వర్క్ ఫ్రమ్ బైక్- సజ్జనార్ ఏమన్నారంటే!
అలాంటిది ఏకంగా బైకులపై ల్యాప్ టాప్ పెట్టుకుని.. చెవిలో ఫోన్లు పెట్టుకుని పనిచేస్తూ.. రద్దీ రహదారులపై దూసుకుపోతున్న ఐటీ ఉద్యోగులు.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వర్క్ ఫ్రమ్ హోమ్(ఇంటి నుంచి పని) గురించి తెలుసు. కరోనా సమయంలో దాదాపు అన్ని ఐటీ సెక్టార్లు.. మీడియాలో ఎడిటోరి యల్ సెక్షన్ వంటివి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను అలవాటు చేసుకుంది. ఇటీవల ఇంధన కొరత.. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో మరోసారి వర్క్ ఫ్రమ్ హోమ్.. అనే మాటను సాక్షాత్తూ ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. వీలైతే.. ఇంధన వినియోగం తగ్గించేందుకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను మరోసారి అందుబాటులోకి తేవాలని సూచించారు. సో.. మొత్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అందరికీ తెలిసిందే.
హైదరాబాద్ టు బెంగళూరు..
ఇటీవలకాలంలో వర్క్ ఫ్రమ్ బైక్/ కార్ కల్చర్ పెరుగుతోంది. కారణాలు ఏవైనా.. బైకులపై వెళ్తున్న వారు.. తమ ముందున్న ఆయిల్ ట్యాంకుపై ల్యాప్‌ట్యాప్‌ను పెట్టుకుని.. పనిచేస్తూ.. చెవిలో ఇయర్ ఫోన్స్ ద్వారా.. సంభాషిస్తూ.. కనిపిస్తున్నాయి. ఇక, కారులో వెళ్తున్న వారు కూడా.. దాదాపు ఇలానే తము ల్యాప్‌ట్యాప్ పెట్టుకుని పనిచేస్తున్న వీడియోలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. ఈ సంస్కృతి బెంగళూరులో ప్రారంభమై.. ప్రస్తుతం హైదరాబాద్ వరకు విస్తరించింది. వాస్తవానికి బైకుపై ప్రయాణించేవారు.. మొబైల్ ఫోన్ మాట్లాడడమే నేరంగా భావిస్తారు. దాదాపు రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది.
అలాంటిది ఏకంగా బైకులపై ల్యాప్ టాప్ పెట్టుకుని.. చెవిలో ఫోన్లు పెట్టుకుని పనిచేస్తూ.. రద్దీ రహదారులపై దూసుకుపోతున్న ఐటీ ఉద్యోగులు.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ ఐటీ ఉద్యోగి హైదరాబాద్‌లో వీధుల్లో రయ్యన ముందుకు సాగుతూ.. తన ముందున్న ల్యాప్‌ట్యాప్‌లో వర్క్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కారులో వెళ్తున్న వారు ఈ వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది కాస్తా.. హైదరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్ దృష్టిలో పడింది. దీనిపై ఆయన ఆసక్తిగా స్పందించారు.
ఆత్రం ఎక్కువైతే..
ఏపని చేసేందుకైనా ఒక పద్ధతి ఉంటుందని.. ఇలా రోడ్డుపై ప్రయాణిస్తూ.. ల్యాప్‌ట్యాప్‌లో పనిచేయడం.. అత్యంత ప్రమాదకరమ ని హెచ్చరించారు. ``ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుం టే... ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది. రోడ్డు మీద మీ ఏకాగ్రత ఒక్క క్షణం తప్పి నా, అది మీ ప్రాణానికే కాదు, పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా ప్రమాదకరం. గుర్తుంచుకోండి. కడుపు నింపుకోవడానికి చేసే పని, కడతేర్చేలా ఉండకూడదు. దయచేసి రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానేయండి. సురక్షితంగా ప్రయాణించి, క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేరుకోండి.`` అని సూచించారు.