ఎందుకలా? ఈ మధ్య పవన్ కు పంచ్ లు లేవేంటి జగన్?
ఏపీ రాజకీయాల్ని చూసినప్పుడు ఒక ఆసక్తికర సన్నివేశం కనిపిస్తోంది. నిజానికి ఈ అంశాన్ని ఎవరూ పెద్దగా గుర్తించటం లేదనే చెప్పాలి.;
ఏపీ రాజకీయాల్ని చూసినప్పుడు ఒక ఆసక్తికర సన్నివేశం కనిపిస్తోంది. నిజానికి ఈ అంశాన్ని ఎవరూ పెద్దగా గుర్తించటం లేదనే చెప్పాలి. కానీ.. జరుగుతున్న పరిణామాల్ని చూసినప్పుడు మార్పు అయితే కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో చంద్రబాబును ఎంతలా అయితే టార్గెట్ చేశారో.. అంతేలా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసేవారు జగన్మోహన్ రెడ్డి. నిజానికి జగన్ వర్సెస్ పవన్ కు ఉన్న కారణాలు ఏమిటన్నది చూస్తే పెద్దగా కనిపించవు. జగన్ తో తాను విభేదించే అంశాలు రాజకీయంగానే తప్పించి.. మరే పంచాయితీ ఆయనతో తనకు లేదన్న విషయాన్ని పవన్ తరచూ చెప్పేవారు.
పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. చేసుకున్న మూడు పెళ్లిళ్లకు నాలుగు పెళ్లిళ్లు అంటూ ప్రతి వేదిక మీదా ప్రస్తావించే వారు జగన్మోహన్ రెడ్డి. చివరకు స్కూల్ పిల్లలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ పవన్ ను.. ఆయన చేసుకున్న పెళ్లిళ్లను వదిలి పెట్టలేదు వైసీపీ అధినేత. దీంతో పవన్ కల్యాణ్ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవారు. చంద్రబాబుకు దత్తపుత్రుడన్న బ్రాండింగ్ చేసేందుకు జగన్ తీవ్రంగానే శ్రమించారు. ఇలా.. పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పటికీ.. పవన్ మాత్రం ఎప్పుడూ జగన్ ను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేసింది లేదు.
పాలనలో కావొచ్చు.. పార్టీ విధానాల్లో కావొచ్చు.. జగన్ తో తనకున్న సైద్ధాంతిక వ్యత్యాసాల గురించి మాత్రమే పవన్ ప్రస్తావించేవారు. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని విశ్లేషించి చూసినప్పుడు.. పవన్ ను జగన్ అండ్ కో టార్గెట్ చేసిన విధానం జనసేనాని పట్ల సానుభూతిని పెంచిందన్న విషయం అర్థమవుతుంది. క్లీన్ చిట్ ఉన్న అధినేతగా పవన్ కున్న ఇమేజ్ తో పాటు.. ఎన్నికల్లో ఓటమి విషయంలో వైసీపీ నేతలు పవన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ‘అయ్యో పాపం’ అనుకునేలా చేశాయన్నది ఎన్నికల ఫలితాల్ని చూసినప్పుడే అర్థమైంది.
తమ రాజకీయ ప్రత్యర్థి.. శత్రువు అయిన చంద్రబాబును టార్గెట్ చేసే క్రమంలో... పవన్ ను అనవసరంగా కెలికి తప్పు చేశామన్న భావనను ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి తర్వాత వైసీపీ నేతల్లో కనిపించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పవన్ వ్యవహరిస్తున్న తీరు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. చెబుతున్న మాటలు కూడా వంక పెట్టేందుకు వీల్లేని విధంగా ఉంటున్నాయి. విమర్శలకు.. ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తోంది.
దీనికి తోడు పవన్ ను టార్గెట్ చేయటం ద్వారా తమకు లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం గుర్తించినట్లుగా కనిపిస్తోంది. జాగ్రత్తగా గమనిస్తే.. ఇటీవల కాలంలో పవన్ ను ఉద్దేశించి ఒక్క మాట అంటే ఒక్క మాట అనకపోవటం కనిపిస్తోంది. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖను చూసినా.. అందులో చంద్రబాబును టార్గెట్ చేయటమే తప్పించి.. మాట వరసకు కూడా పవన్ మీద చిన్న పాటి విమర్శ చేయకపోవటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. పవన్ ను కెలకటం ద్వారా తమకే ఎక్కువ డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని జగన్ గుర్తించినట్లుగా కనిపిస్తోంది. మరి.. ఇదే తీరును మరికొంత కాలం కంటిన్యూ చేస్తారా? లేదా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి.