‘పాస్ పోర్టు పౌరసత్వానికి గుర్తింపు కాదు’.. నెటిజన్ల ప్రశ్నలకు బదులేది?

తాజాగా నెటిజన్లు సంధిస్తున్న కొన్ని ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. వీటికివిదేశాంగ శాఖ ఏమని సమాధానం చెబుతుంది?అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

Update: 2026-06-26 05:14 GMT

భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్ పోర్టు.. సదరు వ్యక్తి భారత దేశ పౌరసత్వానికి సంబంధించిన అధికారిక గుర్తింపు కార్డు కానే కాదని ఇటీవల విదేశాంగ శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఈ అంశంపై పలువురు స్పందిస్తున్నారు. భావస్వేచ్ఛకు నెలవుగా మారిన సోషల్ మీడియాలోనూ.. వాట్సప్ లోనూ.. ఇతర డిజిటల్ వేదికలపై పలువురు స్పందించటం మొదలుపెట్టారు. ఈ అంశంపై ధర్మంతో కూడిన న్యాయమైన ప్రశ్నల్ని సంధిస్తున్న నెటిజన్ల కారణంగా ఈ అంశంపై చర్చ అంతకంతకూ పెరుగుతోంది.

తాజాగా నెటిజన్లు సంధిస్తున్న కొన్ని ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. వీటికివిదేశాంగ శాఖ ఏమని సమాధానం చెబుతుంది?అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకూ తెర మీదకు వస్తున్న ఎన్నో ప్రశ్నల్లో ఆసక్తికరమైన కొన్నింటిని చూస్తే.. దేశ ప్రజల ఆవేదనతో పాటు.. వారి వాదనల్లో అర్థవంతమైన అంశాలు కనిపిస్తున్న పరిస్థితి. ఇంతకూ అవేమంటే.

- విద్య.. నివాస ధ్రువీకరణ పత్రాల నకళ్లను జత చేసి.. ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకుండా పాస్ పోర్టు దరఖాస్తులను నింపి సమర్పించిన తర్వాత.. సంక్లిష్టమైన.. సుదీర్ఘ ప్రక్రియను పూర్తి చేసి.. పోలీస్ వెరిఫికేషన్ సైతం పూర్తి అయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే పాస్ పోర్టు.. పౌరసత్వ నిరూపణకు కుదరదా?

- స్వదేశం నుంచి విదేశాలకు వెళ్లినప్పుడు విదేశీ పోలీసులు.. ఆ దేశ అధికారులు ‘మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీ జాతీయత ఏంటి’ లాంటి ప్రశ్నలకు సమాధానంగా నిలిచేది పాస్ పోర్టు. విదేశీ అధికారుల ధ్రువీకరణకు ఉపయోగపడే పాస్ పోర్టు..స్వదేశంలో సదరు వ్యక్తి జాతీయతకు రుజువుగా ఎందుకు పనికి రాదు?

- విదేశాంగ శాఖ చెబుతున్నట్లు పాస్ పోర్టు కేవలం ప్రయాణపత్రమే అయితే.. ఎవరైనా విదేశీ పౌరసత్వాన్ని తీసుకుంటే.. భారత పాస్ పోర్టును వెంటనే భారత ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలనే నిబంధన ఉంది. ఒకవేళ పాస్ పోర్టు ప్రయాణ పత్రమే అయితే.. తిరిగి స్వాధీనం చేయాల్సిన అవసరం ఏంటి?

- పాస్ పోర్టు మాన్యువల్ లో దీన్ని స్వదేశీయులకే మాత్రమే జారీ చేస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. అలాంటప్పుడు పౌరసత్వాన్ని ఎందుకు రుజువు చేయదు?

- కేవలం విదేశీ ప్రయాణాలు చేసేందుకు వీలుగా ప్రయాణపత్రంగా పాస్ పోర్టు జారీ చేస్తున్నట్లుగా కేంద్రం చెబుతోంది. ఒకవేళ.. అదే నిజమైతే.. విదేశీ ప్రయాణాలు చేసే వ్యక్తుల వ్యక్తిగత విషయాలు పోలీసులకు ఎందుకు? ఫలానా వారికే పాస్ పోర్టు జారీ చేయొచ్చని పోలీసులు ఎలా నిర్దారిస్తారు?

- పాస్ పోర్టు కేవలం ప్రయాణ పత్రమే అయితే.. పాస్ పోర్టు జారీ చేసేటప్పుడు ఎందుకంత కష్టతరమైన పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియను అనుసరిస్తున్నారు? పదే పదే అప్లికేషన్లను తిరస్కరిస్తూ.. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుకోవాల్సిన అవసరం ఏంటి?

- పాస్ పోర్టు చట్టం, 1967లోని సెక్షన్ 20 ప్రకారం.. ప్రత్యేక సందర్భాల్లో భారతీయులు కాని వారికి కూడా పాస్ పోర్టులను జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు ఇప్పటివరకు ఎంతమందికి అలా పాస్ పోర్టులు జారీ చేశారు? భారతీయులు కాని వారికి పాస్ పోర్టులు జారీ చేసినప్పుడు.. ఏ ప్రాతిపదికన వారిని పాస్ పోర్టు జారీ చేసేందుకు అర్హులుగా నిర్ధారించారు. ఇలా విదేశీయులకు పాస్ పోర్టులు జారీ చేసేటప్పుడు ఏయే అంశాల్ని పరిగణలోకి తీసుకుంటారు?

- ఆధార్.. పాన్ కార్డు మీవేనని.. వాటిని జారీ చేసే వేళ ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు పాస్ పోర్టు మాత్రం మాదేనని కేంద్రం చెప్పటంలో ఉన్న అంతర్యం ఏంటి?

- పాస్ పోర్టు కేవలం ప్రయాణ పత్రమే అయినప్పుడు.. ఒకరి పేరు మీద జారీ అయ్యే పాస్ పోర్టు ప్రత్యేక పరిస్థితుల్లో రద్దు చేసినా.. నిషేధానికి గురైనా.. దాన్ని వెనక్కి తీసుకున్నా.. అది పూర్తిగా ప్రభుత్వానికే చెందుతుందని చెబుతున్నారు. దీని అంతర్యం ఏంటి?

- భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్ పోర్టు.. అంతర్జాతీయంగా ప్రాతినిథ్యం వహిస్తుందని చెబుతున్నప్పుడు.. మరోవైపు దీనికి ప్రయాణ డాక్యుమెంట్ మాదిరి ఎందుకు పరిగణిస్తున్నారు? ఇదెంతవరకు సబబు?

- పౌరసత్వాన్ని ఆధార్ తో రుజువు చేసుకోలేమని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం చెబుతోంది? పాస్ పోర్టు అందుకు అర్హమైంది కాదని ప్రభుత్వం చెబుతోంది? దేశ పౌరసత్వాన్ని నిరూపించటానికి ఫలానా పత్రాలు అర్హమైనవి కావన్నప్పుడు.. అర్హమైన పత్రాలేంటి? వాటి వివరాలు ఏంటి?

Tags:    

Similar News