ఖరీదైన కారు స్టీరింగ్ ను మైనర్ బాలుడికి ఇచ్చిన తండ్రి.. కట్ చేస్తే?

పిల్లలకు బాధ్యత గురించి తెలియజేయాల్సిన తల్లిదండ్రులు.. ఆ విషయాన్ని విస్మరించటానికి మించిన దుర్మార్గం మరొకటి ఉండదు.

Update: 2026-06-19 07:00 GMT

పిల్లలకు బాధ్యత గురించి తెలియజేయాల్సిన తల్లిదండ్రులు.. ఆ విషయాన్ని విస్మరించటానికి మించిన దుర్మార్గం మరొకటి ఉండదు. పెద్దలే ఇలా వ్యవహరిస్తే పిల్లలు మరెంత దారుణంగా తయారవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి తెలిస్తే.. నోట మాట రాలేని పరిస్థితి. ఇలా కూడా చేస్తారా? అన్న షాక్ కు గురి కాక మానదు. ఖరీదైన కారును కొన్న ఒక వ్యాపారి తన పదకొండేళ్ల మైనర్ బాలుడికి ఔటర్ రింగ్ రోడ్డు మీద స్టీరింగ్ ఇవ్వటం.. అతడ్ని డ్రైవ్ చేయాలంటూ ప్రోత్సహిస్తున్న వైనం చూసి అవాక్కు అయిన పరిస్థితి.

అత్యంత వేగంగా వాహనాలు దూసుకెళ్లే ఔటర్ మీద ఈ తండ్రి అత్యుత్సాహపు చేష్టను కొందరు వాహనదారులు వీడియోగా తీసి హైదరాబాద్ పోలీసులకు సోషల్ మీడియాలో ట్యాగ్ చేయటంతో ఈ చిన్న వీడియో వైరల్ అయ్యింది. ఈ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు తక్షణమే స్పందించటమే కాదు.. కారును సీజ్ చేసి.. తండ్రిని అరెస్టు చేశారు. ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనలో మైనర్ బాలుడు ఉన్న నేపథ్యంలో తండ్రి పేరును.. నేపథ్యాన్ని.. వారి చిరునామాను వెల్లడించటం లేదు. అదే సమయంలో ట్రాఫిక్ పోలీసులు తమ సోషల్ మీడియా పేజీలో కారు నెంబర్ ను ప్రకటించినప్పటికి.. మైనర్ బాలుడి వివరాల గోప్యతను పరిగణలోకి తీసుకొని ఆ వివరాల్ని కూడా ఇవ్వటం లేదు.

జూన్ 11న అర్థరాత్రి వేళ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఒక ఖరీదైన కారు దూసుకెళుతోంది. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్లే మార్గంలో దూసుకెళుతున్న ఈ ఖరీదైన కారును చూసిన వారికి.. మరో షాకింగ్ వైనాన్ని గుర్తించారు. వేగంగా దూసుకెళుతున్న కారు స్టీరింగ్ మైనర్ బాలుడి చేతిలో ఉండటంతో.. కొందరు ఈ ఉదంతాన్ని వీడియో తీసి ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేశారు. దాదాపు 24 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన తీరుపై వేగంగా స్పందించి.. కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అందుకు తగ్గట్లే రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సదరు కారును.. దాని యజమానిని గుర్తించారు. టౌలిచౌకికి చెందిన ఒక స్థిరాస్తి వ్యాపారి ఈ అతి చేష్టకు కారణంగా తేల్చారు. అతగాడు కొన్న ఖరీదైన ఎంజీ సైబర్ స్టర్ లగ్జరీ స్పోర్ట్స్ కారును గుర్తించి వెంటనే స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ప్రస్తుతం సదరు వాహనం పోలీసుల అధీనంలో ఉంది. ఈ ఉదంతంలో మైనర్ బాలుడి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యాపారి మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మైనర్ కు మోటారు వాహనాన్ని ఇవ్వటం.. నిర్లక్ష్యంగా.. ప్రమాదకరంగా వాహనాన్ని నడపటం.. చట్టపరమైన ఆదేశాల్నిధిక్కరించటం లాంటి నేరాలకు సంబంధించిన సెక్షన్లతో కేసును నమోదు చేశారు.

ఈ సెక్షన్లు స్టేషన్ బెయిల్ నేరాలుగానే పరిగణిస్తారు. కాకుంటే.. ఈ నేరాలు కోర్టులో రుజువైతే మాత్రం గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు.. రూ.25 వేల వరకు ఫైన్ విధించే వీలుందని చెబుతున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న తండ్రితో పాటు.. మైనర్ బాలుడికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తండ్రి అతి చేష్ట కారణంగా ఖరీదైన కారు రిజిస్ట్రేషన్ ను ఒక ఏడాది పాటు రద్దు చేస్తారు. అంతేకాదు.. తండ్రి చేసిన తప్పునకు సదరు మైనర్ బాలుడికి పాతికేళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత ఉండదు.

ఈ ఉదంతాన్ని హైదరాబాద్ పోలీసులు తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసి. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు తోటి వాహనదారులకు ముప్పుగా మారుతుందని.. పిల్లల చేతులకు వాహనాల్ని ఇచ్చి వారి భవిష్యత్తును.. ఇతరుల ప్రాణాల్ని ప్రమాదంలో పడేయొద్దని పేర్కొంటూ తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఖరీదైన (ఎంజీ సైబర్ స్టర్) వివరాల్లోకి వెళితే దీని ధర రూ.80 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు.

ఇక.. సీజ్ చేసిన కారును విడిపించుకోవటానికి కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొన్న తర్వాతే.. కారు చేతికి వస్తుంది. ఇందుకు కోర్టు వద్ద కారు విలువతో సమానంగా బాండ్ లేదంటే పూచీకత్తును సమర్పించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. కేసు విచారణ ముగిసేవరకు కారును ఎవరికీ అమ్మకూడదు.. రంగు లేదా మోడల్ మార్చకూడదు. కోర్టు అడిగినప్పుడు పోలీసులు సదరు కారును న్యాయస్థానం ఎదుట హాజరుపర్చాల్సి ఉంటుంది. ఒక అతి చేష్ట సదరు మైనర్ బాలుడి తండ్రికి ఎన్ని తిప్పలు తెచ్చి పెట్టిందో కదా? అందుకే.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందన్న విషయాన్ని తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.

Tags:    

Similar News