JEE అడ్వాన్స్‌డ్ సీటు: 75శాతం నిబంధనపై IIT కీలక నిర్ణయం

ప్రస్తుతం వివిధ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 11,31,961 జవాబు పత్రాల పునఃపరిశీలన కోసం విద్యార్థుల నుండి రికార్డు స్థాయిలో 4,04,319 దరఖాస్తులు వచ్చాయి.

Update: 2026-06-07 06:05 GMT

దేశవ్యాప్త ప్రతిష్టాత్మక ఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ అర్హత ప్రమాణాలపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) రూర్కీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ లేదా పన్నెండో తరగతిలో ప్రస్తుతం 75 శాతం మార్కుల అర్హత ప్రమాణాన్ని అందుకోలేకపోయిన విద్యార్థులు కూడా తమకు నచ్చిన ఐఐటీ సీట్ల ఎంపిక (వెబ్ ఆప్షన్స్) ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతించింది. గత కొన్ని రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి- అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ఐఐటీ రూర్కీ యాజమాన్యం ఈ తాత్కాలిక సడలింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటీవల మే 13న విడుదలైన సీబీఎస్‌ఈ ఫలితాలలో లక్షలాది మంది విద్యార్థులు తాము ఆశించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కుల రీ-వాల్యుయేషన్ (పునఃపరిశీలన) కోసం భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. అయితే జూన్ 1న ఐఐటీ రూర్కీ ప్రవేశాలకు అర్హత సాధించిన 56,880 మంది విద్యార్థుల జాబితాను ర్యాంకులతో సహా విడుదల చేసింది. ఈ జాబితాలో మంచి ర్యాంకులు సాధించినా పన్నెండో తరగతిలో సాంకేతికంగా 75 శాతం మార్కులు లేకపోవడంతో ఆందోళన చెందుతున్న విద్యార్థులకు తాజా నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది.

ఈ కొత్త నిబంధన ప్రకారం.. జనరల్-ఓబీసీ-ఎన్‌సీఎల్-ఈడబ్ల్యూఎస్ కేటగిరీలలో 75 శాతం కంటే తక్కువ... అలాగే ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగుల కేటగిరీలలో 65 శాతం కంటే తక్కువ మార్కులు ఉన్న అభ్యర్థులు ప్రస్తుతం కౌన్సిలింగ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. వారి ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు కూడా జరుగుతుంది. అయితే రీ-వాల్యుయేషన్ ద్వారా సవరించిన మార్కుల స్కోర్‌కార్డును జూలై 15 లోపు అధికారిక ఈమెయిల్ (orgjee@iitr.ac.in) ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. అలా సమర్పించిన వారికి నాల్గవ రౌండ్ కౌన్సిలింగ్ ముగిసే సమయానికి కేటాయించిన సీటును ఖరారు చేస్తారు.

వాస్తవానికి సీబీఎస్‌ఈ రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో విద్యార్థులు సామాజిక మాధ్యమాల వేదికగా ఈ 75 శాతం అర్హత నిబంధనను ఈ ఒక్క ఏడాదికి పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే 75శాతం మార్కుల నిబంధ‌న అనేది కేవ‌లం ఏదో ఒక బోర్డ్ కు సంబంధించిన‌ది కాదు.. దాదాపు 36బోర్డుల నుంచి విద్యార్థులు హాజ‌ర‌వుతారు.. అందువ‌ల్ల నియ‌మాన్ని పూర్తిగా తొల‌గించ‌డం కుద‌ర‌దు. అయితే విద్యార్థుల‌ మార్కుల లిస్ట్ స‌మ‌ర్పించేందుకు జూలై 15వ‌ర‌కూ గ‌డువు నిర్ణ‌యించామ‌ని ఐఐటి-రూర్కీ ప్ర‌క‌టించింది.

ప్రస్తుతం వివిధ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 11,31,961 జవాబు పత్రాల పునఃపరిశీలన కోసం విద్యార్థుల నుండి రికార్డు స్థాయిలో 4,04,319 దరఖాస్తులు వచ్చాయి. ఈ రీ-ఇవాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగుతుండటంతో, ఐఐటీ రూర్కీ ఇచ్చిన ఈ సమయం విద్యార్థులకు తమ మార్కులను మెరుగుపరుచుకుని ఐఐటీ కలలను నిజం చేసుకునేందుకు ఆఖరి అవకాశంగా నిలిచింది. చెప్పిన గ‌డువు లోగా మార్కుల లిస్ట్ స‌మ‌ర్పించ‌క‌పోతే సీట్ ర‌ద్ద‌వుతుంద‌ని కూడా అట్టిమేటం జారీ చేసింది.

Tags:    

Similar News