పాస్ పోర్టు కాదన్నారు సరే.. నేను భారతీయుడ్ని అని చెప్పేదెట్లా సామీ?

ఏళ్లకు ఏళ్లుగా నడుస్తున్న విషయాన్ని అకస్మాత్తుగా ఎదురైన ఒక ప్రశ్నకు సమాధానంగా బయటకు వచ్చిన అంశంపై ఇప్పుడు జోరు చర్చ నడుస్తోంది.

Update: 2026-06-26 05:12 GMT

ఏళ్లకు ఏళ్లుగా నడుస్తున్న విషయాన్ని అకస్మాత్తుగా ఎదురైన ఒక ప్రశ్నకు సమాధానంగా బయటకు వచ్చిన అంశంపై ఇప్పుడు జోరు చర్చ నడుస్తోంది. ‘నేను భారతీయుడ్ని’ అని చెబుతూ పౌరసత్వాన్ని ఫ్రూవ్ చేసే అధికారిక డాక్యుమెంట్ ఏదీ లేదన్న కఠిన నిజం ఇప్పుడు చాలామందిని అవాక్కు చేస్తోంది. ఆధార్.. భారత పౌరసత్వాన్ని తెలిపే అధికారిక పత్రం కాదన్నారు. ఎన్నో దశల అనంతరం.. పోలీసుల భారీ వెరిఫికేషన్ తర్వాత జారీ చేసే పాస్ పోర్టు.. భారత పౌరసత్వాన్ని తెలిపే అధికారిక పత్రం కానే కాదని తేల్చేసిన వైనం ఇప్పుడు తీవ్ర చర్చకు తెర తీసిందని చెప్పాలి.

జూన్ 24న 14వ పాస్ పోర్టు సేవా దివాస్ సందర్భంగా జరిగిన మీడియా భేటీలో విదేశాంగ శాఖ అధికారులు ఇచ్చిన స్పష్టత కొత్త దుమారానికి తెర తీసింది. మర్చిపోకూడని విషయం ఏమంటే.. భారత పౌరసత్వాన్ని స్పష్టం చేసే అధికారిక పత్రం ఇప్పటివరకు ఏదీ లేకపోవటం. ఇదేమీ కొత్త నిర్ణయం కాదు. మోడీ సర్కారు తీసుకొచ్చింది కాదు. దశాబ్దాల తరబడి సాగుతున్న ఉన్న చట్ట నిబంధనపై మరింత స్పష్టత కోసం కోరటం.. దీంతో అధికారులు ఇచ్చిన సమాధానంతో ఇప్పుడు వాదోపవాదాలు సాగుతున్నాయి,

కాస్త చదువుకొని.. విద్యాబుద్ధులున్న వారి మొదలు.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు మొదలు.. అత్యంత సాధారణ ప్రజల వరకు ఆధార్ కార్డు ఉన్నప్పటికి.. అదేమీ భారత పౌరసత్వ గుర్తింపు అధికారిక పత్రం కాదన్న విషయం తెలిసిందే. అయితే.. ఓటర్ గుర్తింపు కార్డు కానీ పాస్ పోర్టు కానీ.. ఇలా ఏ అధికార పత్రమైనా సరే.. మీరు భారత పౌరసత్వాన్ని గుర్తించేది లేకపోవటమా? అన్నదిప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

ఎందుకిలా? అన్నదిప్పుడు క్వశ్చన్. దీనికి సమాధానం వెతికితే.. 140 కోట్ల మంది ప్రజలు.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా భారత పౌరసత్వాన్ని ఖరారు చేసినట్లుగా ఉండే కార్డు కోసం జరుగుతున్న చర్చలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. భారత రాజ్యాంగం, 1955 పౌరసత్వ చట్టం ప్రకారం, పౌరసత్వం అనేది ఒక వ్యక్తికి, దేశానికి మధ్య ఉండే చట్టపరమైన బంధం. ఇది మీరు పుట్టిన తేదీ, మీ తల్లిదండ్రుల మూలాలు, మరియు నివాస కాలం వంటి అంశాల కలయికతో లభిస్తుంది.ఏ ఒక్క కార్డు అయినా సరే దొంగతనంగా సృష్టించడానికి కానీ.. లంచం ఇచ్చి తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే.. అలాంటి అవకాశం ఇవ్వకుండా చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఒక గుర్తింపు కార్డుతో పౌరసత్వాన్ని ఇచ్చేస్తే.. అక్రమ వలసదారులకు కూడా చట్టబద్ధత లభిస్తోందన్న సందేహం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అయితే.. ప్రతి పౌరుడికి పౌరసత్వ కార్డు ఇవ్వాలన్న ఉద్దేశంతో అప్పట్లో ఎన్ఆర్ సీ అదేనండి ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్’ ప్రక్రియను చట్టంలో చేర్చారు. అసోంలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అయితే.. ఈ ఎన్ ఆర్ సీని అమలుకు సంబంధించిన వివాదం ఎంత తీవ్రంగా మారిందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దేశంలోని కోట్లాది మంది పేదలు.. నిరక్షరాస్యుల వద్ద పాత రికార్డులు ఉండే పరిస్థితి లేదు. అలాంటి వారంతా ఎన్ఆర్ సీకి భయపడతారన్న ఉద్దేశంతో ఆ ప్రక్రియ మధ్యలో ఆగింది. ఇప్పుడు భారత పౌరసత్వాన్ని గుర్తించేది ఏది లేదన్న మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే.. దీని కారణంగా రోజువారీ జీవితంలో ఏమైనా సమస్య వస్తుందా? అంటే.. లేదనే చెప్పారు. ఇక్కడో సున్నిత అంశాన్ని ప్రస్తావించాలి. అదేమంటే.. జాతీయత.. పౌరసత్వం అనేది రెండు ఒకేలా కనిపించే రెండు విరుద్ధ అంశాలుగా చెప్పాలి. పాస్ పోర్టు అనేది మీరు భారతదేశానికి చెందిన వారు అనే విషయాన్ని తెలియజేస్తుందంతే. అంతే తప్పించి.. అదేమీ శాశ్వతం కాదన్నది మర్చిపోకూడదు.

ఇంతకాలం జరిగిందేదో జరిగింది. ఇప్పటికైనా ప్రతి అర్హుడైన భారతీయుడు తాను భారతజాతికి చెందిన వ్యక్తి అన్న విషయాన్ని తెలియజేసే ఒక భారీ ప్రోగ్రాంకు తెర తీయాలన్న మాట వినిపిస్తోంది. హరీష్ సాల్వే లాంటి న్యాయనిపుణుడు చేస్తున్న సూచనల్ని చూస్తే.. సామాన్యుడు మొదలు అసమాన్యుడు ఎవరైనా సరే.. ప్రతి ఒక్క భారతీయుడు తన జాతీయత గురించి ఇట్టే పూర్తి చేసే పత్రాన్ని కలిగి ఉండటం బాగానే ఉన్నా.. విమర్శనాత్మక కోణంలో చెప్పాల్సి వస్తే.. ఇప్పుడు ఎలా ఉంది? అన్నది ప్రశ్న. ఆధార్.. పాస్ పోర్టు.. పాన్ కార్డ్.. ఓటర్ ఐడీ.. ఇలా అన్నింటికి సంబంధించి చూస్తే.. ఇవేవీ భారత పౌరసత్వాన్ని తెలియజేసే పత్రాలుకావు. అయితే.. డిజిటల్ యుగంలో పౌరసత్వాన్ని నిరూపించలేకపోవటం ప్రభుత్వ పాలనా వైఫల్యంగా పేర్కొంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికైనా ఈ అంశంపై సీరియస్ గా ఫోకస్ చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News