దీపికా పదుకునే అవ్వాలనుకుంది.. ఆత్మహత్య చేసుకుంది.. అసలేం జరిగింది?

అవును... జైపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలోని నాల్గవ అంతస్తు నుంచి దూకీ మరణించిన తొమ్మిదేళ్ల బాలిక ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.;

Update: 2025-11-08 06:00 GMT

ఇటీవల కాలంలో ప్రైమరీ స్కూలు దశలోనే ఆడపిల్లలు వేధింపుల బారిన పడుతున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవంబర్ 1న రాజస్థాన్ లోని జైపూర్ లో తొమ్మిదేళ్ల విద్యార్థిని స్కూలు భవనంలోని నాల్గవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో.. స్కూలు యాజమాన్యంపై బాలిక తల్లితండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

అవును... జైపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలోని నాల్గవ అంతస్తు నుంచి దూకీ మరణించిన తొమ్మిదేళ్ల బాలిక ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... సంఘటన జరిగిన రోజు కూడా తన సహ విద్యార్థులు తమ కుమార్తెను వేధిస్తున్నారని పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ టీచర్ పట్టించుకోలేదని.. ఈ ఘటనపై స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.

ఆత్మహత్యకు పాల్పడిన రోజు తమ కుమార్తె కనీసం నాలుగు సార్లు టీచర్ ని సంప్రదించిందని.. ఇందులో భాగంగా తన క్లాస్ రూమ్ లోని కొంతమంది అబ్బాయిలు తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిందని చెబుతున్నారు. అయితే తమ కుమార్తెకు వేధింపులు ఇదే మొదటిసారి కాదని.. గత ఏడాదీ బెదిరింపులు తీవ్రమయ్యాయని బాలిక తల్లి తెలిపారు. దీనిపై ఒకటి రెండుసార్లు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా స్పందించిన బాలిక తండ్రి... టీచర్లకు తెలిసినప్పటికీ తన కుమార్తెపై వేధింపులు, బెదిరింపులూ కొనసాగాయని.. ఒక టీచర్ అయితే, తన కుమార్తె అబ్బాయిలతో రిజర్వ్డ్ గా ఉన్నందుకు నిందించారని కూడా ఆరోపించారు. ఇది కో-ఎడ్యుకేషన్ స్కూల్ అనే విషయం తమ కుమార్తె అర్ధం చేసుకోవాలని టీచర్ బదులిచ్చారని ఆరోపించారు. పోలీసుల దర్యాప్తుపైనా ఆయన స్పందించారు!

ఈ సందర్భంగా.. పాఠశాల శక్తివంతమైనది, ప్రభావవంతమైనదని చెబుతూ అందువల్లే దర్యాప్తు చాలా నెమ్మదిగా సాగుతుందని.. అసలు వాస్తవం ఆ తరగతి గదిలోనే ఉందని.. పోలీసులు ఆ క్లాస్ లోని విద్యార్థులను, ఉపాధ్యాయుడిని సరిగ్గా ప్రశ్నిస్తే ప్రతీదీ స్పష్టమవుతోమని ఆయన అన్నారు.

తమ కుమార్తె ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే అమాయని.. ఆమె ఆల్ రౌండర్ అని, ఎల్లప్పుడూ అవార్డులు గెలుచుకుందని.. ఆమెకు చాలా కలలు ఉండేవని.. ఆమె కల్పనా చావ్లా లాగా, కొన్నిసార్లు దీపికా పదుకునే లాగా, బ్లాక్ పింక్ లోని గాయనిలాగా ఉండాలని కోరుకుందని ఆమె తల్లి వెల్లడించారు.

మరోవైపు పోలీసు వర్గాల సమాచారం ప్రకారం... బిల్డింగ్ పై నుంచి బాలిక పడిన ప్రాంతాన్ని శుభ్రంగా తుడిచిపెట్టారని.. రక్తపు మరకలు ఏమీ కనిపించలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో తమ కుమార్తె అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిందని ఆరోపిస్తూ బాలిక తల్లితండ్రులు స్కూలు యాజమాన్యంపై ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేశారు!

Tags:    

Similar News