హైడ్రా ఆపరేషన్: రూ.2200 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం
ఆరంభంలో పడిన అడుగుల్లో తప్పులు దొర్లినప్పటికి.. ఎదురుదెబ్బలకు సరైన దిశగా ప్రయాణిస్తోంది హైడ్రా.;
ఆరంభంలో పడిన అడుగుల్లో తప్పులు దొర్లినప్పటికి.. ఎదురుదెబ్బలకు సరైన దిశగా ప్రయాణిస్తోంది హైడ్రా. రేవంత్ సర్కారు మానసపుత్రిక అయిన హైడ్రా.. ఇటీవల కాలంలో అక్రమార్కులకు వరుస షాకులు ఇస్తోంది. ఒకటి తర్వాత ఒకటి చొప్పున ప్రభుత్వ భూములను.. పార్కులను కబ్జాదారుల చెర నుంచి విముక్తి కల్పిస్తోంది హైడ్రా. పేదలు.. మధ్యతరగతి కలల్ని చిదిమేలా వ్యవహరిస్తోందన్న మాట బలంగా వినిపిస్తున్నప్పటికి.. అతి తక్కువ వ్యవధిలోనే తన ఇమేజ్ దెబ్బ తీసే వివాదాస్పద నిర్ణయాలకు దూరంగా ఉంటోంది,
అదే సమయంలో ప్రజలకు సంబంధించిన అంశాలు.. ప్రభుత్వ భూములను కాపాడేందుకు చేపడుతున్న చర్యలు హైడ్రాకు మరింత ప్రజామద్దతు వచ్చేలా చేస్తోంది. తాజాగా మాదాపూర్ లోని ప్రైమ్ లొకేషన్ లో ఏకంగా రూ.2200 కోట్ల భూమిని కబ్జాచేసిన వారికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది హైడ్రా. ఏళ్లుగా ఈ స్థలాన్ని కబ్జా పెట్టటమే కాదు.. వాణిజ్య అవసరాలకు తన పేరు మీద అద్దెలకు ఇచ్చే తీరును చూసిన అధికారుల సైతం అవాక్కు అయ్యారు.
హైడ్రా నిర్వహించే ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా సర్వే నిర్వహించటం.. ప్రభుత్వ భూమిగా తేలటంతో వెంటనే స్పందించిన హైడ్రా అందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. గురువారం.. ఈ కబ్జా భూములకు వెళ్లి.. నిర్దాక్షిణ్యంగా కబ్జాదారుల షెడ్లను తొలగించటమే కాదు.. ప్రభుత్వం ఆ భూమిని సొంతం చేసుకుంది. ఏళ్లకు ఏళ్లుగా కబ్జాదారుల చేతుల్లో ఉండిపోయిన ప్రభుత్వ భూమి ఎట్టకేలకు తిరిగి రావటం సరికొత్త పరిణామంగా మారింది. ఏమైనా.. ఆరంభంలో హైడ్రా పని తీరు మీద విమర్శలు వెల్లువెత్తినా.. ఇటీవల కాలంలో తీసుకుంటున్న చర్యలకు ప్రజల్లో సానుకూల స్పందనతో పాటు.. ఏళ్లకు ఏళ్లుగా తిరుగులేదన్నట్లుగా వ్యవహరిస్తున్న కబ్జారాయుళ్లకు చెక్ పడుతున్న వైనంపై హర్షం వ్యక్తమవుతోంది.