జగన్ ప్లాన్ బీ : అయిపోయిన పెళ్ళికి బ్యాండ్ మేళం
ఇదిలా ఉంటే 2014లోనే అమరావతి రాజధాని అన్న దానికి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు.;
వైసీపీ అధినేత మాజీ సీఎం ఇంకా ఏపీ రాజధానికి ప్లాన్ ఏ ప్లాన్ బీ అని సూచిస్తూ ఉన్నారు. అయితే అమరావతి రాజధాని మీద కేంద్రం పార్లమెంట్ లో బిల్లు పెట్టేసింది. చట్ట బద్ధత వచ్చేస్తోంది. దాంతో ఎవరు అవునన్నా కాదన్నా అమరావతి ఏపీకి రాజధానిగా ఉంటుంది. అయితే జగన్ తాజాగా తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ ప్లాన్ ఏ విశాఖ రాజధానిగా బాగుంటుంది అన్నారు. అయితే తన ప్లాన్ నచ్చలేదు కాబట్టి ప్లాన్ బీగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ మొత్తం 110 కిలోమీటర్ల మేర మావిగాన్ పేరుతో కొత్త రాజధాని ప్రాంతాన్ని ప్రకటించమని కోరారు. జగన్ ప్రతిపాదన వరకూ ఓకే కానీ ఇప్పటికే ఆలస్యం అయింది అన్నది ఆయన గమనించడం లేదని అంటున్నారు.
అమరావతిలోనే అంతా :
ఇదిలా ఉంటే 2014లోనే అమరావతి రాజధాని అన్న దానికి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. ఆ మీదట అక్కడే నిర్మాణం పనులు జరుగుతున్నాయి. గడచిన రెండేళ్ళలో కూడా ప్రపంచ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకోవడంతో పాటు ఆసియన్ బ్యాంక్ నుంచి కూడా రుణాలు తెచ్చి అమరావతి నిర్మాణాలను పట్టాలెక్కిస్తున్నారు. అంతే కాదు అనేక ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించి అక్కడ భూములు కేటాయిస్తున్నారు. ఒక విధంగా చూస్తే అమరావతి రాజధానిగా చేసుకుని ప్రభుత్వం ముందుకు సాతుతోంది. ఈ సమయంలో చట్ట బద్ధత కూడా అమరావతికి వచ్చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ ఇంకా రాజధాని ఎంపికలోనే ఉండిపోయింది అని అంటున్నారు.
ఇది ఇబ్బందికరమే :
వైసీపీ అమరావతిని వ్యతిరేకించమని అంటూనే మరో వైపు ప్లాన్ బీ అంటూ మరో ప్రతిపాదన చేస్తోంది. అయితే ఇందులో వైసీపీ ఎత్తుగడలు ఉండవచ్చు కానీ ఏపీ జనాల మూడ్ కూడా చూసి ఆలోచన చేయాల్సి ఉంటుంది కదా అని అంటున్నారు. ఏపీ ప్రజలకు రాజధాని అన్నది ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. ఇప్పటికే ఉమ్మడి మద్రాస్ నుంచి కర్నూల్ అలాగే ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ రాజధానులను చూసి ఆశలు పెంచుకుని వీడి వచ్చిన చరిత్ర కళ్ల ముందే ఉంది. దాంతో ఏపీ ప్రజలు ఇపుడు కోరుకుంటున్నది తమకంటూ ఒక రాజధాని ఉండాలని. అది ఎక్కడ ఏమిటి ఎలా అన్నది వారికి సెకండరీ. ఈ విషయంలో ఏపీ ప్రజలు అంతా ఫుల్ క్లారిటీ మీద ఉన్నారు, అర్ధం కానిది మాత్రం వైసీపీకే అని అంటున్నారు.
నష్టమే తప్ప :
వైసీపీ ఈ విషయంలో ఎంతలా అతి చేసినా ఎన్ని మాట్లాడినా రాజకీయ నష్టం తప్ప లాభం ఇసుమంతైనా ఉండదని అంటున్నారు. వైసీపీ తాను అధికారంలో ఉన్నపుడు మూడు రాజధానుల ప్రతిపాదన చేసింది. అయిదేళ్ళూ చేతిలో అధికారం ఉండగా ఏమీ చేయలేక చేతులెత్తేసింది. జనాల ఆగ్రహానికి పూర్తిగా గురి అయింది. దాంతో 2024 ఎన్నికల్లో చేదు ఫలితాలు చవి చూసింది. అయినా వైసీపీ వైఖరి మారలేదు అనడానికి తాజాగా ఉదాహరణలు అని అంటున్నారు.
పులి మీద స్వారీ :
వైసీపీ అమరావతి అనే పులి మీద స్వారీ చేస్తోంది. నిజానికి వైసీపీది ఈ సమస్య కాదు, ఆ పార్టీ అధికారంలో లేదు, అమరావతికి ప్రజాభీష్టం ప్రకారం అంగీకరిస్తున్నామని చెప్పి మౌనంగా ఉంటే సరిపోయేది. కానీ అమరావతిని పులిగా మార్చి దాని మీద స్వారీ చేయాలని అత్యుత్సాహం చూపిస్తోంది. దీని పరిణామాలు పర్యవసానాలు కూడా వైసీపీయే అనుభవించాల్సి ఉంటుందని అంటున్నారు. అమరావతి విషయం తీసుకుంటే ఇక ముందుకే సాగుతుంది తప్ప వెనక్కి మళ్ళేది ఉండదు, జగన్ చెబుతున్నట్లుగా చట్ట సవరణలు అసెంబ్లీలో చేసుకోవచ్చు, చట్టాలు కూడా చేయవచ్చు. కానీ రాజధాని వంటి విషయాలు పదే పదే చేస్తామంటే జనాలు హర్షించారు, ఆ రకమైన ప్రకటనలు చేయడం ద్వారా వైసీపీని అధికారంలోకి దూరంగా పెట్టాలని జనాలు నిర్ణయించుకుంటే కనుక అది మరింతగా షాకింగ్ పరిణామం అవుతుంది అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ ఇప్పటికైనా అమరావతి రాజధాని విషయంలో సైలెంట్ గా ఉండడమే బెటర్ అన్న సూచనలు వస్తున్నాయి.