పుట్టిన రోజు పార్టీలో గొడవ.. రాజీకి పార్టీ.. బిల్లు కట్టలేక విద్యార్థి సూసైడ్
హైదరాబాద్ శివారులోని ఒక కాలేజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం సంచలనంగా మారింది.;
హైదరాబాద్ శివారులోని ఒక కాలేజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం సంచలనంగా మారింది. అయితే.. అతడు చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోను చూసినోళ్లంతా అయ్యో అనే పరిస్థితి. అంతేకాదు.. ఆత్మహత్యకు కారణమైన అంశాలకు సంబంధించి చూసినప్పుడు.. సీనియర్ల దాష్ఠీకం ఉండకపోతే.. అతను బతికిపోయేవాడన్న భావన కలుగక మానదు. ఇంతకూ అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే..
ఘట్ కేసర్ మండలం కొర్రెములలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అదిలా బాద్ జిల్లాలోని లక్కారం గ్రామానికి చెందిన జాదవ్ సాయితేజ. 19 ఏళ్ల ఈ కుర్రాడు సిద్ధార్థ కాలేజీలో చదువుతూ నారపల్లిలోని హాస్టల్ లో ఉంటున్నాడు. ఫస్ట్ ఇయర్ విద్యార్థి పుట్టిన రోజు సందర్భంగా తనతో పాటు చదువుకునే డేవిడ్ అనే విద్యార్థితో కలిసి ఈ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యాడు.
ఈ సందర్భంగా గొడవ జరిగింది. దీంతో.. సీనియర్ విద్యార్థి చిన్నబాబుకు ఎంట్రీ ఇచ్చి ఇరు వర్గాల మధ్య నచ్చజెప్పి రాజీ చేశాడు. దీనికి బదులుగా పార్టీ ఇవ్వాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆదివారం రాత్రి నారపల్లిలోని ఒక బార్ లో ఏడుగురు విద్యార్తులు మద్యం తాగి రూ8వేలు బిల్లు చేశారు. అయితే సాయితేజ వద్ద రూ.2500 మాత్రమే ఉన్నాయి. మిగిలిన డబ్బులకు చిన్నబాబు ఒత్తిడి చేయటంతో పాటు.. అవమానకరంగా మాట్లాడటంతో తట్టుకోలేని అతను హాస్టల్ కు వచ్చి తండ్రికి వీడియో కాల్ చేశాడు.
చిన్నబాబు వేధింపులు తట్టుకోలేక తాను సూసైడ్ చేసుకుంటున్నట్లుగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. వెంటనే హాస్టల్ నిర్వాహకులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చేసరికి.. ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయాడు. వేధింపులకు పాల్పడిన విద్యార్థిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడి తండ్రి ఇచ్చిన కంప్లైంట్ తో అతడిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం స్థానికంగా సంచలనంగా మారింది. మరోవైపు బాధితుడి వర్గీయులు.. విద్యార్థి సంఘాలు రోడ్ల మీద ధర్నాకు దిగారు. ఇదిలా ఉండగా.. ఈ ఉదంతంలో విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన చిన్నబాబు ఏడాదిగా కాలేజీకి రావటం లేదని కాలేజీ యాజమాన్యం ఒక నోట్ విడుదల చేయటం గమనార్హం.