ప్రపంచ పసిడి సామ్రాజ్యంలో భారతీయుల హవా ఇది.. జీడీపీని దాటింది!
భారతీయులకు బంగారం ఒక ఆభరణం మాత్రమే కాదు.. దీనితో ముడిపడి ఎన్నో విషయాలు ఉంటాయి.;
భారతీయులకు బంగారం ఒక ఆభరణం మాత్రమే కాదు.. దీనితో ముడిపడి ఎన్నో విషయాలు ఉంటాయి. అమ్మమ్మ వారసత్వంగా ఇచ్చిన గాజులతో కుటుంబ చరిత్రలో భాగమైన ఈ బంగారం.. వివాహాది శుభకార్యాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటుంది. వివాహ వేడుకల్లో పెళ్లి కుమార్తె కంటే ఎక్కువగా ఆమె వేసుకున్న నగలను చూసేవారూ ఉంటారని చెప్పినా అతిశయోక్తి కాదేమో.
భారత్ లో బంగారానికి, మహిళలకు ఉన్న అనుబంధం వేరే లెవెల్. పెళ్లిళ్లు, పండగలు.. ఇక అక్షయ తృతియ నాడు సెంటిమెంట్ కలిపి కాగితపు రూపాయిని, పసిడి నాణెంగా మార్చడంలో భారతీయుల శ్రద్ధాశక్తులే వేరని అంటున్నారు. తాజాగా ఈ మాట చెప్పింది మోర్గాన్ స్టాన్లీ నివేదిక. ప్రస్తుతం భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం విలువ.. ఈ దేశ మొతం జీడీపీ కంటే ఎక్కువని తేల్చి చెప్పింది.
అవును... భారతదేశంలోని కుటుంబాలకు - బంగారానికీ ఉన్న బంధం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఇక్కడ బంగారం ఒక ఆభరణం మాత్రమే కాదు.. అదొక జ్ఞాపకం. ఇదే సమయంలో.. అది సురక్షితమైన, నమ్మదగిన ఆస్తి కూడా. పైగా ఇటీవల భారతదేశంలో గోల్డ్ బార్లు, క్వాయిన్లు ఎక్కువగా అమ్ముడైనట్లు చెబుతున్నారు! దీంతో బంగారంపై పెట్టుబడి ప్రత్యేకంగా కనిపిస్తుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో భారతీయ కుటుంబాలు కలిగి ఉన్న పసిడి నిల్వల విలువ తెరపైకి వచ్చింది. దీనిపై చర్చ ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగా.. ప్రస్తుతం భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం విలువ 5 ట్రిలియన్ డాలర్లు (దాదాపు రూ. 450 లక్షల కోట్లు) దాటిందని చెబుతున్నారు. దీంతో ఇది వైరల్ గా మారింది.
పైగా.. ఈ సంఖ్య దేశ మొత్తం జీడీపీ ($4.1 ట్రిలియన్) కంటే ఎక్కువని చెబుతున్నారు. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం... భారతీయ కుటుంబాల వద్ద బంగారం నిల్వలు సుమారు 34,600 టన్నులు ఉన్నాయి. ఈ క్రమంలో.. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ఔన్సుకు దాదాపు $4,500 (10 గ్రాములకు దాదాపు రూ.1.42 లక్షల) కంటే ఎక్కువగా ట్రేడవుతుందని చెబుతున్నారు.
ఈ నేపథ్యలోనే అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్) ప్రకారం... భారతదేశ జీడీపీ ప్రస్తుతం సుమారు 4.1 ట్రిలియన్ డాలర్లు (దాదాపు రూ.370 లక్షల కోట్లు) గా ఉండగా... భారతీయ ఇళ్లల్లో ఉన్న బంగారం మొత్తం విలువ దాదాపు రూ.450 లక్షల కోట్లతో.. దేశ ఆర్థిక వ్యవస్థ కంటే విలువైనదిగా ఉందని తేలింది!