ఇరాన్ లో ఊచకోత.. 3 వేలు కాదు 30 వేలపైగా మరణాలు.. నిజమెంత?
టైమ్ కథనం ప్రకారమే చూస్తే.. ఆ రెండు రోజుల్లో ఇరాన్ వీధులు రక్తసిక్తం అయ్యాయి. నిరసనకారలు- ప్రభుత్వ బలగాల మధ్య హింసాత్మక ఘటనల్లో 30 వేలమంది చనిపోయినట్లు పేర్కొంది.;
కుంకుమపువ్వు నెత్తురోడిందా? వేలాదిమంది రక్తంతో ముద్దయిందా?? దీనికి ఔననే సమాధానం చెబుతోంది పశ్చిమ దేశాల మీడియా. ఇరాన్ లో ఈ నెల ప్రారంభంలో జరిగిన నిరసనలను అక్కడి ప్రభుత్వం అణిచివేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వేలాది మందిని హతమార్చినట్లుగానూ కథనాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇలాంటిదే ఓ కథనాన్ని తాజాగా టైమ్ పత్రిక వెలువరించింది. కరెన్సీ విలువ పడిపోవడం, ధరల పెరుగుదలతో పాటు స్వేచ్ఛ కోరుతూ ఇరాన్ ప్రజలు గత డిసెంబరు చివరి నుంచి వీధుల్లోకి రాసాగారు.
ఈ నెల 8వ తేదీకి వచ్చేసరికి ఈ నిరసన తీవ్ర రూపం దాల్చింది. దీంతో సంప్రదాయ వాదుల సారథ్యంలోని ప్రభుత్వం తొక్కిపెట్టేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో 3 వేల మంది చనిపోయినట్లు తెలిసింది. కానీ, ఈ సంఖ్య 30 వేలు దాటి ఉంటుంది అని టైమ్ పత్రిక చెబుతోంది. కేవలం 8, 9 తేదీల్లోనే ఈ మరణాలు సంభవించినట్లు పేర్కొంది.
వీధులన్నీ రక్తసిక్తం?
టైమ్ కథనం ప్రకారమే చూస్తే.. ఆ రెండు రోజుల్లో ఇరాన్ వీధులు రక్తసిక్తం అయ్యాయి. నిరసనకారలు- ప్రభుత్వ బలగాల మధ్య హింసాత్మక ఘటనల్లో 30 వేలమంది చనిపోయినట్లు పేర్కొంది. స్థానిక అధికారులను ప్రస్తావిస్తూ ఈ మేరకు రాసుకొచ్చింది. ఇరాన్ భద్రతా దళాలు ఊచకోత కోశాయని.. దీంతో అంబులెన్సుల స్థానంలో డెడ్ బాడీలను 18 చక్రాల ట్రక్కుల్లో తరలించాల్సి వచ్చిందని తెలిపింది. కాగా, ఇరాన్ లో ఏం జరిగినా సాధారణ సందర్భాల్లోనే పెద్దగా బయటకు రాదు. అలాంటిది ఆందోళనలు ఇంత తీవ్రంగా ఉండగా జరిగిన మారణహోమం వివరాలు తెలియడం కష్టమే.
ఇంటర్నెట్ లేదు..
4 వేలకు మించిన ప్రాంతాల్లో ఆందోళనలు ఉగ్రరూపం దాల్చడంతో ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ ను బంద్ చేసింది. దీంతో అసలేం జరిగిందో ఎవరికీ స్పష్టమైన అంచనా ఉందదు. 3,117 మంది చనిపోయారని ఈ నెల 21న ప్రభుత్వం తెలిపింది. కానీ, 8, 9 తేదీల్లో 30 వేల మందిపైనే హత్యకు గురైనట్లు టైమ్ చెబుతోంది. అమెరికా నుంచి పనిచేసే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ల న్యూస్ ఏజెన్సీ.. 5,459 మరణాలను ధ్రువీకరించింది. 17వేలకు పైగా మరణాల కారణాలను విశ్లేషిస్తోంది.
నమ్మొచ్చా? లేదా?
ఇరాన్ అంటే అమెరికాకు ఆగర్భ శత్రువు. అలాంటి దేశంపై ఎప్పుడు దాడి చేయాలా? అని చూస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే అమెరికాకే చెందిన టైమ్ పత్రిక కథనాన్ని నమ్మడం కష్టమే. పైగా, అమెరికా ఎవరినైనా టార్గెట్ చేసుకుంటే ముందుగా దానిపై విద్రోహి ముద్ర వేస్తుంది. ఈ క్రమంలోనే ఇరాన్ లో ఆందోళనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రోత్సహించారు. ఇప్పుడు మీడియా ద్వారా మరో విధంగానూ ప్రచారం చేస్తున్నారు. ఆఖరికి.. ఇరాన్ పై తమ దాడిని సమర్థించుకోవడానికే ఇలా చేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. నిజం ఏమిటో.. ఇరాన్ ప్రజలకే తెలియాలి.