బాబు పీక్స్ అయితే జగన్ వీక్ నా ?
మాజీ సీఎం వైఎస్ జగన్ ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.;
మాజీ సీఎం వైఎస్ జగన్ ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని విమర్శించే క్రమంలో ఆయన మంచి టైమింగ్ రైమింగ్ తో కొత్త పదాలనే వాడారు. ఎపుడూ ఒకే తరహా విమర్శలు చేస్తే జనాలకు ఎక్కవు. అందునా సోషల్ మీడియా యుగం కాబట్టి వారు చాలా అడ్వాన్స్డ్ గా ఉంటారు. అందుకే రాజకీయ పార్టీలు ఏవైనా అప్టూ డేట్ కావాల్సిందే. ఇక జగన్ విషయం తీసుకుంటే ఆయన చేసే విమర్శలలో ఎక్కువగా రొటీన్ డైలాగ్స్ ఉంటాయి. కానీ ఈసారి జగన్ ప్రెస్ మీట్ సుదీర్ఘంగా సాగినా చాలా విషయాలు టచ్ చేస్తూ వీలైనంత కొత్తదనం నింపే ప్రయత్నం అయితే చేశారు అనుకోవాలి.
క్రెడిట్ చోరీ అంటూ :
చంద్రబాబు పెర్ఫార్మెన్స్ లో వీక్ అని క్రెడిట్ చోరీలో మాత్రం పీక్స్ అని జగన్ కామెంట్స్ చేశారు. బాబు సొంతంగా ఏ డెవలప్మెంట్ ప్రాజెక్టు విషయంలో క్రెడిట్ తీసుకోవాడానికి లేనేలేదని ఆయన మాట్లాడారు. హైటెక్ సిటీ మాజీ సీఎం నేదురుమల్లిది అయితె విశాఖలోని డేటా సెంటర్ వైసీపీ ఆలోచన అని తాము వేసిన విత్తనం అని చెప్పుకున్నారు. అలాగే హైదరాబాద్ లో ఐటీ డెవలప్మెంట్ లో చంద్రబాబు పాత్ర అయితే పెద్దగా లేనే లేదని ఆయన చెప్పుకొచ్చారు.
ఉత్తరాంధ్ర కోసం :
తాము 2020 నుంచి 2023 దాకా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో ఎంతో కృషి చేశామని జగన్ చెప్పారు. అదానీతో ఒప్పందం చేసుకున్నామని అలాగే సీ నుంచి వివిధ దేశాలకు వెళ్ళే సబ్సీ కేబుల్స్ ని సింగపూర్ తో ఒప్పందం చేసుకునే ప్రతిపాదనలు చేశామని అన్నారు. 2023 మేలో తాను స్వయంగా డేటా సెంటర్ ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేశాను అని జగన్ చెప్పారు. అంతే కాకుండా భోగాపురం ఎయిర్ పోర్టు భూవివాదాలు తీర్చి తాము 2023లో శంకుస్థాపన చేశామని అది తమ ఘనత అన్నారు. శ్రీకాకుళంలోని మూలపేటలో పోర్టు నిర్మాణం ఘనత తమదని అన్నారు. మొత్తంగా చెప్పాలీ అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిని తాము ఎంతో కృషి చేసి బాటలు వేశామని జగన్ చెప్పారు.
జగన్ వీక్ అయ్యారా :
సరే ఇవన్నీ చేశామని వైసీపీ అధినేత హోదాలో జగన్ ఓటమి చెందిన పదహారు నెలల తరువాత చెబుతున్నారు, మరీ ముఖ్యంగా చూస్తే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తరువాత మాదే క్రెడిట్ అని చెబుతున్నారు. అదానీ డేటా సెంటర్ అన్నది వైసీపీ హయాంలో ముందుకు వచ్చింది అన్నది వాస్తవం. అయితే అది ఆచరణలో అడుగులు పెద్దగా వేయలేదు, అయినా సరే మేము డేటా సెంటర్ ని తీసుకుని రాబోతున్నామని వైసీపీ చెప్పుకోవలసింది కదా అని అంటున్నారు. అంతే కాదు కూటమి ప్రభుత్వం డేటా సెంటర్ వస్తోంది అన్నప్పుడు అయినా మాదే ఆ ఆలోచన అని కూడా ఎందుకు చెప్పుకోలేకపోయింది అని అంటున్నారు.
చేతులు కాలాక ఆకులు :
ఎయిర్ పోర్టు విషయంలో వైసీపీ తీసుకున్న చొరవను ఎన్నికల వేళ కానీ ఆ ముందూ తరువాత కానీ ఎందుకు చెప్పలేకపోయారు అన్నది కూడా ప్రశ్నగానే ఉంది. ఏది ఏమైనా వైసీపీ ఎంతసేపూ నగదు బదిలీ పధకం పేరు చెప్పుకుంది. జగన్ కూడా తాను ఇన్ని వందల సార్లు బటన్ నొక్కాను ఓటు వేయండి అని ఎన్నికలలో ప్రచారం చేశారు కానీ ఫలనా ప్రాంతానికి తాము ఫలానాది చేశామని లేక చేయాలని అనుకున్నామని ఎక్కడా చెప్పలేదని గుర్తు చేస్తున్నారు. టీడీపీ పబ్లిసిటీ విషయంలో పీక్స్ అని చెబుతున్న వైసీపీ అదే సమయంలో తాను వెరీ పూర్ బాగా వీక్ అని కూడా చెప్పుకోవాలని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ కూడా ఇటీవల కాలంలో శ్రీకాకుళం ఉద్దానం ఆసుపత్రి గురించి చెబుతోంది. తాము కట్టిన మెడికల్ కాలేజీల గురించి చెబుతోంది. అయితే ఏమి చేసినా ఎంత చెప్పినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమని అంటున్నారు. పైగా టీడీపీ తాము చేసింది చేయబోయేది అన్నీ ప్రజలకు చెప్పుకోవడంలో తప్పు లేదని అంటున్నారు. ఇదే న్యూ ట్రెండ్ పాలిటిక్స్ అని అంటున్నారు.