ఇండియా కూటమి కీలక భేటీ.. మమత ఎంట్రీ, కేజ్రీవాల్, స్టాలిన్ దూరం?
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటానికి సిద్ధమవుతున్న ప్రతిపక్ష ఇండియా కూటమి జూన్ 8 సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని 'కన్‌స్టిట్యూషన్ క్లబ్'లో అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించబోతోంది
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటానికి సిద్ధమవుతున్న ప్రతిపక్ష ఇండియా కూటమి జూన్ 8 సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని 'కన్‌స్టిట్యూషన్ క్లబ్'లో అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించబోతోంది. జన్‌బంధన్ పేరుతో జరగనున్న ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా 23 రాజకీయ పార్టీలు హాజరుకానున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేశ్ అధికారికంగా ప్రకటించారు. భిన్నత్వంలో ఏకత్వమే ఈ కూటమి బలమని, మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని దెబ్బతీస్తోందన్న విషయంలో అందరం ఏకతాటిపై ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశం వెనుక ఎన్నో ఆసక్తికరమైన సమీకరణాలు, అంతర్గత విబేధాలు కూడా దాగి ఉన్నాయని అంటున్నారు.
ఇప్పుడే ఎందుకు సమావేశం
ఇండియా కూటమి జన్‌బంధన్ మీటింగ్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెబుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, విపక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశంగా వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే ఒక ఉమ్మడి జాతీయ కార్యాచరణను సిద్ధం చేయడం కూటమి వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ఓటు హక్కుపై దాడి వంటి అంశాలపై పార్లమెంట్ లోపల, బయట కేంద్రాన్ని ఉమ్మడిగా ఎలా నిలదీయాలనే దానిపై చర్చించనున్నట్లు చెబుతున్నారు.
మమత ఎంట్రీ.. కేజ్రీవాల్ దూరం
ఈ భేటీకి సంబంధించి దేశ రాజకీయాల్లో ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతల వైఖరి ఆసక్తికరంగా మారింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయినప్పటికీ, ఇండియా కూటమి బలోపేతానికి మమతా బెనర్జీ గట్టి మద్దతు ప్రకటించారు. ఆదివారమే ఆమె కోల్‌కతా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. టిఎంసి ఎంపీ ఓబ్రెయిన్ కూడా ఒకే లక్ష్యం.. స్పష్టమైన సంకల్పంతో కలవబోతున్నాం అంటూ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో కూటమిని నడిపించే వ్యూహకర్తగా మమతా బెనర్జీ అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కేజ్రీవాల్ వ్యూహాత్మక దూరం
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సమావేశానికి దూరంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. కూటమితో సంబంధాలు సజావుగా ఉన్నట్లు కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌తో విభేదాల వల్ల ఆప్ ఈ భేటీకి దూరంగా ఉంటూ తన సొంత వ్యూహాలకు పదును పెడుతోందని చెబుతున్నారు. అదేవిధంగా తమిళనాడు పరిణామాలతో డీఎంకే కూడా కూటమి నుంచి తప్పుకున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఇండియా కూటమిలోని ముఖ్యమైన నేతలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.
కూటమికి సవాల్‌గా మారిన అంతర్గత పోరు
23 పార్టీలు వస్తున్నాయని కాంగ్రెస్ చెప్తున్నా కూటమిలోని ముగ్గురు కీలక మిత్రుల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీతో జతకట్టడంపై డిఎంకె తీవ్ర ఆగ్రహంతో ఉందని అంటున్నారు. కాంగ్రెస్ తమకు ద్రోహం చేసిందని ఆరోపిస్తూ మాజీ సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా కేరళ ఎన్నికల ప్రచారంలో లెఫ్ట్ పార్టీలు, బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయని రాహుల్ గాంధీ, ఖర్గే ఆరోపించడంపై సీపీఎం తీవ్ర అసంతృప్తితో ఉందని అంటున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని సీపీఎం నేత ఎం.ఎ. బేబీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాశారు. అయినప్పటికీ, కూటమి స్ఫూర్తి కోసం ఈ మీటింగ్‌కు తమ ప్రతినిధిని పంపుతున్నట్లు లెఫ్ట్ తెలిపింది.
ఇక ఇండియా కూటమి భేటీని బిజెపి తేలిగ్గా తీసిపారేసింది. మిషన్ లేదు.. విజన్ లేదు.. కేవలం కన్ఫ్యూజన్ మాత్రమే ఉంది" అని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, అంతర్గత అలకలు, విభేదాలను పక్కన పెట్టి, 23 పార్టీలను ఒకే తాటిపైకి తెచ్చి జన్‌బంధన్ వేదికగా ఇండీ కూటమి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.