చావు అంచుల దాకా వెళ్లొచ్చిన వేళ వందలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన భారత పైలట్ ధైర్యగాథ

గాయపడిన దేహం.. కంటిముందు వందలాది మంది మరణభయం.. కానీ ఆయన చేతులు మాత్రం స్టీరింగ్‌ను వీడలేదు.

Update: 2026-10-01 03:52 GMT

గాయపడిన దేహం.. కంటిముందు వందలాది మంది మరణభయం.. కానీ ఆయన చేతులు మాత్రం స్టీరింగ్‌ను వీడలేదు.. 33 వేల అడుగుల ఎత్తులో చావుకూ, బతుకుకూ మధ్య ఉత్కంఠ పోరు సాగుతున్న వేళ ఒక భారతీయ పైలట్ చూపిన అసమాన ధైర్యం వందలాది కుటుంబాల్లో వెలుగులు నింపింది. రక్తం ఓడుతున్న గాయాలను సైతం లెక్కచేయకుండా తన ప్రాణాల కంటే ప్రయాణికుల సురక్షిత ల్యాండింగే శ్వాసగా పోరాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ విశ్వవ్యాప్తంగా నిజమైన 'హీరో'గా నిలిచారు. మరణం గుమ్మం దాకా వెళ్లొచ్చిన ఆ భయానక క్షణాల్లో అసలేం జరిగింది? దుబాయ్-ఇజ్రాయెల్ ఫ్లైట్‌లో కాక్‌పిట్ డ్రామా వెనుక ఉన్న అసలు నిజాలు ఇవే...

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. వేల అడుగుల ఎత్తులో కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో విమానం ఒక్కసారిగా భారీగా కిందికి పడిపోయింది. ఈ సమయంలో భారత పైలట్ స్మిత్ మచ్చర్ గాయపడినప్పటికీ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ప్రయాణికులు, సిబ్బంది జోక్యంతో విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్ర మోదీ స్మిత్ మచ్చర్‌ను ప్రశంసించారు.

అసలేం జరిగింది?

సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్‌కు చెందిన ఎఫ్.జెడ్1073 విమానం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది. బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానంలో 174 మంది ప్రయాణికులు ఉన్నట్లు తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటి వరకు అంతా సాధారణంగానే సాగింది. అయితే సౌదీ అరేబియా మీదుగా విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. విమానం సుమారు 33-34 వేల అడుగుల ఎత్తులో ఉండగా వేగంగా కిందికి దిగడం ప్రారంభించింది. కొన్ని క్షణాల్లోనే వేల అడుగుల ఎత్తును కోల్పోయింది. కొన్ని రిపోర్టుల ప్రకారం దాదాపు 14 వేల అడుగుల మేర భారీగా దిగజారింది.

కాక్‌పిట్‌లో ఏం జరిగింది?

విమానం అకస్మాత్తుగా ఎత్తు కోల్పోవడానికి కారణం కాక్‌పిట్‌లో జరిగిన ఘర్షణేనని దర్యాప్తు సంస్థలు, ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒమన్‌కు చెందిన కో-పైలట్ భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసి కత్తితో గాయపరిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు కూడా నెతన్యాహు పేర్కొన్నారు. అయితే ఫ్లైదుబాయ్ మాత్రం అధికారికంగా కాక్‌పిట్‌లో “ఘర్షణ” జరిగిందని.. విమానంలో ప్రయాణిస్తున్న ఆన్-డ్యూటీ సిబ్బంది విమానాన్ని అదుపులోకి తీసుకుని సురక్షితంగా టబుక్‌కు మళ్లించారని మాత్రమే ధృవీకరించింది. ఘటనకు సంబంధించిన అసలు కారణాలు, ఉద్దేశాలు దర్యాప్తులో ఉన్నాయని సంస్థ స్పష్టం చేసింది.

గాల్లోనే భారీ ప్రమాదం

కాక్‌పిట్‌లో పరిస్థితి అదుపు తప్పిన సమయంలో విమానం ఒక్కసారిగా భారీగా కిందికి దూసుకెళ్లింది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం విమానం సుమారు 34 వేల అడుగుల ఎత్తు నుంచి కొన్ని క్షణాల్లోనే 15-17 వేల అడుగుల పరిధికి పడిపోయింది. విమానం వేగంగా దిగడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అదే సమయంలో విమానం నుంచి అత్యవసర సంకేతాలు వెళ్లాయి. కొంతసేపు 7500 కోడ్ కూడా ప్రసారం అయింది. విమానయానంలో ఇది అక్రమ జోక్యం లేదా హైజాక్ వంటి పరిస్థితిని సూచించే అత్యవసర కోడ్. అనంతరం విమానం సౌదీ అరేబియాలోని టబుక్ వైపు మళ్లింది.

గాయపడినా వెనక్కి తగ్గని భారత పైలట్

ఈ ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గాయపడినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇంతలో విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ఫ్లైదుబాయ్ సిబ్బంది, ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి చేరి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. దీంతో విమానాన్ని సురక్షితంగా మళ్లించి టబుక్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయగలిగారు.

టబుక్ ఎయిర్‌పోర్ట్ అధికారుల ప్రకారం విమానానికి ఉదయం 8:44 గంటలకు అత్యవసర ల్యాండింగ్ కోసం సమాచారం అందింది. అనంతరం విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. కెప్టెన్, కో-పైలట్ ఇద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులకు కూడా అవసరమైన సహాయం అందించారు.

ఎవరీ స్మిత్ మచ్చర్?

ఈ ఘటన తర్వాత కెప్టెన్ స్మిత్ మచ్చర్ పేరు అంతర్జాతీయంగా మార్మోగుతోంది. ఆయన భారత జాతీయుడని రిపోర్టులు వెల్లడించాయి. స్మిత్ మచ్చర్ 2022లో ఫ్లైదుబాయ్‌లో చేరి బోయింగ్ 737 విమానాల్లో కెప్టెన్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. అంతకుముందు ఆయన స్పైస్‌జెట్‌లో సుమారు 11 సంవత్సరాలు పనిచేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఆయనకు వేల గంటల కమర్షియల్ ఫ్లయింగ్ అనుభవం ఉన్నట్లు వివరాలు వెలువడ్డాయి.

నెతన్యాహు ప్రశంసలు

ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. స్మిత్ మచ్చర్ చూపిన ధైర్యాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ పరిస్థితిని ఎదుర్కొని ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో సహకరించినందుకు భారత పైలట్‌ను నెతన్యాహు అభినందించారు. ఆయనను “నిజమైన హీరో”గా అభివర్ణిస్తూ సెల్యూట్ చేశారు. ప్రయాణికులు, సిబ్బంది కలిసి స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.

స్మిత్ మచ్చర్ ఒక హీరో : మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్మిత్ మచ్చర్‌ను ప్రశంసించారు. తీవ్రమైన ప్రమాదకర పరిస్థితుల్లో గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన చూపిన ధైర్యం, సంకల్పం ప్రశంసనీయమని మోదీ పేర్కొన్నారు. వందలాది మంది ప్రాణాలను కాపాడి పెను విషాదాన్ని తప్పించడంలో ఆయన చూపిన తెగువ దేశానికి గర్వకారణమని అన్నారు.

ట్రంప్ ఏమన్నారు?

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. దాడికి పాల్పడిన కో-పైలట్‌ ఉద్దేశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అతడు ఉగ్రవాది కావొచ్చని లేదా మానసికంగా పిచ్చోడు అయ్యి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. అదే సమయంలో పరిస్థితిని ఎదుర్కొన్న భారత పైలట్ ధైర్యాన్ని ప్రశంసించారు. అయితే కో-పైలట్ ఉద్దేశం ఏమిటన్నది ప్రస్తుతం అధికారికంగా నిర్ధారణ కాలేదు. దర్యాప్తు పూర్తయ్యే వరకు దీనిపై తుది నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుంది.

హైజాకా? ఉగ్రదాడా? దర్యాప్తులో అసలు నిజం

ఈ ఘటనను తొలుత హైజాక్‌గా భావించే పరిస్థితి ఏర్పడినప్పటికీ అసలు ఘటన స్వరూపంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఫ్లైదుబాయ్ కూడా కారణాలు, ఉద్దేశాలు ఇంకా తెలియాల్సి ఉందని స్పష్టం చేసింది. యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఈ ఘటనను “సెక్యూరిటీ ఇన్సిడెంట్”గా పేర్కొంది. ఘటనకు సంబంధించిన ఆపరేషనల్, సెక్యూరిటీ అంశాలపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. అధికారిక విచారణ పూర్తయ్యే వరకు ఊహాగానాలు, ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కూడా సూచించింది.

ప్రయాణికులు సురక్షితం.. తర్వాత ఏమైంది?

టబుక్‌లో విమానం సురక్షితంగా దిగిన తర్వాత ప్రయాణికులను విమానం నుంచి దించి అవసరమైన సహాయం అందించారు. అనంతరం ప్రత్యామ్నాయ విమానం ద్వారా ప్రయాణికులను ఇజ్రాయెల్‌కు తరలించారు. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పడం వెనుక కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో పాటు విమానంలోని సిబ్బంది, ప్రయాణికుల సమయస్ఫూర్తి కూడా కీలకంగా నిలిచింది.

ప్రపంచం ముందు భారత పైలట్ ధైర్యం

వేల అడుగుల ఎత్తులో విమానం నియంత్రణ కోల్పోయే పరిస్థితి.. కాక్‌పిట్‌లో తీవ్ర ఘర్షణ.. పైలట్‌కు గాయాలు.. విమానం వేగంగా కిందికి పడిపోవడం.. ఇలాంటి సమయంలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని భారత ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. అయితే ఘటన వెనుక అసలు కారణం.. కో-పైలట్ ఉద్దేశం, దాడి స్వభావం వంటి కీలక అంశాలపై అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ఒకవైపు వేల అడుగుల ఎత్తులో ప్రాణాల కోసం పోరాటం.. మరోవైపు గాయాలతోనూ బాధ్యతను వదలని భారత పైలట్.. చివరికి సురక్షిత అత్యవసర ల్యాండింగ్‌తో వందలాది మంది ప్రాణాలు నిలిచాయి. అందుకే ఇప్పుడు కెప్టెన్ స్మిత్ మచ్చర్ పేరు ప్రపంచవ్యాప్తంగా “హీరో పైలట్”గా మారింది.

Tags:    

Similar News