H1B కొత్త వీసాలకు మాత్రమే భారీ ఫీజు.. ట్రంప్ ఎందుకు వెనక్కితగ్గాడు?

ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసే సమయంలో కామర్స్ సెక్రటరీ హోవర్డ్ ప్రతి ఏడాది లక్ష డాలర్లు చెల్లించాలని చెప్పారు.;

Update: 2025-09-21 05:59 GMT

H1B వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసే సమయంలో కామర్స్ సెక్రటరీ హోవర్డ్ ప్రతి ఏడాది లక్ష డాలర్లు చెల్లించాలని చెప్పారు. కానీ 24 గంటలు తిరగకముందే వైట్ హౌస్ మరో ప్రకటన చేసింది. కేవలం కొత్త వీసాల కోసం అప్లై చేసే వారికే ఆ ఫీజు వర్తిస్తుందని పేర్కొంది. దీంతో ఏం జరిగింది? ఎందుకు నిర్ణయం మార్చుకున్నారు? అనే సందేహాలు వస్తున్నాయి.

H1B వీసాల నిర్ణయంపై ఇటు భారత్ నుంచి అటు అమెరికన్ టెక్ కంపెనీలు, సీఈవోలు , మేధావులు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్రంప్ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. భారత్ కూడా భారతీయులను వెనక్కి తీసుకురావడంపై దృష్టి సారించడంతో అప్రమత్తమైన ట్రంప్ సర్కార్ ఈ మేరకు కొత్త హెచ్1బీలకే ఈ లక్ష డాలర్లు అంటూ మాట మార్చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన H-1B వీసా ఫీజు పెంపుపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. ఈ వివాదాస్పద నిర్ణయంపై శనివారం వైట్‌హౌస్ కీలకమైన స్పష్టతనిచ్చింది. కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మాత్రమే ఈ $100,000 భారీ ఫీజు వర్తిస్తుందని, ప్రస్తుతం అమెరికాలో H-1B వీసా కలిగిన వారికి ఎటువంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ప్రధానంగా భవిష్యత్ వీసా ప్రవాహాన్ని నియంత్రించే ఉద్దేశంతో తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ముఖ్యమైన వివరాలు

ఈ భారీ ఫీజు భవిష్యత్తులో కొత్తగా H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. దీంతో ప్రస్తుత హోల్డర్లకు ఊరటనిచ్చింది. ఇప్పటికే H-1B వీసా కలిగి ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం వల్ల ఏ మాత్రం ప్రభావితం కారు. వీసా పునరుద్ధరణ (Renewals) లేదా కాలపరిమితి పొడిగింపులకు (Extensions) ఈ నియమం వర్తించదు.

ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న H-1B వీసా హోల్డర్లు ఎటువంటి భయాందోళన లేకుండా దేశం లోపలికి, వెలుపలికి ప్రయాణించవచ్చు. ఈ కొత్త ఫీజు 2026 ఫిబ్రవరి H-1B లాటరీ సైకిల్ నుంచి అమల్లోకి వస్తుంది.

ట్రంప్ తొలి ప్రకటనతో వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, ఇంజనీర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ ఉద్యోగాలు, కుటుంబ జీవితాలు, భవిష్యత్ ప్రణాళికలపై ప్రభావం పడుతుందేమోనని భయపడ్డారు. ఈ నేపథ్యంలో నాస్‌కామ్ (NASSCOM) వంటి సంస్థలు ఈ ఫీజు పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ "భారతీయ ఐటీ రంగానికి విధ్వంసకరమైనది" అని పేర్కొన్నాయి.

అయితే వైట్‌హౌస్ తాజా స్పష్టతతో ఉద్యోగులు, కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ నిర్ణయం కేవలం భవిష్యత్ వీసా ప్రవాహాన్ని నియంత్రించడానికేనని, ప్రస్తుతం ఉన్నవారిని గందరగోళానికి గురిచేయడానికి కాదని ఓ సీనియర్ అమెరికా అధికారి తెలిపారు. దీంతో అమెరికాలో కొనసాగుతున్న ఉద్యోగాలు, ప్రయాణాలు యథావిధిగా సాగుతాయి. ఈ నిర్ణయం ప్రభావం కేవలం కొత్త వీసా దరఖాస్తుదారులపై మాత్రమే ఉండనుంది.

Tags:    

Similar News