ఇరాన్ అధికారిక టోల్.. బ్యారెల్ మీద అదనపు భారం ఎంత?
కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య యుద్ధం జరిగినా.. దాని ప్రభావం ఒక స్థాయి వరకు మాత్రమే పడింది;
కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య యుద్ధం జరిగినా.. దాని ప్రభావం ఒక స్థాయి వరకు మాత్రమే పడింది. కానీ.. పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య జురుగుతున్న యుద్ధం ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అన్నింటికి మించి హర్మూజ్ జలసంధి ద్వారా ముడిచమురు దిగుమతి చేసుకునే దేశాల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.అన్నింటికి మించి మన దేశంలో వినియోగించే చమురులో దాదాపు 88 శాతానికి పైనే దిగుమతుల మీద ఆధారపడే పరిస్థితుల్లో.. తాజా యుద్ధం భారత్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. చమురు రవాణాకు కీలకంగా మారిన హర్మూజ్ జలసంధి వద్ద అనధికారిక టోల్ వసూలు చేస్తున్న ఇరాన్.. తాజాగా అందుకు భిన్నంగా అధికారిక టోల్ వసూలు చేయటం సంచలనంగా మారింది.
దీనికి సంబంధించి ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ ఆమోదముద్ర వేయటంతో.. ఈ జలసంధి ద్వారా ప్రయాణించే నైకలపై ఇక నుంచి అధికారికంగా టోల్ విధించేలా నిర్ణయం తీసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. అంతర్జాతీయ జలాలకు టోల్ విధించే కొత్త పరిణామాన్ని చూస్తున్నామని అమెరికాతో సహా జీ7 దేశాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఒక్కో చమురు ట్యాంకర్ పై గరిష్ఠంగా రూ.18.90 కోట్ల మొత్తాన్ని వసూలు చేయాలని ఇరాన్ డిసైడ్ అయ్యింది. దీంతో.. బ్యారెల్ ముడి చమురు మీద పడే అదనపు భారం ఎంత? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
హర్మూజ్ పై ఇరాన్ సార్వభౌమాధికారాన్ని పెంచటమే లక్ష్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ కు చెందిన నౌకల రాకపోకలపై బ్యాన్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. తాజాగా నిర్దేశించిన టోల్ కు సంబంధించిన రూల్స్ ను పూర్తి చేసిన 26 నౌకలు హర్మూజ్ జలసంధిని దాటినట్లుగా తెలుస్తోంది. దీనికి అవసరమైన పత్రాలు.. క్లియరెన్స్ కోడ్ లను పొందారని చెబుతున్నారు. ఈ తీరుపై అమెరికా సహజంగానే ఖండించింది. జలసంధిపై టెహ్రాన్ నియంత్రణను ప్రపంచ దేశాలు అంగీకరించమని అమెరికా వ్యాఖ్యానించింది.
ఇదిలా ఉంటే.. ఇరాన్ తాజాగా డిసైడ్ చేసిన అధికారిక టోల్ భారం ఎంత పడుతుంది? అన్నది ప్రశ్నగా మారింది. ఈ లెక్కల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. సాధారణంగా ఈ జలసంది ద్వారా ప్రయాణించే భారీ చమురు ట్యాంకర్లు సాధారణంగా 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును రవాణా చేసే సామర్థ్యం ఉన్నాయని చెబుతారు. ఒక్కో నౌకలో 2.70 లక్షల నుంచి 3 లక్షల టన్నుల వరకు ఇంధనం ఉంటుందని చెబుతున్నారు.
సాధారణంగా ఒక వీఎల్ సీసీ ట్యాంకర్ 2 మిలియన్ బ్యారెళ్లు (20 లక్షల) ముడి చమురు ఉంటే.. రూ.18.9 కోట్ల టోల్
ను 20 లక్షల బ్యారెళ్లతో లెక్క వేస్తే.. ఒక్కో బ్యారెల్ మీద పడే అదనపు భారం సుమారు రూ.94.50తో సమానం అవుతుంది. అదే మధ్యస్త స్థాయి నౌకల్లో ఒక మిలియన్ బ్యారెళ్లు (పది లక్షలు) సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటిపై పడే భారం ఒక్కో బ్యారెల్ మీద సుమారు రూ.189 పడుతుంది. ఈ లెక్కను ఒక్కో లీటర్ మీద పడే అదనపు భారం ఎంత? అన్నది చూస్తే మరింత స్పష్టత వస్తుంది.
భారీ (వీఎల్ సీసీ) నౌక 20 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం ఉన్న నౌక మీద పడే భారం ఒక్కో బ్యారెల్ మీద పడేది రూ.94.50. అంటే.. ఒక్కో లీటరు మీద పడే అదనపు భారం దగ్గర దగ్గర 60పైసలు అవుతుంది. అదే మధ్యస్థ నౌక విషయానికి వస్తే 10 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం ఉండే నౌకల మీద పడే భారం కూడా అంతే మొత్తం ఉంటుంది. అలాంటప్పుడు ఒక్కో బ్యారెల్ మీద పడే భారం రూ.189. అంటే.. ఒక్కో లీటరుపై పడే అదనపు భారం సుమారు రూ.1.19 వరకు ఉంటుంది.
ఈ భారం లీటరు లెక్కలో చూసినప్పుడు పెద్ద భారంగా అనిపించకపోవచ్చు కానీ యుద్ధం కారణంగా పెరిగిన బీమా ప్రీమియంలు.. రవాణా రిస్కు ఛార్జీలు పెరగటంతో ఒక్కో లీటరు మీద తక్కువలో తక్కువ రూ.4 వరకు భారం పడుతుంది. ఇదే కాదు.. బ్యారెల్ ధర యుద్ధానికి ముందు 70 -80 డాలర్లు ఉంటే.. ఇప్పుడు 105 డాలర్లకు పైనే పెరగటంతో మొత్తంగా పడే భారం భారీగా ఉంటుందని చెప్పాలి. దీనికి సంబంధించిన చిన్న లెక్కతో ఒక్కో లీటరు ముడి చమురు మీద పడే ప్రభావాన్ని లెక్క చూస్తే..
యుద్ధానికి ముందు ముడి చమురు బ్యారెల్ 75 డాలర్లు (మన రూపాయిల్లో చెబితే రూ.6300), బీమా ఒక్కో బ్యారెల్ మీద 0.15 డాలర్లు (రూపాయిల్లో చెబితే రూ.12.6) ఇరాన్ టోల్ అప్పుడు లేదు, రవాణా ఖర్చులు బ్యారెల్ మీద 1.5 డాలర్లు (రూపాయిల్లో చెబితే రూ.126) మొత్తంగా ఒక బ్యారెల్ దగ్గర దగ్గర 76.6 డాలర్లు ఉండేది. అంటే.. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.6438.
తాజాగా మారిన లెక్కను బ్యారెల్ చొప్పున లెక్కిస్తే.. బ్యారెల్ ముడి చమురు ధర 105 డాలర్లకు చేరింది (మన రూపాయిల్లో రూ.8820) బీమా 4.76డాలర్లు (మన రూపాయిల్లో రూ.400) ఇరాన్ టోల్ 1.13 డాలర్లు (రూ.95) రవాణా 4.5 డాలర్లు (మన రూపాయిల్లో రూ.378) మొత్తంగా ఒక బ్యారెల్ ముడి చమురు భారత్ చేరే నాటికి 115.4 డాలర్ల వరకు అవుతుంది. అంటే మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.9700గా చెప్పొచ్చు. యుద్ధానికి ముందు.. ఇప్పటికి ఒక బ్యారెల్ మీద పడిన అదనపు భారం 38.7 డాలర్లు అంటే రూ.3254. బ్యారెల్ ను లీటరు కింద లెక్కిస్తే.. అదనపు భారం లీటరు మీద రూ.20.50 పెరిగిందని చెప్పాలి.
ఇక్కడితో లెక్కలు పూర్తి కాలేదు. ఇది కేవలం ముడి చమురు మన దేశానికి వచ్చే వరకు లెక్క మాత్రమే. మారిన పరిస్థితుల్లో గతంతో పోలిసతే శుద్ధి ఖర్చులు, డీలర్ కమిషన్, కేంద్ర ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర వ్యాట్ లాంటివి కలిపితే.. మరింత భారీగా ధర పెరుగుతుంది. అయితే.. ముడి చమురుపై పెరిగిన ధరల భారాన్ని కేంద్రం తన పన్నుల్ని తగ్గించటం ద్వారా ప్రజల మీద అదనపు భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి.