హైఅలెర్ట్ జారీ: ఇండియ‌న్ కంపెనీల డేటాను హ్యాక్ చేసిన‌ AI ఏజెంట్లు..ఏ క్ష‌ణ‌మైనా!?

AI ఇప్పుడు అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది. స్వయంప్రతిపత్తి (అటాన‌మ‌స్) కలిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఏజెంట్లు భారతీయ సంస్థలకు చెందిన లైవ్ సిస్టమ్స్..

Update: 2026-10-16 18:30 GMT

AI ఇప్పుడు అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది. స్వయంప్రతిపత్తి (అటాన‌మ‌స్) కలిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఏజెంట్లు భారతీయ సంస్థలకు చెందిన లైవ్ సిస్టమ్స్.. అత్యంత రహస్యమైన డేటాను ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా యాక్సెస్ చేసినట్లు గుర్తించడంతో భారత జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ `సెర్ట్-ఇన్` (CERT-In) అత్యంత కీలకమైన హెచ్చరికను జారీ చేసింది. `ఏఐ ఏజెంట్స్ యాస్ అటాక్ వెక్టర్స్` పేరుతో జారీ చేసిన ఈ అడ్వైజరీలో దేశీయ సమాచార - కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న రెండు ప్రధాన రకాల సైబర్ బెదిరింపుల మోడ‌ళ్ల‌ను ఏజెన్సీ స్పష్టంగా వివరించింది.

ఈ హెచ్చరికలోని మొదటి నమూనా ప్రకారం... పరిశోధన - మదింపు కోసం మోహరించిన కొన్ని ఏఐ మోడళ్లు.. వాటికి కేటాయించిన పరిమితులను దాటి ప్రవర్తించాయని ఏఐ డెవలపర్ సంస్థలు వెల్లడించాయి. అప్లికేషన్ కాన్ఫిగరేషన్లు.. పబ్లిక్ కోడ్ రిపోజిటరీలు.. క్లౌడ్ రోల్స్‌లో పొరపాటున బహిర్గతమైన పాస్‌వర్డ్‌లు, కనెక్షన్ సెట్టింగ్‌లను ఉపయోగించుకుని ఈ ఏఐ ఏజెంట్లు సంస్థల వ్యాపార రికార్డులు, వ్యక్తిగత సమాచారం, సీక్రెట్ డేటాను యాక్సెస్ చేశాయి. అత్యంత ఆందోళనకరమైన విషయమేమిటంటే.. బాధిత భారతీయ సంస్థలలో ఏ ఒక్కటి కూడా ఈ అనధికారిక ప్రవేశాన్ని స్వయంగా గుర్తించలేకపోయాయి. ఏఐ మోడల్ ప్రొవైడర్లు తమ ఇంట‌ర్న‌ల్ గా తనిఖీలు నిర్వహించిన తర్వాత మాత్రమే ఈ తీవ్రమైన భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది.

రెండవ రకం దాడిలో.. సైబర్ నేరస్థులు పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న ఏఐ-నేటివ్ అఫెన్సివ్-సెక్యూరిటీ టూల్స్‌ను ఉపయోగించి దాడులకు తెగబడుతున్నట్లు సెర్ట్-ఇన్ స్వయంగా నిర్వహించిన తనిఖీల్లో తేలింది. హ్యాకర్లు ఈ ఏఐ సాధనాలను ఉపయోగించి భారతీయ సంస్థల నెట్‌వర్క్‌లను నిశితంగా పరిశీలించడం .. వాటిలోని భద్రతా లోపాలను గుర్తించడం.. ఆర్థిక ప్రయోజనాల కోసం వేగవంతమైన దాడులు నిర్వహించడం చేస్తున్నారని తెలిసింది. అంతేకాకుండా.. ఈ సైబర్ దాడి పరికరాలను రీప్యాకేజ్ చేసి వివిధ దేశాలలోని సర్వర్లలో మోహరించినట్లు కూడా ఏజెన్సీ గుర్తించింది.

ఈ ఊహించ‌ని సైబర్ దాడుల వల్ల బహిర్గతమైన లాగిన్ వివరాలను హ్యాకర్లు సేకరించి.. భవిష్యత్తులో ఇతర సైబర్ దాడుల కోసం మళ్లీ ఉపయోగించే ప్రమాదముందని సెర్ట్-ఇన్ హెచ్చరించింది. అందువల్ల ప్రతి సంస్థ తమ సోర్స్ కోడ్, రిపోజిటరీలు, కమిట్ హిస్టరీలు, కాన్ఫిగరేషన్ ఫైళ్లు, క్లౌడ్ స్టోరేజ్ స‌హా అనుబంధ అప్లికేషన్‌లను నిశితంగా ఆడిట్ చేయాలని సూచించింది. ఏదైనా పాస్‌వర్డ్ లేదా లాగిన్ వివరాలు బయటకు పొక్కాయని అనుమానం వస్తే.. వాటిని వెంటనే మార్చడం ..కోడ్ హిస్టరీ నుండి తొలగించడం.. వాడకంలో లేని లేదా టెస్ట్ ఏపీఐలను నిలిపివేయడం.. పబ్లిక్ ఇంటర్నెట్ నుండి అడ్మినిస్ట్రేటివ్ ఇంటర్‌ఫేస్‌లను తొలగించడం వంటి చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.

ఒకవేళ ఏవైనా సిస్టమ్స్ నుండి సమాచారం బ‌య‌ట‌కు పొక్కినట్లు లేదా హ్యాకింగ్ జరిగినట్లు నిర్ధారణ అయితే.. వాటిని ఫోరెన్సిక్ తనిఖీల ద్వారా పూర్తిస్థాయిలో క్లియర్ చేసే వరకు `హామీ లేనివి`గా పరిగణించాలని సెర్ట్-ఇన్ ఉద్ఘాటించింది. ఒకసారి యాక్సెస్ లభించిన తర్వాత కొన్ని రోజులు లేదా వారాల్లో మళ్లీ సైబర్ దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని.. కాబట్టి సంస్థలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ భద్రతా సమీక్షలు నిర్వహించాలని సూచించింది. సంస్థలు సోర్స్ కోడ్, ఫైల్స్‌ను ఆడిట్ చేసుకోవాలని సూచించింది.

Tags:    

Similar News