ఇరాన్‌కు వ్యతిరేకంగా ఏకమవుతున్న గల్ఫ్ దేశాలు?

ఈ ఉద్రిక్తతలు కేవలం పశ్చిమాసియాకే పరిమితం కావు. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతింటుంది.;

Update: 2026-04-01 16:42 GMT

పశ్చిమాసియా లో యుద్ధ జ్వాలలు ఆరిపోకముందే.. పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇరాన్ , ఇజ్రాయెల్-అమెరికా మధ్య కొనసాగుతున్న పోరు ఇప్పుడు గల్ఫ్ దేశాలను కూడా యుద్ధం వైపు నడిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు తమ తటస్థ వైఖరిని వీడి ఇరాన్‌ను అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నట్లు వెలువడుతున్న వార్తలు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

రంగంలోకి యూఏఈ..వ్యూహాత్మక మలుపు

ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. గల్ఫ్ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన యూఏఈ ఇప్పుడు తన పంథాను మార్చుకుంది. ఇరాన్ చర్యల వల్ల ముఖ్యంగా హర్మూజ్ జలసంధి మూతపడటంతో తమ దేశ వాణిజ్యం, పర్యాటకం , ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయని యూఏఈ గట్టిగా నమ్ముతోంది. హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన మార్గం. దీన్ని ఇరాన్ అడ్డుకోవడం వల్ల యూఏఈ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఆగడాలను అరికట్టడానికి అమెరికాతో చేతులు కలపడానికి యూఏఈ మొగ్గు చూపుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఇరాన్‌పై ప్రత్యక్షంగా యుద్ధానికి సిద్ధమైన తొలి పర్షియన్ గల్ఫ్ దేశంగా యూఏఈ చరిత్ర సృష్టించనుంది.

సౌదీ అరేబియా వైఖరిలో మార్పు

గతంలో అమెరికా సైనిక కార్యకలాపాలకు తమ వైమానిక స్థావరాలను ఇవ్వడానికి నిరాకరించిన సౌదీ అరేబియా ఇప్పుడు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటున్నట్లు సమాచారం. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా తమ పూర్తి మద్దతు ఉంటుందని సౌదీ సంకేతాలు ఇచ్చింది. ఇది గల్ఫ్ రాజకీయాల్లో ఒక పెద్ద వ్యూహాత్మక మార్పు గా విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతర్జాతీయ కూటమి కోసం దౌత్య ప్రయత్నాలు

ఇరాన్‌ను ఒంటరిని చేసేందుకు యూఏఈ రహస్యంగా దౌత్య పావులు కదుపుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకునేలా తీర్మానం ప్రవేశపెట్టాలని యూఏఈ భావిస్తోంది. అమెరికా, యూరప్, ఆసియాలోని కీలక దేశాలతో చర్చిస్తూ ఒక బలమైన సైనిక కూటమిని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. శాంతి చర్చలు విఫలమైతే సైనిక చర్య ద్వారా హర్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవాలనేది ఈ కూటమి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

ఇరాన్ హెచ్చరికలు.. ప్రతిచర్యలు

మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే వందలాది డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తున్న టెహ్రాన్ తమకు వ్యతిరేకంగా పనిచేసే దేశాలపై తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ముఖ్యంగా పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల మౌలిక సదుపాయాలు, చమురు క్షేత్రాలపై దాడులు చేస్తామని బెదిరించడం ఉద్రిక్తతలను పరాకాష్టకు చేర్చింది.

భద్రతా కారణాల దృష్ట్యా యూఏఈ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గోల్డెన్ వీసా ఉన్నవారిని మినహాయించి మిగిలిన ఇరాన్ పౌరుల ప్రవేశంపై తాత్కాలిక నిషేధం విధించినట్లు సమాచారం. ఇది ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయే దిశగా సాగుతున్నాయని సూచిస్తోంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

ఈ ఉద్రిక్తతలు కేవలం పశ్చిమాసియాకే పరిమితం కావు. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతింటుంది. విమానయాన, షిప్పింగ్ రంగాలు తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటాయి. ఐక్యరాజ్యసమితి జోక్యంతో సమస్య శాంతియుతంగా పరిష్కారం కావాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఒక పెద్ద యుద్ధం దిశగానే దారితీస్తున్నాయి. గల్ఫ్ దేశాల నిర్ణయాలు ఈ ప్రాంత భవిష్యత్తును మరియు ప్రపంచ ఆర్థిక గమనాన్ని నిర్ణయించనున్నాయి.

Tags:    

Similar News