గ్లోబల్ రుచులు...విశాఖ పోటెత్తడం ఖాయం

విశాఖలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. ఐటీ రంగం విస్తరిస్తోంది. టూరిజం ఫీల్డ్ కూడా వేగంగా ఎదుగుతోంది. మిట్టల్ స్టీల్ ప్లాంట్ లాంటివి వస్తున్నాయి.;

Update: 2026-03-22 03:00 GMT

విశాఖలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. ఐటీ రంగం విస్తరిస్తోంది. టూరిజం ఫీల్డ్ కూడా వేగంగా ఎదుగుతోంది. మిట్టల్ స్టీల్ ప్లాంట్ లాంటివి వస్తున్నాయి. అంతే కాదు త్వరలోనే భోగాపురం, మూలపేట పోర్ట్, గూగుల్, బ్రాండెడ్ హోటళ్లు, ఇలా ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారబోతోంది. అందులో భాగంగా మరో బ్రాండెడ్ హొటల్ కి తాజాగా కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాంతో విశాఖ గ్లోబల్ ఆతిధ్యానికి సిద్ధమైపోతోంది. తాజాగా విశాఖ తీరాన హయత్ హోటల్ నిర్మాణానికి మంత్రి కందుల దుర్గేష్ భూమి పూజ చేశారు. దాంతో అటు ఆతిథ్య రంగంలో ఇటు పర్యాటక రంగంలో ఇది ఒక కీలక ఘట్టంగా మారుతోంది.

సమ్మిట్ ఒప్పందాలు :

గత ఏడాది విశాఖలో నిర్వహించిన సమ్మిట్ లో భాగంగా చేసుకున్న పలు ఒప్పందాలు ఇపుడు కార్యరూపం దాలుస్తున్నాయని అంటున్నారు. అందులో ఒకటి అయిన పీవీఆర్ గ్రూప్‌కు చెందిన ప్రతిష్టాత్మక హయత్ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి పునాది రాయి పడిపోయింది. ఇది విశాఖ శివారు ప్రాంతం అయిన ఎండాడ సాగర నగర వద్ద ఏర్పాటు చేస్తున్నారు. 250 కోట్ల భారీ పెట్టుబడి తో మూడు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ హోటల్ నిర్మితమవుతోందని రెండేళ్ల కాలపరిమితిలో ఇది అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

గ్లోబల్ సిటీగా :

బ్రాండెడ్ హొటళ్ల రాకకు ఇది ఒక ఆరంభం మాత్రమే అని అంటున్నారు. రానున్న కాలంలో మరిన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం అయ్యే హోటళ్ళు విశాఖలో ఏర్పాటు కానున్నాయని అంటున్నారు. విశాఖపట్నం గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న తరుణంలో ఈ తరహా కొత్త హోటళ్ళు అందుబాటులోకి రావడం అన్నది పర్యాటక రంగానికి వెన్నెముకగా నిలవనుందని అని అంటున్నారు. ఇప్పటికే విశాఖలో వరుణ్ గ్రూప్, రాడిసన్ బ్లూ వంటి అగ్రశ్రేణి హోటళ్ళు ఉన్నాయి. వాటితో పాటు హయత్ హోటల్ చేరబోతోంది. ఈ హోటల్ అయితే ప్రపంచ స్థాయి విలాసవంతమైన వసతులను కల్పిస్తుందని చెబుతున్నారు.

గ్లోబల్ వంటకాలతో ఆతిధ్యం :

గ్లోబల్ వంటకాలతో కూడిన ఫైన్ డైనింగ్ ఇక్కడ ఆతీథ్యంగా ఉంటుంది. ఇది కొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. విశాఖకు పెద్ద ఎత్తున వచ్చే జాతీయ అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారి అభిరుచులకు తగ్గట్టుగా గ్లోబల్ వంటకాలతో కూడిన వంటకాలు అవసరం అవుతున్నాయి. ఆ కొరతను బ్రాండెడ్ హొటళ్ళు తీర్చనున్నాయి. అంతే కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ సమావేశాలు అలాగే అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు కీలకమైన సదస్సులు నిర్వహించుకోవడానికి అత్యున్నత సాంకేతికతతో కూడిన కాన్ఫరెన్స్ హాళ్లు విశాఖకు ఈ హొటొళ్ళ రూపంలో అందుబాటులోకి రానున్నాయి. అంతే కాదు ఆతీధ్య రంగంలో వస్తున్న ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు ఆతిథ్య రంగంలో భారీగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి లభించనుంది. దాంతో స్టార్ హోటళ్ల రాక వల్ల విశాఖ నగర ముఖచిత్రాన్ని మారుతుందని కూటమి ప్రభుత్వం పెద్దలు ధీమాగా చెబుతున్నారు.

Tags:    

Similar News