అరెస్టు ప్రచారం వేళ జగన్ భారీ యాక్షన్ ప్లాన్ !

అంతే కాదు జగన్ 2027లో ప్రారంభించాల్సిన పాదయాత్రను కాస్తా ముందుకు తీసుకుని రావాలని సలహా ఇస్తున్నారుట.;

Update: 2025-07-22 17:44 GMT

బిగ్ బాస్ అని ఒకరు జగన్ అరెస్టు అవుతారని మరి కొందరు ఇలా వైసీపీ అధినేత జగన్ విషయంలో ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. మొత్తం లిక్కర్ స్కాం లో దాదాపుగా అందరినీ అరెస్టు చేశారు అని ఇక బిగ్ బాస్ మిగిలారని అతి పెద్ద తిమింగలం అని అంటున్నారు. కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు అయితే ఓపెన్ గానే జగన్ పేరు చెబుతున్నారు.

మరి వైసీపీలో అయితే ఈ విషయం మీద వాడిగా వేడిగా చర్చ సాగుతోంది అని అంటున్నారు. జగన్ అరెస్టు అవుతారు అనుకుంటే ఎలా దానిని ఎదుర్కోవడం అన్న దాని మీద పార్టీ నేతలు చర్చిస్తున్నారు. మరో వైపు చూస్తే జగన్ ప్రజలలో మరింతగా ఉండాలని ఆయన జోరు పెంచాలని కీలక నేతలు సూచిస్తున్నారు.

అంతే కాదు జగన్ 2027లో ప్రారంభించాల్సిన పాదయాత్రను కాస్తా ముందుకు తీసుకుని రావాలని సలహా ఇస్తున్నారుట. జగన్ జనంలో ఉండగా అరెస్టు చేస్తే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్ లో ఉంటుందని కూడా సూచిస్తున్నారు. జగన్ అయితే వారాంతంలో బెంగళూరులో ఉంటున్నారు. వారంలో నాలుగు రోజుల పాటు తాడేపల్లి లో ఉంటున్నారు.

అయితే జగన్ ని బెంగళూరు లో అరెస్టు చేసినా లేక తాడేపల్లి లో అరెస్టు చేసినా ప్రభావం ఒక విధంగా ఉంటుందని అదే ఆయన జనంలో ఉంటూ వారిని కలుస్తూ వారి మధ్య ఉంటూ అండర్ కరెంట్ గా వారితోనే మమేకం అవుతూంటే అపుడు ఈ అరెస్టు చేస్తే దాని ప్రభావం పీక్స్ లో ఉంటుందని అంటున్నారు.

దాంతో పాదయాత్రను తొందరలో జగన్ ప్రకటించబోతారు అన్న ప్రచారం అయితే సాగుతోంది. జిల్లా పర్యటనలు జగన్ చేయాలని మొదట్లో అనుకున్నా ఇపుడు దానిని కాస్తా పాదయాత్రకు మార్చారని అంటున్నారు. జిల్లా పర్యటనలు అంటే ప్రభుత్వం ఏ విధంగానూ అనుమతులు ఇవ్వడం లేదని వైసీపీ పెద్దలు భావిస్తున్నారుట.

అయితే ఉన్నట్లుండి జగన్ పాదయాత్ర అందునా కేవలం 13 నెలలకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభిస్తే రాజకీయంగా ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అన్న చర్చ కూడా ఉందిట. అయితే ఏకధాటిగా పాదయాత్ర కాకుండా నాలుగు దశలుగా ప్లాన్ చేసుకుంటూ ఒక్కో దశలో ఒక్కో రీజియన్ లో మారు మూల గ్రామాలలో పర్యటిస్తూ నెమ్మదిగా నాలుగేళ్ళ పాటు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని అనుకుంటున్నారుట.

అలా చేసినా క్యాడర్ కానీ లీడర్ కానీ ఇప్పటి నుంచే పాదయాత్రకు అయ్యే ఖర్చుని భరించగలరా అన్నది మరో చర్చ. అధినాయకత్వమే ఈ మొత్తం ఖర్చులు పెట్టుకుని జనంలోకి వెళ్తే బాగుంటుంది అన్న సూచనలు వస్తున్నాయట. ఏది ఏమైనా జగన్ అరెస్ట్ మామూలుగా ఉండరాదని ఆయనను ఒక వేళ కక్ష సాధింపుగా జైలులో పెట్టాలని చూసినా జనాల మధ్య నుంచే జగన్ వెళ్ళేలా ఉండాలని ఆ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారుట. దాని వల్ల బ్రహ్మాండమైన సానుభూతి అయితే వస్తుందని కూడా లెక్క వేస్తున్నారుట. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News