మందు తాగి పట్టుబడితే ఆఫీసులకు లేఖలు.. హైదరాబాద్ పోలీసుల నిర్ణయం
ఇలాంటి తీరుకు చెక్ పెట్టేందుకు మరింత కఠినంగా వ్యవహరించేందుకు వీలుగా హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.;
మందుబాబులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా హైదరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మద్యం తాగి వాహనాల్ని నడుపుతున్న తీరుతో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఇలాంటి తీరుకు చెక్ పెట్టేందుకు మరింత కఠినంగా వ్యవహరించేందుకు వీలుగా హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటివరకు మద్యం తాగి పట్టుబడితే జైలు.. జరిమానా.. కౌన్సెలింగ్ లాంటి చర్యలకు పరిమితమయ్యేవారు.
అయితే.. ఇటీవల కాలంలో మద్యం తాగి వాహనాల్ని నడిపే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇదే సందర్భంలో హైదరాబాద్ సీపీ సజ్జన్నార్ స్పందిస్తూ.. మద్యం సేవించి వాహనాల్ని నడుపుతూ ఇతరుల ప్రాణాల్ని తీసే వారిని రోడ్డు టెర్రరిస్టులతో పోల్చటం తెలిసిందే. అంతేకాదు.. మందుబాబుల్ని కట్టడి చేసేందుకు చర్యల్ని ఆయన వెల్లడించారు.
గతానికి భిన్నంగా మద్యం సేవించి వాహనాలు నడిపి.. తనిఖీల్లో పట్టుబడే వారి విషయంలో సీరియస్ యాక్షన్ కు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిడ్ తాజాగా వార్నింగ్ ఇచ్చారు. న్యూఇయర్ నేపథ్యంలో గత ఏడాది డిసెంబరు 24 నుంచి 31 వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించటం తెలిసిందే. ఈ క్రమంలో సుమారు 1200 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వీరిలో 270మందికి శిక్ష ఖరారైంది. వీరికి కనిష్ఠంగా ఒక రోజు నుంచి గరిష్ఠంగా మూడు రోజుల పాటు జైలశిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. తాము జరిపిన తనిఖీల్లో పట్టుబడిన వారు ఉద్యోగులు అయితే వారు పని చేస్తున్న సంస్థకు.. అదే విద్యార్థులు అయితే వారు చదువుతున్న కళాశాలలకు లేఖలు పంపుతామని హైదరాబాద్ సిటీ జాయింట్ కమిషనర్ స్పష్టం చేస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కోరతామని స్పష్టం చేస్తున్నారు. మారుతున్న పరిణామాలను పరిగణలోకి తీసుకొని.. మద్యం సేవించి వాహనాల్ని నడపటం అత్యంత ప్రమాదకరమన్న విషయాన్ని మందుబాబులు గుర్తిస్తే మంచిది. లేదంటే..వీరు చేసే తప్పునకు కెరీర్ తో పాటు కుటుంబం కూడా ప్రభావితం అవుతుందన్నది మర్చిపోకూడదు.