ఏపీ టు ఢిల్లీ.. వార్ మెమోరియల్ సాక్షిగా పవన్ కళ్యాణ్ బిగ్ డెసిషన్?

ఏపీ రాజకీయాల్లో సంచలన విజయంతో కింగ్ మేకర్ గా ఎదిగిన జనసేన పార్టీ, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటుందా? అనే చర్చ జరుగుతోంది.

Update: 2026-06-15 07:16 GMT

ఏపీ రాజకీయాల్లో సంచలన విజయంతో కింగ్ మేకర్ గా ఎదిగిన జనసేన పార్టీ, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటుందా? అనే చర్చ జరుగుతోంది. దేశ సమగ్రత కోరుకుంటూ ఢిల్లీలో ప్రతిష్టాత్మక అశోక హోటల్‌లో జనసేన పార్టీ కీలక సమావేశం సోమవారం నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోపాటు జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ‘జనసేన ప్రస్థానం- జాతీయ సమగ్రత’ అనే ప్రధాన ఎజెండాతో సాగుతున్న ఈ భేటీలో పార్టీ బలోపేతం, జాతీయ సమగ్రతలో పార్టీ పాత్ర, భవిష్యత్ కార్యాచరణపై పవన్ కళ్యాణ్ తన నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారని చెబుతున్నారు. సమావేశం అనంతరం సాయంత్రం 5 గంటలకు పవన్ కళ్యాణ్, పార్టీ కీలక నేతలతో కలిసి ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ (జాతీయ యుద్ధ స్మారకం) వద్ద దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు పుష్పాంజలి ఘటించనున్నారు.

ఢిల్లీలోనే ఈ సమావేశం ఎందుకు?

ప్రాంతీయ పార్టీగా పుట్టిన జనసేన, తన కీలకమైన అంతర్గత సమావేశాన్ని అమరావతిలోనో లేదా హైదరాబాద్ లోనో కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించడం వెనుక బలమైన రాజకీయ, వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ స్థాయి గుర్తింపు కోరుకుంటున్న జనసేనాని ఢిల్లీ వేదికగా ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? అనే ఆసక్తి నెలకొంది. ఏపీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిచి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో జనసేన కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఢిల్లీ వేదికగా సమావేశం పెట్టడం ద్వారా జాతీయ మీడియా, కేంద్ర పెద్దల దృష్టిని ఆకర్షించడం పవన్ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు.

తాము కేవలం ఒక రాష్ట్రానికే పరిమితమైన పార్టీ కాదని, దేశ రాజధానిలో కూడా తమ ఉనికిని చాటగలమని నిరూపించడం పవన్ ప్రధాన వ్యూహాంగా కనిపిస్తోందని అంటున్నారు. అదే సమయంలో తన సమావేశానికి హైదరాబాద్ లో అనుమతి ఇవ్వకపోవడం, కాంగ్రెస్ సర్కారు వైఖరిని ఢిల్లీ వేదికగా ఎండగట్టడం అనే అంశాలపైనా పవన్ ఫోకస్ చేశారని అంటున్నారు. ఇక స్వతహాగా దేశభక్తి, జాతీయ సమగ్రతకు ప్రాధాన్యమిచ్చే తాను ఆ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పాలని భావిస్తూ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని అంటున్నారు. 'వార్ మెమోరియల్' కి వెళ్లడం ద్వారా జనసేన కేవలం ప్రాంతీయ ప్రయోజనాల కోసమే కాకుండా, దేశ రక్షణ జాతీయ భావజాలానికి కట్టుబడి ఉందనే బలమైన సంకేతాన్ని పంపుతున్నారని అంటున్నారు.

జాతీయ స్థాయి విస్తరణపై నిర్ణయం ఉంటుందా?

ఈ సమావేశం ఎజెండాలో ‘జాతీయ సమగ్రత’ అనే పదం ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేన జాతీయ స్థాయికి విస్తరించబోతోందా? అనే ప్రశ్నలకు ఈ సమావేశం సమాధానం ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ లైన్ ను జాతీయవాదంతో ముడిపెట్టడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతానికి ఏపీలో పట్టు సాధించినప్పటికీ, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక లేదా ఇతర ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజల మద్దతు కూడగట్టుకునేలా పార్టీని విస్తరించే ఆలోచనపై ఈ సమావేశంలో ప్రాథమిక చర్చలు జరగొచ్చునని అంటున్నారు.

Tags:    

Similar News