167 లక్షల కోట్లు వాళ్ల ఆస్తి... ట్యాక్స్ ఎంత కట్టారు?

తాజాగా విడుదలైన హురున్ ఇండియా జాబితా ప్రకారం.., దేశంలో 350 మందికి పైగా బిలియనీర్లు ఉన్నారు. వీరి మొత్తం సంపద అక్షరాలా 167 లక్షల కోట్లు.;

Update: 2025-10-02 13:45 GMT

భారతదేశంలో ధనవంతులు మరింత ధనవంతులు అవుతుండగా.. పేదవాళ్లు మరింత పేదలుగా మారుతున్నారు. ఈ అసమానతలు భారీగా పెరిగిపోతున్నాయి. డబ్బు ఉండే వాడి దగ్గరే పోగవుతోంది. లేనివాళ్ల కడుపు కాలుతోంది. దేశం అభివృద్ధి అనేది సమానత్వంగా సాగడం లేదు. కోట్లకు పడగలెత్తుతున్న కోటీశ్వరులు ఓవైపు.. కడు పేదరికపు బీదలు ఒకవైపు నిలబడుతున్నారు. దేశం ముందు ఇప్పుడు ఒక కీలకమైన ప్రశ్న ఉంది. ఈ అపారమైన సంపద దేశానికి ఎంత మేరకు పన్నుల రూపంలో తిరిగి వస్తోంది? అన్నది సగటు సామాన్యుడు నిలదీస్తున్న ప్రశ్న..

తాజాగా విడుదలైన హురున్ ఇండియా జాబితా ప్రకారం.., దేశంలో 350 మందికి పైగా బిలియనీర్లు ఉన్నారు. వీరి మొత్తం సంపద అక్షరాలా 167 లక్షల కోట్లు. ఇది దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP)లో దాదాపు సగం! దేశ ఆర్థిక శక్తిని చాటుతున్న ఈ సంఖ్య, మరోవైపు పన్నుల విధానంపై, సామాజిక అసమానతలపై తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

*ధనికుల వృద్ధి - పేదరికం స్థిరం

గత 13 ఏళ్లలో బిలియనీర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగినప్పటికీ, కోట్లాది మంది ప్రజలు ఇప్పటికీ రెండు పూటలా భోజనానికి కూడా కష్టపడుతున్నారనే చేదు వాస్తవాన్ని ఎత్తి చూపుతున్నాయి.

మధ్యతరగతిపై భారం

సామాన్య ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులు చెల్లించే ఆదాయపన్ను, జీఎస్టీ ద్వారానే ప్రభుత్వ ఖజానా నిండుతోంది. ఇంధన ధరల పెరుగుదల, విద్య, వైద్య ఖర్చులు, పన్నుల భారం అంతా ఈ వర్గంపైనే పడుతోంది.

కార్పొరేట్ రాయితీలు

దీనికి విరుద్ధంగా పెద్ద కార్పొరేట్‌లు, ధనిక వ్యాపారవేత్తలు సులభంగా పన్ను మినహాయింపులు, సబ్సిడీలు, రుణ మాఫీలు పొందుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఓ తెలుగు పారిశ్రామికవేత్త ఏకంగా 8వేల కోట్ల అప్పుకు రెండున్నర వేల కోట్లు కట్టి మిగతా బ్యాంకులకు మాఫీ చేసుకున్నాడు. ఇదే ఒక పేదవాడు లోన్ ఎగ్గొడితే ఈబ్యాంకులు ఊరుకుంటాయి.. పీల్చి పిప్పి చేసి ప్రాణాలు తీస్తాయి. ధనికులకు పన్నుల విషయంలో ఉన్న అనుకూలతలు, సామాన్యులపై పన్నుల భారం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ విమర్శలు స్పష్టం చేస్తున్నాయి.

*ప్రభుత్వం, బిలియనీర్ల డబుల్ రోల్

ఈ పరిస్థితులకు ప్రభుత్వం , బిలియనీర్లు ఇద్దరూ బాధ్యత వహించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ప్రభుత్వానికి సవాల్: సరైన పన్ను విధానం

ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి జేబుల నుండి డబ్బును వసూలు చేయడంలో చూపించే శ్రద్ధను, బిలియనీర్లపై సరైన పన్ను విధించడంలో, దానిని వసూలు చేయడంలో చూపడం లేదనేది ప్రధాన ఆరోపణ. $167 లక్షల కోట్ల సంపదలో కొంత భాగాన్ని అయినా నిజాయితీగా పన్ను రూపంలో రాబట్టగలిగితే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని, పన్నుల విధానాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

* బిలియనీర్లకు నైతిక బాధ్యత: 'సమాజమే మూలం'

వ్యాపార విజయాన్ని గర్వంగా చెప్పుకోవడం ఎంత సబబో, తాము ఆర్జించిన సంపదలో కొంత భాగాన్ని దేశానికి తిరిగి ఇవ్వడం అంతే ముఖ్యమని విశ్లేషణలు చెబుతున్నాయి. "సమాజం వల్లే సంపద వచ్చింది" అనే సూత్రాన్ని అంగీకరించి, పన్నులు తప్పించుకోకుండా నిజాయితీగా చెల్లించడం దేశానికి చేయగలిగే గొప్ప సేవగా పేర్కొనబడింది.

అసమానతకు చిహ్నంగా సంపద?

ఆదాయం సమానంగా పంచబడనంత వరకు దేశం ముందుకు వెళ్లడం అసాధ్యమని మేధావులు స్పష్టం చేస్తున్నారు. బిలియనీర్ల సంపదలో పన్ను రూపాయికి, పేద ప్రజల కష్టానికి సమాన విలువ ఇవ్వాలి. లేకపోతే ఈ $167 లక్షల కోట్లు అనే భారీ సంఖ్య దేశానికి గర్వకారణంగా మిగలక, తీవ్రమైన సామాజిక అసమానతకు చిహ్నంగా మారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పన్నుల చెల్లింపులో నిజాయితీ, విధానాల రూపకల్పనలో సమతుల్యత రెండూ నేటి అత్యవసరాలు.

Tags:    

Similar News