పరువు తీస్తున్న అరవ శ్రీధర్.. ఇంకా సైలెంటా?!
జనసేన అంటేనే ఒక భరోసా.. ఒక ప్రశ్న!. సమాజంలోని అబలలు, ఆర్తుల పక్షాన పోరాడతామని ప్రతిన బూనిన పార్టీ.;
జనసేన అంటేనే ఒక భరోసా.. ఒక ప్రశ్న!. సమాజంలోని అబలలు, ఆర్తుల పక్షాన పోరాడతామని ప్రతిన బూనిన పార్టీ. అందుకే.. అనంతపురం నుంచి అనకాపల్లి వరకు జనసేనపై ప్రజలకు గట్టి నమ్మకం.. పవన్ వస్తున్నాడంటే.. తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించే వారు లక్షల్లో ఉన్నారు. అలాంటి ఇమేజ్ సంపాయించుకున్న జనసేనాని, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్.. కొందరు చేస్తున్న పనుల కారణంగా.. పరువు పోగొట్టుకునే పరిస్థితి వస్తోందని..ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన నేత.. అరవ శ్రీధర్ వ్యవహారం.. మరింత శృతిమించింది. ఓ ఉద్యోగినిని లోబరుచుకుని.. ఐదు సార్లు అబార్షన్ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా బాధితురాలే.. మీడియాముందుకువ చ్చి విషయం చెప్పింది. దీనిపై జనసేన అధినేత విచారణ కమిటీ వేశారు. కానీ.. ఏం తేల్చారో.. ఇప్పటికీ తెలియదు. పోనీ.. అది అరవ శ్రీధర్ వ్యక్తిగత వ్యవహారమని పేర్కొన్నా.. మరి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో మరింత బాధ్యతగా ఉండాలనైనా సూచించాలి.
ఈ మొత్తం వ్యవహారం.. చిలికి చిలికి గాలివానగా మారినట్టు.. తాజాగా బాధితురాలిని.. నడిరోడ్డుపై.. అరవ శ్రీధర్ సమక్షంలోనే.. ఆయన ప్రధాన అనుచరుడు తాతంశెట్టి నాగేంద్ర.. పోలీసుల నుంచి లాఠీని లాక్కు ని మరీ చితకబాదడం.. బాధితురాలి వ్యక్తిగత వ్యవహారం అనాలా.. లేక.. అరవ శ్రీధర్ వ్యక్తిగత వ్యవహారం అనాలా? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎదురవుతున్న సమస్య. పూలు కొన్నుకు నేందుకు వచ్చిన బాధితురాలిని గమనించిన ఎమ్మెల్యే వర్గం.. ఆమెను ఉరికించి ఉరికించి చితక్కొట్టడం .. సంచలనంగా మారింది.
అక్కడే ఉన్న పోలీసులు(తమ చేతిలో లాఠీని లాక్కున్నా చోద్యం చూశారు)కానీ.. కారులో కూర్చుకున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కానీ.. ఈ దారుణాన్ని ఆపలేదు. ఇదేసమయంలో బాధితురాలి లాయర్‌ను కూడా చితక్కొట్టి .. ఊరి నుంచి పొమ్మన్నారు. అయితే.. వాస్తవానికి ఈ సమస్య అరవ శ్రీధర్ వ్యక్తిగత మని అనుకున్నా.. అంతిమంగా పార్టీపైనే మచ్చలు , మరకలు పడుతున్నాయి. ఇకనైనా ఈ ఎపిసోడ్‌కు ముగింపు పలకకపోతే.. అది జనసేననై వ్యతిరేక ప్రచారాన్ని తీసుకువస్తుంది.. పార్టీ పరువుకు కూడా భంగం కలిగిస్తుందనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు.