400 కిలోల యురేనియం... ఇరాన్ సీక్రెట్ ప్లేస్ పై ఇజ్రాయెల్ కీలక వ్యాఖ్యలు!

అయితే... అమెరికా దాడి చేసే సమయానికే ఫోర్డో నుంచి యురేనియాన్ని ఇరాన్ తరలించేసినట్లు అనుమానిస్తున్నారు.;

Update: 2025-06-23 09:30 GMT
400 కిలోల యురేనియం... ఇరాన్  సీక్రెట్  ప్లేస్  పై ఇజ్రాయెల్  కీలక వ్యాఖ్యలు!

అమెరికా బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో ఇరాన్‌ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. అత్యంత కీలకమైన ఫోర్డో తో పాటు నతాంజ్‌, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది. ఈ సమయంలో ఇరాన్ వద్ద ఉన్నట్లు చెబుతున్న సుమారు 400 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఎక్కడ అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉండగా.. ఆ సీక్రెట్ ప్లేస్ తమకు తెలుసని ఇజ్రాయెల్ అంటోంది.

అవును... అసలు ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధానికి కారణమే.. టెహ్రాన్ మోతాదుకు మించి యురెనియంను శుద్ధి చేస్తుందని.. వీటిలో అణ్వాయుధాలను తయారు చేసే ప్రయత్నాల్లో ఉందని! తాజాగా ఇరాన్ పై అమెరికా దాడులకు అదే అసలైన కారణం! అయితే.. ఇజ్రాయెల్, అమెరికా ఆరోపిస్తున్నట్లు ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం జాడ మాత్రం బయటలు రాలేదు. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.

వాస్తవానికి... అణుబాంబు తయారీకి అవసరమైనట్లుగా 60 నుంచి 90 శాతం మధ్యలో శుద్ధి చేసి యూరేనియం - 235ను తయారుచేస్తోందన్నది అనేది ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్‌ ఆరోపణ. ఇదే సమయంలో... ఇరాన్‌ న్యూక్లియర్‌ ప్లాంట్లలో 60శాతం శుద్ధి చేసిన 400 కేజీల యురేనియం ఉందని.. దీనిని కొన్ని రకాల ఆయుధాల్లో వాడే అవకాశం ఉందనేది మరో ఆరోపణ.

అయితే... అమెరికా దాడి చేసే సమయానికే ఫోర్డో నుంచి యురేనియాన్ని ఇరాన్ తరలించేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ సందేహానికి కారణం ఉపగ్రహ చిత్రాలు! ఇందులో భాగంగా... జూన్‌ 19-20 రాత్రి ఉపగ్రహ చిత్రాల్లో ఫోర్డో అణుశుద్ధి కేంద్రం వద్ద భారీ సంఖ్యలో ట్రక్కులు ఇతర వాహనాలు బారులు తీరి కనిపించాయని.. 16 కార్గో ట్రక్కులు అణు కేంద్రం సొరంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

దీనికి బలం చేకూర్చేలా... అమెరికా దాడులు చేసిన ఇరాన్ అణుకేంద్రాల వద్ద నుంచి రేడియేషన్‌ వెలువడినట్లు ఎక్కడా ఆధారాలు లేవని అంటున్నారు. దీంతో.. అసలు అక్కడ అణు ధార్మిక పదార్థాలు ఉన్నాయా అనే సందేహాలు తెరపైకి వచ్చాయి. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కూడా ఇరాన్‌ యురేనియం నిల్వలు ఎక్కడ ఉన్నాయో తమకు తెలియదని వెల్లడించారు.

సీక్రెట్ ప్లేస్ పై నెతన్యాహు వ్యాఖ్యలు!:

ఇలా ఇరాన్ వద్ద 60 నుంచి 90 శాతం శుద్ధి చేసిన 400 కేజీల యురేనియం ఉందని.. అయితే, తాజా అమెరికా దాడుల్లో అది నాశనం అయినట్లు తెలియడం లేదని అంటున్న వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ఆ 400 కిలోల యురేనిపై తమకు ఇంటెలిజెన్స్‌ రిపోర్టు అందిందని అన్నారు.

అయితే.. దానికి సంబంధించిన వివరాలు మాత్రం నెతన్యాహు వెల్లడించలేదు! తాము హెజ్‌ బొల్లా చీఫ్‌ నస్రల్లాను హతమార్చిన తర్వాత ఇరాన్‌ అణ్వాయుధం తయారీ ప్రయత్నాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందని.. దీంతోపాటు ఇరాన్‌ నెలకు 300 బాలిస్టిక్‌ క్షిపణులను తయారుచేయాలని టార్గెట్‌ గా పెట్టుకొందని చెప్పిన నెతన్యాహు.. ఈ విషయాలన్నీ కూడా తమకు తెలుసని అన్నారు.

ఈ విషయాలనే తాము ట్రంప్ దృష్టికి తీసుకుని వెళ్లామని.. వీటిపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరామని పేర్కొన్నారు. ఈ అంశంలో ఉన్న సీరియస్ నెస్ ని ట్రంప్ అర్ధం చేసుకున్నారని తెలిపారు. ఇదే సమయంలో.. గాజాలో పరిస్థితిపైనా నెతన్యాహు స్పందించారు. ఇందులో భాగంగా... హమాస్‌ లొంగిపోయి, బందీలను విడుదల చేస్తే గాజాలో యుద్ధం వెంటనే ఆగిపోతుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News