలరు.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. స.హ. చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులకే సమాధానాలు తెలుపుతూ వివరాలను అందించారు. ఇందులో కీలక అంశం ఏమంటే.. కమిషన్ రిపోర్టు ఆధారంగా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని స్పష్టం చేయటంతో పాటు.. ఆసుపత్రిలో అమ్మకు చేసిన వైద్యానికి వేసిన బిల్లు రూ.6.85 కోట్లుగా వెల్లడైంది. ఆసుపత్రి బిల్లును అన్నాడీఎంకే పార్టీ చెల్లింపులు జరిపిందని.. మొత్తం రూ.6.85 కోట్ల బిల్లుకు పార్టీ రూ.6 కోట్లను పార్టీ నిధుల నుంచి చెల్లించినట్లుగా వెల్లడైంది.

ఈ వివరాలు బయటకు రావటంతో.. అరుముగస్వామి రిపోర్టు జయలలిత మరణం వెనుక ఉన్న అనుమానాలు.. కొందరి వ్యక్తుల తప్పులను ఎత్తి చూపిన వైనం తెలిసిందే. తాజాగా స.హ. చట్టం ద్వారా వెల్లడైన వివరాలతో.. కమిషన్ లేవనెత్తిన సందేహాలకు తగిన సమాధానాలు ఇప్పటివరకు వెతకలేదన్న విషయాన్ని స్పష్టం చేసినట్లైంది. దీంతో.. డీఎంకే ప్రభుత్వం అమ్మ మరణాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటమే తప్పించి.. ఆమె మరణంపై ఎలాంటి సీరియస్ నెస్ లేదన్న విషయం తాజాగా స్పష్టమైందని చెప్పాలి.

అమ్మకు అపోలో ఆసుపత్రిలో అందించిన వైద్యం.. దానికి వేసిన బిల్లుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం బిల్లు రూ.6,85,69,584 వెల్లడైంది.అందులో జయలలితతో పాటు.. ఆమె సహాయకులు.. విధుల్లో ఉన్న సిబ్బంది.. ఇతర ప్రముఖుల భోజన వసతుల కోసం రూ.1.17 కోట్లు ఖర్చు అయినట్లుగా వెల్లడైంది. అంతేకాదు.. లండన్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అంతర్జాతీయ వైద్య నిపుణుల ఫీజులు.. మందులు.. క్రిటికల్ కేర్ సేవల కోసం రూ.1.92 కోట్లు ఖర్చు అయినట్లుగా వెల్లడైంది. జయలలిత ఉన్న వార్డుతో పాటు సెక్యూరిటీ కారణాలతో ఆసుపత్రిలోని రెండో ఫ్లోర్ ను ఖాళీ చేయించి.. మొత్తం జయలలిత కోసం కేటాయించినందుకుగదుల అద్దె కింద రూ.24 లక్షల బిల్లు వేసినట్లుగా తేలింది. మొత్తంగా ఆసుపత్రి బిల్లులో రూ.6 కోట్లను అన్నాడీఎంకే పార్టీ నుంచి చెల్లింపులు జరపగా.. మిగిలిన రూ.44.56 లక్షలు పెండింగ్ లో ఉన్నట్లుగా వెల్లడైంది.

అరుముగస్వామి కమిషన్ తన నివేదికను సమర్పించి దాదాపు నాలుగేళ్లు గడుస్తున్నా.. కమిషన్ రిపోర్టు సిఫార్సులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం.. అవన్నీ పెండింగ్ లో ఉండటంతో తాజాగా విజయ్ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక ఫోకస్ చేసే వీలుందని చెబుతున్నారు. జయలలిత మరణంపై నెలకొన్న సందేహాలను కమిషన్ లేవనెత్తిన వేళ.. ఆ అంశంపై స్టాలిన్ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదన్న విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇలాంటి వేళ.. విజయ్ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమిటన్న విషయం తాజాగా వెల్లడైన వివరాలతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మరి.. విజయ్ ప్రభుత్వం ఎలా రియాక్టు అవుతుందన్నది చూడాలి.

Tags:    

Similar News