మీ దిష్టే తెలంగాణకు తగిలింది.. పవన్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్

గోదావరి జిల్లా పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయిందని, తెలంగాణ నాయకుల దిష్టి తాకడం వల్లే గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయనే పవన్ వ్యాఖ్యలను జగదీష్ రెడ్డి ఖండించారు.;

Update: 2025-11-27 12:20 GMT

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఓ రేంజ్ లో ఫైర్ అయింది. తెలంగాణ నేతల దిష్టితోనే కోనసీమ ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు మోడువారాయని, కోనసీమ అందాలు అదృశ్యమయ్యయని పవన్ బుధవారం వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కోనసీమ పచ్చదనమే శాపంగా మారి రాష్ట్ర విభజనకు కారణమైందని తనకు అనిపిస్తుంటుందని పవన్ సరదాగా అన్నారు. బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ పర్యటించగా, కొబ్బరి రైతులతో ముఖాముఖిలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో తెలంగాణ నేతల ప్రస్తావన తేవడంతో బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కౌంటర్ ఎటాక్ చేశారు.

గోదావరి జిల్లా పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయిందని, తెలంగాణ నాయకుల దిష్టి తాకడం వల్లే గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయనే పవన్ వ్యాఖ్యలను జగదీష్ రెడ్డి ఖండించారు. పవన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తెలివితక్కువ మాటలు అంటూ జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘అసలు మా దిష్టి తాకడం వల్ల కాదు.. ఇన్నేళ్లు వాళ్ల దిష్టి మా తెలంగాణకు తాకిందని జగదీష్ రెడ్డి ఎదురుదాడి చేశారు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవిపై పరోక్షంగా ప్రస్తావిస్తూ మెదడు వాడకుండా, నోటికొచ్చినట్లు మాట్లాడేవాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారని ఎద్దేశా చేశారు. హైదరాబాద్ నుంచి ఎవరూ కోనసీమకు వెళ్లి రాలేదని, ప్రతి రోజూ అక్కడి నుంచే వేలాది మది హైదరాబాదు వస్తున్నారని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాగా, పవన్ వ్యాఖ్యలు వాటికి బీఆర్ఎస్ కౌంటరు ఇవ్వడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా కొనసాగుతున్న పవన్.. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పవన్ కు సత్సంబంధాలు ఉన్నాయని చెబుతారు. అందుకే పవన్ రాజకీయంగా కేసీఆర్ ప్రత్యర్థులతో ఉన్నప్పటికీ ఆయనపై కేసీఆర్, కేసీఆర్ పై పవన్ ఇంతవరకు విమర్శలు చేసుకోలేదని అంటున్నారు. ఇక కేటీఆర్, హరీశ్ రావు సైతం పవన్ తో విభేదిస్తున్నట్లు ఇంతవరకు మాట్లాడలేదు. కానీ, జగదీష్ రెడ్డి మాత్రం తాజా పవన్ వ్యాఖ్యలపై దీటుగా సమాధానం చెప్పడం చూస్తుంటే ఏపీ డిప్యూటీ సీఎం పట్ల బీఆర్ఎస్ వైఖరి మారుతుందా? అన్న చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News