‘ఇండిగో’ దెబ్బకు చుక్కలే చుక్కలు.. మరో 48 గంటలు ఇదే సీన్!
రోటీన్ కు భిన్నమైన సీన్ తాజాగా నెలకొంది. అత్యవసర పని మీద ఎక్కడికైనా వెళ్లాలంటే మదిలో మెదిలే మొదటి ఆప్షన్ ఫ్లైట్.;
రోటీన్ కు భిన్నమైన సీన్ తాజాగా నెలకొంది. అత్యవసర పని మీద ఎక్కడికైనా వెళ్లాలంటే మదిలో మెదిలే మొదటి ఆప్షన్ ఫ్లైట్. మరి.. అలాంటి విమాన ప్రయాణం దెబ్బేసే పరిస్థితి ఏర్పడితే? అసలు అలా ఎందుకు జరుగుతుంది? అన్న ప్రశ్నను సంధించొచ్చు. తాజాగా ఇండిగో పుణ్యమా అని అలాంటి సందేహాలు పటాపంచలు అయ్యే పరిస్థితి. దేశ వ్యాప్తంగా గడిచిన రెండు రోజులుగా ప్రయాణికులకు చుక్కలు చూపుతున్న ఇండిగో దెబ్బకు అరుదైన సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు ప్రయాణికులు తమ విమాన ప్రయాణాన్ని వదిలేసి.. రైల్వే స్టేషన్లకు పరుగులు తీసిన అరుదైన సందర్భంగా చెప్పాలి.
దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థగా పేరున్న ఇండిగో రోజులో వందకు పైగా విమానాల్ని రద్దు చేసింది. ఒక్క శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచే వందకు పైగా విమనాల్ని రద్దు చేయటం గమనార్హం. దీంతో దేశంలోని ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్ని వదిలేసి రైల్వే స్టేషన్లకు పరుగులు తీశారు. ఇండిగో దెబ్బకు వందలాది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురి కావటమే కాదు.. చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్న పరిస్థితి. వీసా ఇంటర్వ్యూలు.. ఇతర ముఖ్యమైన పనుల కోసం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న వారు భారీగా నష్టపోయిన పరిస్థితి.
హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు అయ్యప్ప భక్తులు.. తాము వెళ్లాల్సిన కొచ్చిన్ ఫ్లైట్ కోసం టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ.. తమ ఫ్లైట్ వివరాల్ని వెల్లడించకుండా వ్యవహరించిన ఇండిగో సిబ్బంది తీరుతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సెక్యూరిటీ సిబ్బంది కలుగజేసుకొని రీషెడ్యూల్ చేసిన సర్వీసుల్లో గమ్యస్థానాలకు పంపిస్తామని నచ్చజెప్పటంతో శాంతించారు.
మొత్తంగా చూస్తే.. ఒక్క బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో 40 సర్వీసులు రద్దు కాగా.. ఈ రోజు (గురువారం) కూడా 36 విమానాల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పైలెట్ల విధుల నియంత్రణపై ఇటీవల డీజీసీఏ విధించిన నిబంధనలతో పాటు రాత్రి విమానాల ల్యాండింగ్ ను తగ్గించటంతోనే ఈ సమస్యలు తలెత్తాయని ఇండిగో పేర్కొంది. వనరుల వినియోగంలో ప్రణాళికా లోపంతో ఇండిగో విమానసేవలకు అంతరాయం కలిగినట్లుగా పేర్కొన్నారు.
సిబ్బంది సమస్య తాజా పరిస్థితికి కారణమని చెబుతున్నారు పైలట్ల విధుల నియంత్రణపై ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీసుకొచ్చిన విమాన విధుల సమయ పరిమితితో పైలట్ల కొరత ఏర్పడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇండిగో విమానాల రద్దుపై విచారణ జరుపుతున్నట్లుగా డీజీసీఏ పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ సంస్థకు నోటీసులు ఇచ్చినట్లుగా వెల్లడించారు.