అయ్యో ఎంత పని చేశావు తల్లీ.. 11 నెలల బిడ్డకు విషమిచ్చి సూసైడ్
కుటుంబం అన్న తర్వాత, కాపురం అన్నాక కలహాలు లేకుండా ఉంటాయా? అయితే.. వీటిని డీల్ చేసే విధానంలో ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తుంటారు.;
కుటుంబం అన్న తర్వాత, కాపురం అన్నాక కలహాలు లేకుండా ఉంటాయా? అయితే.. వీటిని డీల్ చేసే విధానంలో ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తుంటారు. హైదరాబాద్ నగర పరిధిలో ఒక కుటుంబంలో చోటు చేసుకున్న పరిస్థితులు మాత్రం అయ్యో అనిపించేలా ఉండటమే కాదు.. ఈ విషాద ఉదంతం గురించి తెలిసిన తర్వాత మాత్రం వేదన చెందకుండద ఉండలేని పరిస్థితి. కుటుంబ కలహాలతో పదకొండు నెలల బిడ్డకు విషమిచ్చి ప్రాణాలు తీసిన తల్లి.. తర్వాత తాను ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. కళ్ల ముందే కుమార్తె.. మనమడు ఆత్మహత్య చేసుకున్న వైనంతో తట్టుకోలేని మృతురాలి తల్లి సైతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైనం వేదనకు గురి చేసేలా మారింది. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ లోని హస్తినాపురంలో నల్గొండకు జిల్లాకు చెందిన 33 ఏళ్ల యశ్వంత్ రెడ్డికి అదే ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల సుష్మితతో నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. వారికి పదకొండు నెలల అశ్వంత్ నందన్ రెడ్డి ఉన్నారు. యశ్వంత్ రెడ్డి సీఏ (చార్టెడ్ అకౌంటెంట్)గా పని చేస్తున్నాడు. ఫిబ్రవరి ఏడున మనమడి పుట్టినరోజు ఉండటంతో సుష్మి తల్లి 50 ఏళ్ల లలిత షాపింగ్ కోసం హైదరాబాద్ కు కుమార్తె ఇంటికి వచ్చారు.
ఈ క్రమంలో పుట్టినరోజు వేళ చేసే బర్త్ డే పార్టీ.. దానికి అయ్యే ఖర్చు గురించి దంపతుల మధ్య గొడవ జరిగింది. గురువారం మరోసారి ఈ అంశంపై తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. అనంతరం ఇంట్లో నుంచి యశ్వంత్ రెడ్డి వెళ్లిపోయాడు. తల్లి ముందే భర్త తనను అవమానించాడని భావించిన సుష్మిత తీవ్ర మనస్తాపానికి గురైంది. కాసేపటికే బెడ్రూంలోకి వెళ్లి.. బాబుకు విషమిచ్చి.. ఆపై తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అది చూసి తట్టుకోలేని సుష్మితల్లి విషం తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
గురువారం రాత్రి 8 గంటల వేళలో ఇంటికి వచ్చిన యశ్వంత్ రెడ్డికి భార్య, కొడుకు చనిపోయి ఉండటం.. అత్త అపస్మారక స్థితిలో ఉన్న వైనాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లలితను వారు ఆసుపత్రికి తరలించారు. తమ కుమార్తె, మనమడు మరణానికి యశ్వంత్ రెడ్డే కారణమని ఆరోపిస్తూ సుష్మిత పెద్దనాన్న సంజీవరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తికోసం తరచూ వేధించేవాడని సుష్మిత బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో యశ్వంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు సుష్మిత తల్లి లలిత ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.