అసలు ఏమిటీ లోతుకుంట భూవివాదం?

శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ కంపెనీ తనకు చెందిన ప్రైవేటు పట్టా స్థలంలోకి హైడ్రా ఆక్రమంగా ప్రవేశించిందని చెబుతోంది.

Update: 2026-07-28 10:08 GMT

ఒక భూవివాదానికి సంబంధించి హైకోర్టు విచారణలో ఒక ప్రభుత్వ సంస్థకు చెందిన ఉన్నతాధికారిని తప్పించాలని చెప్పటం చాలా అరుదైన వ్యవహారంగా చెప్పాలి. రేవంత్ సర్కారు తీసుకొచ్చిన హైడ్రా పెను సంచలనాలకు.. కొత్త వివాదాలకు తెర తీసిందన్న మాట ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. లోతుకుంటకు చెందిన భూవివాదంపై సదరు భూమి ప్రైవేటు పట్టా భూమిగా చెబుతుంటే.. అందుకు భిన్నంగా హైడ్రా వాదన ఉంది.

తాము ప్రైవేటు పట్టా భూమి జోలికే పోలేదని హైడ్రా స్పష్టం చేస్తోంది. ఒక ఉన్నతాధికారిని పదవి నుంచి తప్పించాలంటూ స్వయంగా హైకోర్టు సింగిల బెంచ్ చెప్పిన ఉదంతానికి సంబంధించిన అసలు వివాదం ఏంటి? ఇదెలా మొదలైంది? ఇప్పుడు ఎక్కడ ఉంది? వివాదంలో భాగమైన ఇద్దరి వాదన ఏమిటి? అన్న ప్రశ్నలతో పాటు.. ఎలాంటి స్టాండ్ తీసుకోకుండా.. వాస్తవాల్ని చెప్పే కరంలో.. ఇరువురు ఏమనుకుంటున్నారన్న మాటల్ని మాత్రమే చెబుతున్నాం. ఇందులో ఎలాంటి స్టాండ్ తీసుకోవటం లేదన్నది మర్చిపోకూడదు.

శాంతా శ్రీరామ్ సంస్థ వాదన ఏంటి?

శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ కంపెనీ తనకు చెందిన ప్రైవేటు పట్టా స్థలంలోకి హైడ్రా ఆక్రమంగా ప్రవేశించిందని చెబుతోంది. రికార్డుల ప్రకారం లోతుకుంట గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 1, 2 లో సుమారు 40 ఎకరాల పట్టా భూమి మాకు ఉంది. ఈ భూమి మొత్తం ప్రైవేటు భూమి. ప్రభుత్వానికి కాదని గతంలో కోర్టులు తీప్పులు కూడా ఇచ్చాయి.

గతంలో కోర్టు విచారణ సందర్భంగా ఆ భూమి ప్రభుత్వ భూమి అని ఎక్కడా నిరూపణ కాలేదు. న్యాయస్థానాల ఆదేశాలు ఉన్నా హైడ్రా ఆక్రమంగా ప్రవేశించింది. మేం వేసిన ఫెన్సింగ్ తొలగించింది. ఇదే విషయాన్ని కోర్టు ముందుంచాం. ఆ సందర్భంగా ఆ భూమిలోకి వెళ్లమని హైడ్రా హామీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా దానిని ఉల్లంఘించి.. హైడ్రా భూఆక్రమణ పేరుతో చర్యలు తీసుకుంది.

తమ వాదనను కోర్టు ముందు శాంతా శ్రీరాం నిర్మాణ సంస్థ పలు అంశాల్ని ఉంచింది. అయితే.. ఇందుకు భిన్నమైన వాదనను హైడ్రా వినిపిస్తోంది. ఈ సందర్భంగా ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావిస్తోంది. అదేమంటే.. శాంతా శ్రీరామ్ చూపిస్తున్న భూమి లోతుకుంట సర్వే నంబర్లు 1, 2 పరిధిలో లేదని హైడ్రా స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించి సదరు సంస్థ వినిపిస్తున్న వాదనను చూస్తే..

హైడ్రా వాదన

శాంతా శ్రీరామ్ నిర్మాణ సంస్థ కోర్టులో చెబుతున్న భూమి రికార్డుల ప్రకారం లోతుకుంటలో ఉంటే.. మేం కాపాడిన ప్రభుత్వ భూమి కంటోన్మెంట్ పరిధిలో జనరల్ ల్యాండ్ రికార్డ్స్ నెంబరు 243లో 119 ఎకరాలు.. 255లో 29 ఎకరాలు ఉంది. శాంతా శ్రీరామ్ ప్రస్తావిస్తున్న భూమిలో సహజ సిద్ధమైన కొండలు ఉన్నాయి. జంతువులు తిరిగే ఈ ప్రాంతంలో రాత్రిపూట గుట్టలు పేలుస్తూ.. భారీ శబ్దాలతో వన్య ప్రాణులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.

ఈ అంశంపై సేవ్ రాక సొసైటీ.. స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో మేం రంగంలోకి దిగాం. సర్వే నంబరు 1, 2 ప్రైవేటు భూమిలో లే అవుట్ కు 2007లో శాంతా శ్రీరామ్ అనుమతులు తెచ్చుకుంది. 2026 సవరణ లేఅవుట్ కు దరఖాస్తు చేసినప్పుడు జీఎల్ఆర్ నెంబరు 243/పీ, 255/పీగా చూపారు.

ఇలా ఇరు వర్గాలు వినిపిస్తున్న వాదన నేపథ్యంలో.. న్యాయస్థానం తాజాగా ఏం చెప్పనుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News