ఆయన టాటా చెప్పారు... వీడుకోలు లేదేమి...కాంగ్రెస్ లాజిక్
అత్యున్నత పదవిని మూడేళ్ళకు పైగా నిర్వహించిన జగదీప్ ధంఖడ్ కి కనీసం వీడ్కోలు అయినా నిర్వహించలేరా అని ఆయన కేంద్ర ప్రభుత్వం పెద్దలను నిలదీస్తున్నారు.;
దేశ రాజకీయ చరిత్రలో ఉన్నత పదవులు ఎందరో అధిరోహించారు. పదవీ విరమణ కూడా చేసారు. కొందరు కొన్ని అనివార్య కారణాలతో పదవుల మధ్యలోనే తప్పుకున్నారు. అయినా సరే అంతా ఒక పద్ధతి ప్రకారమే జరుగుతూ వచ్చేది. అయితే మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖడ్ విషయంలో మాత్రం ఎందుకో ఏవీ సరిగ్గా జరగలేదు అని అంటున్నారు. ఈ బాధ ఆయనకు ఉందో లేదో కానీ కాంగ్రెస్ కి ఎక్కువ బాధగా ఉంది. పైగా కాంగ్రెస్ జతీయ ప్రధాన కార్యదర్శి అయితే జగదీప్ ధంఖడ్ ని ఎక్కువగా తలచుకుంటున్నారు.
సెంచరీ కొట్టినా :
జగదీప్ ధంఖడ్ తన ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసి వంద రోజులు పూర్తి అయ్యాయి అని లెక్క బెట్టి మరీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు కాంగ్రెస్ నేత జై రాం రమేష్. ఆయన జూలై 21న రాత్రి తన పదవికి రాజీనామా చేశారని అయితే ఈ రోజుకీ ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదని జై రాం రమేష్ అంటున్నారు. ఒక రాజ్యాంగ బద్ధమైన పదవిలో దేశంలో రెండవ ఉన్నత స్థానంలో ఉంటూ పదవిని వదులుకున్న జగదీప్ ధంఖడ్ కి జరగాల్సిన విధానంగా అన్ని జరగలేదని ఆయన ఎత్తి చూపిస్తున్నారు.
వీడ్కోలు అయినా లేదా :
అత్యున్నత పదవిని మూడేళ్ళకు పైగా నిర్వహించిన జగదీప్ ధంఖడ్ కి కనీసం వీడ్కోలు అయినా నిర్వహించలేరా అని ఆయన కేంద్ర ప్రభుత్వం పెద్దలను నిలదీస్తున్నారు. ఆయన హఠాత్త్తుగా చాలా ఆశ్చర్యకరంగా తన పదవిని వదులుకున్నారని ఆనాటి సందర్భాన్ని జైరాం రమేష్ మరోసారి గుర్తుకు తెచ్చారు ఆయన ప్రధాని మోడీ పేరుని నిత్యం స్మరిస్తూ వచ్చారు అని ఆయన రాజీనామా చేయడమే విచిత్రం అన్నారు.
మౌన ముద్రలోనే :
రాజీనామా చేసిన నాటి నుంచి కూడా జగదీప్ ధంఖడ్ మౌనముద్రలోనే ఉన్నారని అంటున్నారు. ఆయన అసలు బయట కనిపించడం లేదని కూడా చెబుతున్నారు ఆయన ఏ కారణంగా రాజీనామా చేశారు అన్నది పక్కన పెడితే ఇతర ఉప రాష్ట్రపతుల మాదిరిగా ఆయనకు వీడ్కోలు పలకడం అన్నది చేయాలి కదా అని జైరాం రమేష్ అంటున్నారు. అలాంటి మర్యాదకు వీడ్కోలుకు జగదీప్ ధంఖడ్ అర్హులని ఆయన చెప్పారు. ఇంతకీ ఆయన మాకు ఏమీ స్నేహితుడు కారని నిబంధనల గురించే తాము మాట్లాడుతున్నామని ఆయన చెప్పడం విశేషం.
కారణం ఇంకేదో ఉంది :
మాజీ ఉప రాష్ట్రపతి పదవి వదలడానికి ఆరోగ్యం కారణం కానే కాదని ఇంకేదో ఉందని జైరాం రమేష్ అంటున్నారు. బలమైన కారణం ఉండబట్టే ఈ విధంగా జరుగుతోంది అని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక జగదీప్ ధంఖడ్ ని ఏరి కోరి ఆ పదవిలో కూర్చోబెట్టిన బీజేపీ పెద్దలే ఇపుడు అలా పక్కన పెట్టేశారు అని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ఆయన రాజీనామాకు దారి తీసిన కారణాలు చెప్పాలని జై రాం డిమాండ్ చేస్తున్నారు.
చేస్తారా లేదా :
ఇక కాంగ్రెస్ నేత జై రాం రమేష్ అన్నారని కాదు కానీ ఒక మాజీ ఉప రాష్ట్రపతికి వీడ్కోలు సభ నిర్వహించడం ఆనవాయితీ. మరి దానిని పాటిస్తారా లేదా అన్నది మరోసారి చర్చకు వస్తోంది. నిజానికి చూస్తే ఈ విషయం మీద అధికార పక్షంలో అయితే ఇప్పటిదాకా చర్చ అయితే లేదు, జైరాం రమేష్ లేఖతో చర్చ మాత్రం జరుగుతోంది. అయినా వీడ్కోలు సభ నిర్వహిస్తారా లేదా అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.