ఏపీ కాక్రోచులు ఎవరి వైపు ?
ఏపీలో కూడా కాక్రోచులు వస్తాయని వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఏపీలో కూడా కాక్రోచులు వస్తాయని వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిజంగా జగన్ నోట ఈ మాట రావడం విశేషమే. పైగా ఆసక్తికరం కూడా. ఇపుడు దేశంలో కాక్రోచ్ ల జోరు కనిపిస్తోంది. సీజేపీ పేరుతో అభిజిత్ దీప్కే ఒక పోరాటాన్ని నడిపిస్తున్నారు. మరి అందులో ఏపీకి చెందిన కాక్రోచులు ఉన్నాయా లేవా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇకపోతే సీజేపీ తన నిరసన పోరాటంలో భాగంగా ఈ నెల 14న హైదరాబాద్ లో కూడా ధర్నా చౌక్ వద్ద భారీ ఆందోళన చేపడుతోంది. దానికి అభిజిత్ దీప్కే వస్తున్నారు.
ఏపీ అయితే లేదు :
ఇలా దేశంలోని మెట్రో సిటీస్ ని ఎంచుకుని తన ఆందోళలను చేస్తున్న అభిజిత్ అజెండాలో ఏపీ అయితే ప్రస్తుతానికి లేదు,. మరి ఏపీ నుంచి కూడా కాక్రోచులు పెద్ద ఎత్తున సీజేపీ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారా అన్నది కూడా మరో చర్చ. ఎందుకంటే గత నెలలో లీక్ అయిన నీట్ ప్రశ్నపత్రం వల్ల నష్టపోయిన వారిలో ఏపీ వారూ ఉన్నారు. దేశం మొత్తం మీద 20 లక్షల మంది దాకా నీట్ రాశారు. పైగా వీరితో పాటు కుటుంబ సభ్యులు తీసుకుంటే ఆ నంబర్ సులువుగా కోటి దాకా ఉంటుంది. అంతే కాకుండా నీట్ యూజీ లీక్ సీబీఎస్ఈ మూల్యాంకన సమస్యలపైన యూత్ అంతా రగిపోతోంది. దాంతో కాక్రోచులు అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి.
వైసీపీ మార్క్ ట్విస్ట్ :
అయితే నీట్ యూజీ లీక్ సీబీఎస్ఈ మూల్యాంకన సమస్యలు వంటి వాటికి ఏపీలో మెగా డీఎస్సీని కూడా వైసీపీ జత చేసింది. ఆ విధంగా వైసీపీ మార్క్ ట్విస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. వైసీపీ నేతలు అయితే నీట్ కంటే పెద్ద లీకేజ్ మెగా డీఎస్సీ అని అంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ చేసిన వ్యాఖ్యలను చూడాలని అంటున్నారు. నిరుద్యోగ యువత ఆగ్రహంగా ఉన్నారు అన్నది జగన్ చెప్పదలచుకున్న విషయం అని కూడా అంటున్నారు.
పాలక పక్షం మీదనే :
కాక్రోచులు ఉన్నాయి జాగ్రత్త అని వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించడం వెనక వ్యూహాత్మకమైన వైఖరి ఉంది అని అంటున్నారు. సాధారణంగా పాలక పక్షం మీదనే అసహనం ఎవరికి అయినా ఉంటుంది. టార్గెట్ కూడా వారే అవుతారు. పైగా యూత్ ఎక్కువగా అసహనం వ్యక్తం చేస్తుంది. వారికి చదువులు ర్యాంకులు అలాగే జాబ్స్ ఇవన్నీ కూడా సమస్యలుగా ఉంటాయి. వీటి విషయంలో తేడా ఏమైనా జరిగితే యువత తట్టుకోలేదు. లావాలా పొంగుతుంది. అయితే వారిని నడిపించే నాయకత్వం ఉంటే సునామీ కూడా అవుతుంది. ఇపుడు దేశంలో సీజేపీ ఆ పని చేస్తోంది. దాని ప్రభావం దేశమంతటా ఉంటుంది అని అంటున్నారు. దాంతోనే ఏపీలో కూడా కాక్రోచులు ఉన్నాయి అని జగన్ హెచ్చరిస్తున్నారు అని అంటున్నారు.
కొత్త స్ట్రాటజీగా :
ఇక రానున్న కాలంలో యువతరం మద్దతు పొందాలన్నది కూడా వైసీపీ ఆలోచనగా ఉంది. యూత్ అధికార పక్షం మీద ఆగ్రహించినపుడు ఆటోమేటిక్ గా అది ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అవుతుంది. వైసీపీ ఆ లెక్కనే వేసుకుని అదిగో కాక్రోచ్ అని అంటోంది. మరి రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న కూటమి ప్రభుత్వ పెద్దలకు ఈ సంగతి తెలియదా అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఏది ఏమైనా యువతలో అసహనం వస్తే అది హద్దులు దాటిన సముద్రమే అవుతుంది. వైసీపీ అయితే తమకు ఉన్న ప్రతిపక్ష అవకాశాన్ని ఈ విధంగా వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని అనుకుంటోంది. సో ఏపీలో కాక్రోచుల సంగతి ఏమిటి వారి జోరు ఎంత వారి పోరు ఏమిటి అన్నది రానున్న రోజులలో తేలనుంది అని అంటున్నారు.