అద్దె ఇంట్లో మధ్య తరగతి...సొంతింటి కల కల్ల !
ఎవరికైనా జీవితంలో తమది అన్న సొంత ఇల్లు ఉండాలని కోరిక ఉంటుంది. హాయిగా దర్జాగా సొంత ఇంట్లో ఉండి తమక్లు నచ్చినట్లుగా జీవించాలన్న కోరిక ఎంత మందికి ఈ దేశంలో తీరుతోంది అన్నది అతి పెద్ద ప్రశ్న.
ఎవరికైనా జీవితంలో తమది అన్న సొంత ఇల్లు ఉండాలని కోరిక ఉంటుంది. హాయిగా దర్జాగా సొంత ఇంట్లో ఉండి తమక్లు నచ్చినట్లుగా జీవించాలన్న కోరిక ఎంత మందికి ఈ దేశంలో తీరుతోంది అన్నది అతి పెద్ద ప్రశ్న. జవాబు కోసం పెద్దగా బుర్రకు పదును పెట్టాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్. అత్యధిక శాతం మందికి ఆ కల కల్లగానే ఉంది అన్నది పచ్చి నిజం. నానాటికీ ఈ బతుకు భారమే అన్నట్లుగా మధ్యతరగతి జీవితం ఉంది. దాంతో వారి సొంత ఇంటి ఆశలు నెరవేరడం లేదు అని అంటున్నారు. పెద్దలకు ఎలాగూ బంగాళాలు ఉంటాయి. పేదలకు ప్రభుత్వం సాయం చేస్తోంది. దాంతో వారికి పక్కా ఇళ్ళు వస్తున్నాయి. ఎటూ కాకుండా పోతోంది వేతన జీవులు మధ్య తర్గతి వర్గాలు అని గణాంకాలు తెలియచేస్తున్నాయి.
సొంత ఇల్లు కష్టమే :
సొంత ఇల్లు కొనడం కానీ నిర్మించడం కానీ చాలా కష్టమే అన్నది తేలుతున్న సత్యం. గత ఇరవై ఏళ్ళలో ఇంటి ధరలు పెరిగిపోవడమే ఇందుకు కారణం గతంతో పోలిస్తే సొంత ఇంటి కోసం మధ్య తరగతి ఎంత ప్రయాస పడినా ఆయాసమే మిగులుతోంది తప్ప మరేమీ లేదని కూడా అంటున్నారు. ముఖ్యంగా భారత్ మాత్రమే కాదు దక్షిణాసియాలో ఆదాయం ఇంటి ధరల మధ్యన నిష్పత్తి కూడా బాగా తేడాగా ఉంటోంది. ఇక మహానగరాలలో మధ్య తరగతి సొంత ఇంటి ఆశలు పూర్తిగా వదిలేసుకోవడమే అని కూడా అంటున్నారు. ముంబై బెంగళూరు వంటి చోట్ల అస్తుల ధరలు ఒక్కసారిగా ఇరవై శాతానికి పైగా పెరిగాయని గుర్తు చేస్తున్నరు. ఇక పట్టణీకరణ అంతకంతకు పెరుగుతూంటే దానికి సరిపడా ఇళ్ళ సరఫరా లేదని అంటున్నారు. దాంతో డిమాండ్ సప్లై మధ్యన భారీ వ్యత్యాసం కూడా మధ్య తరగతి కలలను ఆవిరి చేస్తోంది.
మూడవ వంతు అద్దెలకే :
ఇక మధ్య తరగతి వర్గాలు తాము సంపాదించే ఆదాయంలో మూడవ వంతు అద్దెలకే ఖర్చు చేస్తున్నారు. ఈ విధంగా భారత్ లో చూస్తే 44 శాతానికి పైగా అద్దె ఇళ్లలో ఉంటూ అధిక ఆదాయాలను అక్కడ ఖర్చు చేస్తున్నారు. మిగిలిన రెండు వంతుల ఆదాయంతోనే అన్నీ సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. సొంత ఇల్లు అన్నది మధ్య తరగతికే కాదు పేదలలో కూడా తక్కువ ఆదాయం వచ్చే వారికి కలగా ఉందని అంటున్నారు. లేటెస్ట్ గా ఐక్యరాజ్య సమితి వెలువరించిన వరల్డ్ సిటీస్ రిపోర్ట్ 2026 చూస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు అందులో కనిపిస్తున్నాయి.
జనాభా పెరుగుదలతో :
ఐరాస వెలువరించిన ఈ నివేదిక ప్రకారం చూస్తే కనుక ఒక వైపు పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. అదే సమయంలో జనాభా కూడా పెరుగుతోంది. దాంతో ఇళ్లకు తీవ్రమైన కొరత ఏర్పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక 2010లో ఆదాయానికి ఇంటి అద్దెకు మధ్యన నిష్పత్తి 9.5 గా ఉండేది. అదే 2023 నాటికి 11.7కి చేరింది. భారత దేశంతో పాటుగా దక్షిణాసియాలో చూస్తే ఇంటి కొరత మరింత ఎక్కువగానే ఉంది. ఇక్కడ చూస్తే ఈ నిష్పత్తి ఏకంగా 9.7 నుంచి 16.8గా మారింది అన్న మాట. అంటే ప్రజలకు వస్తున ఆదాయం కంటే ఇళ్ళ ధరలు ఎంతో ఎక్కువగా పెరిగిపోతున్నాయని ఈ నివేదిక వెల్లడిస్తోంది.
మధ్యతరగతికి రిస్క్ :
భారత్ లాంటి దేశాలలో మధ్య తరగతి వర్గాలు సొంతిళ్ళు కొనడం ఒక రిస్క్ గా మారుతోంది. ఒక విధంగా అసాధ్యం అన్న భావన కూడా కలుగుతోంది. చాలా మంది సొంతింటి కోసం పొదుపు చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యుల సహాయం తీసుకుంటున్నారు. అలాగే అప్పులు చేస్తున్నారు. అయినా సరే ఆ కలను తీర్చుకోలేక నానా అవస్థలూ పడుతున్నారుఇ 2026 జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో చూస్తే కనుక బెంగళూర్ లాంటి మహా నగరాలలో చదరపు అడుగు ధర ఏకంగ 24 శాతం పెరిగి .9,785కు చేరితే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో కూడా 20 శాతం పెరిగి 15,120కు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి.
అద్దెల దరువు మరి :
ఎటూ సొంత ఇల్లు లేదు అద్దె ఇళ్ళలో ఉందామనుకున్నా మద్దెల దరువు మోగుతోంది. తమకు వచ్చే ఆదాయంలో మూడవ వంతు అక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తోంది అని మధ్యతరగతితో పాటు అల్పాదాయ వర్గాలు గోడుమంటున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం లేకపోవడం అలాగే పెరిగిన నిర్మాణం ఖర్చులు, ప్రభుత్వ నిబంధలన వల్ల కలిగే ఆలస్యాలు ఇవన్నీ కూడా అద్దే ఇళ్ళ సరఫరాను తగ్గించేస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు గృహ నిర్మాణానికి భారీగా చేయూత ఇవ్వాలని అలాగే సామాజిక భద్రత ఉండేలా చూసుకోవాలని ఐక్యరాజ్య సమితి నివేదిక చెబుతోంది. లేని పక్షంలో సొంతింటి కల తీరక కోట్లలోనే జనాభా ఇబ్బందులు పడుతుందని హెచ్చరిస్తోంది. మరి భారత్ లాంటి దేశాలలో ఇస్తున్న సబ్సిడీలు గృహ నిర్మాణానికి ఏ మాత్రం సరిపోవని అంటున్నారు. ఈ విషయంలో మధ్యతరగతి అల్పాదాయ వర్గాలకు ఊతమిచ్చేలా పాలసీలు చేయాలని అంతా కోరుతున్నారు.