హైదరాబాదే కాదు.. చుట్టుపక్కలా 'భాగ్య'మే!
గ్రేటర్ హైదరాబాద్ పరిధికి ఇప్పటి వరకు ఆనుకుని 27 నగర పాలక సంస్థలు ఉన్నాయి. ఇవి పలు జిల్లాల పరిధిలో ఉన్నాయి.;
తెలంగాణ రాజధాని హైదరాబాద్ అంటే.. భాగ్యనగరమని పేరు!. అయితే.. ఇప్పుడు ఈ భాగ్యనగరం.. కేవ లం హైదరాబాద్ పరిసరప్రాంతాలకే కాకుండా.. చుట్టుపక్కల ఉన్న మరిన్ని ప్రాంతాలకు కూడా విస్తరిం చనుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆవల, ఆనుకుని ఉన్న 27 నగర పాలక సంస్థలు హైదరాబాద్ పరిధిలోకి రానున్నాయి. ఈ మేరకు కేబినెట్ ఆమోదించింది. అయితే.. దీనివల్ల అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కూడా మేలు జరగనుంది.
ఏయే ప్రాంతాలు కలుస్తున్నాయి?
గ్రేటర్ హైదరాబాద్ పరిధికి ఇప్పటి వరకు ఆనుకుని 27 నగర పాలక సంస్థలు ఉన్నాయి. ఇవి పలు జిల్లాల పరిధిలో ఉన్నాయి. అయితే.. ఇవన్నీ.. గ్రేటర్ పరిధిలోకి రానున్నాయి. తద్వారా గ్రేటర్ పరిధి ఐదు జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధికి విస్తరించనుంది. దీంతో ఆయా భూముల ధరలు పెరగనున్నాయి. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి మంచి బూస్ట్ ఇస్తుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. అలానే.. ఆరు ఎంపీ స్థానాలు కూడా ఈ పరిధిలోకి రానున్నాయి.
తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న పురపాలక, నగరపాలక సంస్థలన్నింటినీ విలీనం చేయడం ద్వారా సర్కారుకు పన్నుల రూపంలో ఆదాయం పెరగనుంది. ముఖ్యంగా పెట్టుబడులు వచ్చేందుకు , పరిశ్రమల స్థాపనకు కూడా నగర పరిధి విస్తరించినట్టు అవుతుంది. దీనివల్ల ప్రజలకు మౌలిక సదుపాయాలు పెరగనున్నాయి. మెట్రో సహా, రహదారులు, తాగునీటి వసతులు, మాల్స్ వంటివి అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా ప్రజారవాణా వ్యవస్థలో కీలకమైన మెట్రో మరింత చేరువ అవుతుంది.
అయితే.. దీనికి సంబంధించి కీలక కార్యక్రమాలు పూర్తి చేయాలి. ముందుగా బిల్లును రూపొందించాలి. ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి. దీనిని అసెంబ్లీలో పెట్టాలి. అనంతరం.. దానిని ఆమోదించాక.. గవర్న్‌ర్‌కు పంపించాలి. ఆ తర్వాతే.. ఈ విలీన ప్రక్రియ ముగియనుంది. అయితే.. గతంలోనూ కేసీఆర్ ఈ ప్రతిపాదన చేశారు. కానీ, పలు కారణాలతో ముఖ్యంగా నిధుల సమస్యతో అప్పట్లో వెనుకడుగు వేశారు. మరి ఇప్పుడు కూడా అదే సమస్య ఉన్నప్పటికీ విస్తృత ప్రజా కోణంతోపాటు రాజకీయ వ్యూహంలో భాగంగానే సర్కారు ఈ నిర్ణయం తీసుకుందన్న చర్చసాగుతుండడం గమనార్హం.