ఎస్‌ఆర్‌హెచ్‌తో వివాదం.. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహనరావు అరెస్టు
హెచ్‌సీఏ-ఎస్‌ఆర్‌హెచ్ రగడతో తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించింది.;
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ), సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఫ్రాంచైజీ మధ్య తలెత్తిన రగడ కీలక మలుపు తీసుకుంది. చివరకు అది హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహనరావు అరెస్టు వరకు వెళ్లింది. బహుశా.. ప్రతిష్ఠాత్మక హెచ్‌సీఏలో ఈ స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడం ఇదే మొదటిసారేమో? ఎస్‌ఆర్‌హెచ్‌తో వివాదంలో జగన్మోహనరావుతో పాటు మరొకరికీ తెలంగాణ సీఐడీ అరెస్టు చేసింది. ఇప్పటికే హెచ్‌సీఏ వ్యవహారాలపై తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు విజిలెన్స్ విచారణ చేపట్టింది. అది ఇచ్చిన నివేదిక ప్రకారం ఇటీవల సీఐడీ కేసు కూడా పెట్టింది. ఈ కేసులోనే తాజాగా అరెస్టులు చేసింది.
ఐపీఎల్ 18వ సీజన్ సమయంలో.. ఎస్‌ఆర్‌హెచ్ తమకు మ్యాచ్ టికెట్లు ఇవ్వలేదని ఉప్పల్ స్టేడియంలోని కార్పొరేట్ బాక్స్‌కు హెచ్‌సీఏ అధికారులు తాళాలు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం తీవ్ర ఆగ్రహానికి గురైంది. అసంతృప్తితో.. తాము హైదరాబాద్‌ను వీడి వెళ్లిపోతామని కూడా ప్రకటించింది. ఇదే సమయంలో జగన్మోహనరావుపైనా తీవ్ర ఆరోపణలు చేసింది.
హెచ్‌సీఏ-ఎస్‌ఆర్‌హెచ్ రగడతో తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించింది. ఆ ప్రకారం.. ఎస్‌ఆర్‌హెచ్‌పై హెచ్‌సీఏ అధ్యక్షుడి హోదాలో జగన్మోహన్‌రావు ఒత్తిడి తెచ్చారని విజిలెన్స్ తేల్చింది. సీఐడీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడినే అరెస్టు చేశారు. ఇది వివాదంలో బిగ్ ట్విస్ట్‌గా మారింది.
కాగా, ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం 10 శాతం ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్లను హెచ్‌సీఏకు ఉచితంగా ఇస్తామని ప్రతిపాదించింది. కానీ, హెచ్‌సీఏ మరో పది శాతం అడిగింది. ఇది కుదరదని తేల్చి చెప్పడంతో ఎస్‌ఆర్‌హెచ్-హెచ్‌సీఏ మధ్య వివాదానికి కారణమైంది. ఓపెన్ మార్కెట్లో కొనుగోలుకు అయినా అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రావు కోరారు.
అయితే, దానికి హెచ్‌సీఏ తరఫున రిక్వెస్ట్ అడిగింది ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం. వ్యక్తిగతంగా 10 శాతం టికెట్లు కావాలని జగన్మోహన్ రావు కోరగా అంగీకరించలేదు. దీంతో ఆయన మ్యాచ్‌ల సందర్భంగా ఇబ్బందులకు గురిచేశారని అభియోగాలు వచ్చాయి. అనంతర పరిణామాల్లో ఉప్పల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్-లక్నో సూపర్‌జెయింట్స్‌తో సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు తాళాలు వేశారు. అప్పుడు వివాదం బయటకు వచ్చింది.
హెచ్‌సీఏ చీఫ్ జగన్మోహనరావు బీఆర్‌ఎస్ హయాంలో అధ్యక్షుడు అయ్యారు. ఆయనకు ఆ పార్టీ నేతలతోనూ సన్నిహిత సంబంధాలున్నట్లు చెబుతారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున వ్యవహారం ఎక్కడకు వెళ్తుందో చూడాలి.