11వ అంతస్తు నుంచి దూకి వ్యాపారవేత్త ఆత్మహత్య.. విషాదం వెనుక ఉన్న వాస్తవాలివే..!

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు పచ్చని సంసారాల్లో ఎంతటి చీకటిని నింపుతాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.;

Update: 2026-05-02 15:30 GMT

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు పచ్చని సంసారాల్లో ఎంతటి చీకటిని నింపుతాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఐపీఎల్ వంటి క్రీడలను వినోదంగా చూడాలే తప్ప బెట్టింలోకి దిగవద్దు. బెట్టింగ్ లోకి లోతుగా దిగిన ఒక యువ వ్యాపారవేత్త తన ప్రాణాలను బలి తీసుకోవడం అత్యంత విషాదకరం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రబల్ జైన్ (35) అనే వ్యాపారవేత్త ఐపీఎల్ బెట్టింగ్ కారణంగా తన నిండు ప్రాణాన్ని కోల్పోయాడు. కేవలం డబ్బు కోసం ఆడిన జూదం, చివరకు మృత్యువుతో ముగిసింది. క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని కొందరు ఇలా బెట్టింగ్‌లకు మళ్లించి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ఏం జరిగింది?

ఏప్రిల్ 30న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రబల్ జైన్ జీవితంలో ఆఖరి మ్యాచ్‌గా మారింది. ప్రబల్ కేవలం మ్యాచ్ ఫలితం మీద మాత్రమే కాకుండా, ప్రతి బంతికి, ప్రతి ఓవర్ కు నిర్వహించే 'సెషన్ బెట్టింగ్'లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడు భారీగా డబ్బు నష్టపోయాడు. అప్పటికి ఇంకా ఇంటికి రాని తన భార్యకు ఫోన్ చేసి, ‘నేను ఎంతో నష్టపోయాను’ అని విలపించాడు. ఆ మానసిక వేదన భరించలేక, మ్యాచ్ చూస్తూనే తన అపార్ట్‌మెంట్‌లోని 11వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

చెదిరిన పచ్చని సంసారం

ప్రబల్ జైన్ మరణం ఆయన కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ప్రబల్ గతేడాదే ప్రేమ వివాహం చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. వివాహమై ఏడాది కూడా గడవకముందే, భర్త ఇలాంటి విపరీత నిర్ణయం తీసుకోవడంతో ఆ భార్య పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, సెషన్ బెట్టింగ్ విధానాలు సులభంగా డబ్బు సంపాదించవచ్చనే భ్రమను కలిగిస్తాయి. ఒకసారి గెలిస్తే మళ్లీ ఆడాలనే ఆశ, ఓడిపోతే పోగొట్టుకున్నది సంపాదించాలనే కసి మనిషిని ఈ ఊబిలోకి లాగుతాయి. చివరికి అప్పుల ఊబిలో కూరుకుపోయి, పరువు పోతుందనే భయంతో ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తుంది.

ప్రబల్ జైన్ ఘటన బెట్టింగ్ ఆడే ప్రతి ఒక్కరికీ హెచ్చరిక. జీవితం అనేది ఒక క్రికెట్ మ్యాచ్ లాంటిది, ఒక ఓవర్ లో విఫలమైతే మరో ఓవర్ ఉంటుంది, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు. కేవలం ఆట పందేలు కాసి, ఉన్నతమైన భవిష్యత్, ప్రేమించే కుటుంబాన్ని వదిలి వెళ్లడం ఎంత బాధాకరం. బెట్టింగ్ వంటి వ్యసనాల నుంచి దూరంగా ఉండి, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపడమే నిజమైన గెలుపు.

Tags:    

Similar News