జగన్ ఇమేజ్ : లక్ష కోట్ల నుంచి తల్లీ చెల్లీ దాకా !
ఏపీలో వైసీపీ అధినేత రాజకీయ ప్రస్థానం ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి. అంతే కాదు ఎంతో భిన్నంగా సాగుతోందని కూడా ఒప్పుకోవాలి.;
ఏపీలో వైసీపీ అధినేత రాజకీయ ప్రస్థానం ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి. అంతే కాదు ఎంతో భిన్నంగా సాగుతోందని కూడా ఒప్పుకోవాలి. ఆయన ట్రెడిషనల్ పొలిటీషియన్ గా ఎక్కడా కనిపించరు. రొటీన్ రాజకీయాల జోలికి అసలే పోరు. అంతే కాదు ఆయనది అంతా డైరెక్ట్ కనెక్షన్. అది కూడా ప్రజలతోనే. పార్టీ వ్యవస్థ, నాయకులు క్యాడర్ వీటిని మించి ఆయన జనం వైపే ఎక్కువగా చూస్తారు, దాని మీదనే ఎక్కువ ఆధారపడతారు, విశ్వసిస్తారు. ఆ తరువాత రెండో వైపు చూసేది ఆలోచించేది దేవుడి వైపే. ఇలా చూస్తే కనుక గడచిన ఎనభై దశాబ్దాల దేశ రాజకీయాల్లో జగన్ లాంటి నాయకుడు మరొకరు లేరనే చెప్పాల్సి ఉంటుంది. ఆయన పంధావే వేరు, తాను ఏది నమ్మితే అదే ఆచరిస్తారు, అందులో కష్టం నిష్టూరం నింద అయినా పూర్తిగా తానే భరిస్తారు.
లో ప్రొఫైల్ :
సాధారణంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా నాయకులను చూసినపుడు వారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎపుడూ మీడియాలో కనిపించాలని చూస్తారు. ప్రతీ నిత్యం, ప్రతీ నిముషం కూడా తమ గురించి చెప్పుకుంటూ పబ్లిసిటీ కోరుకుంటారు. కానీ జగన్ మాత్రం ఒక మీడియా అధిపతి అయి ఉండి దీనికి చాలా దూరంగా ఉంటారు. ఆయనది డైరెక్ట్ స్పీచ్. అంటే ప్రజలతో మాట్లాడడమే. ఈ మధ్యలో ఉన్న మీడియాని మాధ్యమాలను ఆయన పెద్దగా పట్టించుకోరు. ఆయన ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నాయకుడు అయి ఉండి కూడా రోజుల తరబడి ఆయన ఊసు లేకుండా గడచిపోతుంది. అంతే కాదు తన మీద విమర్శలు వచ్చినా ఆయన స్వయంగా వచ్చి రిప్లై ఇచ్చిన సందర్భాలు బహు తక్కువ. దేనిని అయినా జనం ముందు పెట్టి వారే తీర్పు ఇవ్వాలని అనుకుంటారు.
కేరాఫ్ వైఎస్సార్ గా :
ఇక జగన్ తన తండ్రి వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు కొన్ని వివాదాలలో విపక్షాలు ఆయన పేరు జోడించాయి. ఆ సమయంలో కూడా ఆయన పెదవి విప్పింది లేదు, ఇక 2009లో ఆయన కడప నుంచి ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. ఇక కేవలం మూడు నెలల ఎంపీగా ఉండగా తన తండ్రి వైఎస్సార్ మరణంతో ఆయన తొలిసారి జనం ముందుకు వచ్చారు. నల్లకాలువ వద్ద ఆయన తొలి స్పీచ్ తో జనాలు అంతా కేరాఫ్ వైఎస్సార్ గానే చూశారు. అలా జగన్ సొంత రాజకీయం అడుగులు మొదలయ్యాయి అని చెప్పాలి.
లక్ష కోట్ల ఆరోపణలు :
ఇక జగన్ తాను తొలిసారి కడప నుంచి ఎంపీగా గెలిచారు, ఆయనతో పాటు తల్లి విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో జగన్ మీద వచ్చిన తొలి ఆరోపణలు ప్రత్యర్ధులు చేసినవి ఏంటి అంటే తన తండ్రి శవం ఉండగానే సంతకాలు ఎమ్మెల్యేలతో చేయించుకుని సీఎం కావాలని చూశారు అని. అది నిందో నిజమో జగన్ ఏ రోజూ పెదవి విప్పి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వలేదు. ఆయన అనుచరులు అభిమానులే అనేక సార్లు వాటి మీద స్పందించారు. ఇక ఉప ఎన్నికల్లో గెలిచి 2014 ఎన్నికలకు ఏపీలో టీడీపీకి గట్టి పోటీగా జగన్ నిలిచిన నాడు 2014 ఎన్నికల్లో జగన్ మీద వచ్చిన అతి పెద్ద ఆరోపణ అవినీతి అక్రమాలకు సంబంధించినదే. ఆ సమయంలో ఆయన పదహారు నెలలు జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చారు. దాంతో జగన్ లక్ష కోట్ల అవినీతి చేశారు అని ప్రత్యర్ధులు ఊరూ వాడా ప్రచారం చేశారు. అయినా జగన్ నుంచి ఒక్క వివరణ కూడా రాలేదు, ఆ సమయంలోనూ ఆయన వెంట ఉండేవారే వివరణ ఇచ్చారు. ఇక ప్రజలు కూడా ఆ ఎన్నికల్లో జగన్ పార్టీకి 45 శాతం ఓటు షేర్ 67 ఎమ్మెల్యే ఎనిమిది ఎంపీ సీట్లు ఏపీలో కట్టబెట్టారు.
బాబాయ్ గొడ్డలి వేటు :
కట్ చేస్తే 2019 ఎన్నికల్లో జగన్ మీద మరో తీవ్రమైన ఆరోపణ వచ్చింది. ఆ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సొంత బాబాయ్ వివేకా హత్య జరిగింది. దాంతో బాబాయ్ గొడ్డలి పోటు అంటూ ప్రత్యర్ధులు పదే పదే విమర్శలు చేశారు. దానికి సైతం జగన్ నుంచి వివరణ అయితే లేదు, ఇక వైసీపీ వారే తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు 22 ఎంపీ సీట్లు దక్కాయి. ఇక 2024 ఎన్నికల్లో అయిదేళ్ళ పాలన అనంతరం జగన్ ప్రజా తీర్పు కోరారు. ఆ సమయంలో తల్లీ చెల్లికి తీరని అన్యాయం అంటూ ఆరోపణలు ప్రత్యర్ధులు చేశారు. జగన్ సొంత చెల్లెలు షర్మిల కజిన్ సునీత సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాంతోనే వైసీపీకి ఎన్నడూ లేని విధంగా 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఓటు షేర్ మాత్రం 40 శాతానికి తగ్గకపోవడం విశేషం. ఇక్కడా జగన్ నుంచి ఈ ఆరోపణల మీద వివరణ కానీ తిప్పి కొట్టే ప్రయత్నం కానీ జరగలేదు.
నేరుగానే తల్లి :
ఇక లేటెస్ట్ గా చూస్తే ఈసారి నేరుగానే తల్లి విజయమ్మ జగన్ మీద లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. చూడబోతే ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్న చర్చ సాగుతోంది. 2029 లో విజయమ్మ ప్రత్యక్షంగా ఎన్నికలలో జగన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు కానీ ఈ విధంగానే లేఖలు వీడియోలు ఏవైనా రిలీజ్ చేస్తే ఎలా వైసీపీ తట్టుకుంటుందన్న చర్చ ఉంది. ఇక ఈ విషయంలో కూడా జగన్ అయితే ఏనాడూ పెదవి విప్పింది లేదు, తన ఆస్తుల గురించి ఆయన మీడియాకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు ఇక్కడా ఆయన జనం మీదనే తీర్పు వదిలేసినట్లుగా ఉంది అంటున్నారు.
విశ్లేషణ ఇదేనా :
ఇక జగన్ రాజకీయాలు ఆయన మీద వచ్చిన అనేక తీవ్రమైన ఆరోపణలు మరో నేత మీద వచ్చి ఉంటే సీఎన్ ఎలా ఉండేదో తెలియదు కానీ జగన్ అయితే జనంతో ఒక కనెక్షన్ అయితే గట్టిగానే పెట్టుకున్నారు అనుకోవాలి. అంతే కాదు ఈ రోజుకీ వైసీపీకి నూటికి నలభై మంది మద్దతు ఉంది. ఇక ఓటర్లు ఆలోచించేది ఒక్కటే. రాజకీయ నేతల వ్యక్తిగతాలను వారు పెద్దగా సీరియస్ గా తీసుకోరని, అలా తీసుకుంటే చాలా మందికి ఈ రోజు ఉన్నత పదవులు ఉండవు. ఇక వారు చూసేది తమకు ఆయా నేతలు ఇచ్చే హామీలు, తమ జీవితాలలో మార్పులు. ఇవే కొలమానంగానే ఎన్నికలలో తీర్పులు వస్తూంటాయి. 2024 లో వైసీపీ ఓటమి కావడానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి. ప్రత్యేకించి యాంటీ ఇంకెంబెన్సీ కూడా ఉంది. 2029 నాటికి వైసీపీ విపక్షంలో ఉంటుంది, కూటమికి ఉండే యాంటీ ఇంకెంబెన్సీని ఎలా తన వైపునకు ఓట్లుగా మార్చుకుంటుంది అన్న దానిని బట్టే విజయావకాశాలు ఉంటాయి ఇక ఈ ఆరోపణలు అన్నీ 2024 నాటివే కాబట్టి అప్పటికి పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు అన్న విశ్లేషణలు ఉన్నాయి. సో చూడాలి మరి ఏమి జరుగుతుందో.