కారు కథ తేల్చేస్తారా.. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి
దాదాపు రెండేళ్లు అవుతోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి..! అప్పటినుంచి బీఆర్ఎస్ హయాంలో అక్రమాలపై తేల్చేస్తామని అంటోంది.;
దాదాపు రెండేళ్లు అవుతోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి..! అప్పటినుంచి బీఆర్ఎస్ హయాంలో అక్రమాలపై తేల్చేస్తామని అంటోంది. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పవర్ ప్లాంట్... చివరకు 2023లో జరిగిన ఫార్ములా ఈ-కార్ రేస్ సహా పలు అంశాలపై చర్యలు తప్పవని హెచ్చరించింది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రిగా కొనసాగిన మున్సిపల్ శాఖకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసుకు నిధుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గత ప్రభుత్వంలో అన్నీ తానే అయి వ్యవహరించినట్ల ఆరోపిస్తూ కేటీఆర్ ను టార్గెట్ చేసింది. వాస్తవానికి గత ఏడాది నవంబరు 1నే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని ఆదేశించింది. ఈ-రేస్ లో రూ.55 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఐఏఎస్ లు సహా గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉడడంతో కేసు నమోదు కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ రాశారు ఏసీబీ అధికారులు. ఈ మేరకు నిరుడే ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పైగా ఉన్నత స్థాయి కేసుగా పరిగణిస్తూ.. ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. అయితే, కేటీఆర్ పై విచారణ కోరుతూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపిన ఫైలుకు అప్పటినుంచి అంగీకారం రాలేదు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధానాంశం..
ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేటీర్ ను ఎందుకు అరెస్టు చేయలేదు? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విపక్ష బీజేపీ నిలదీసింది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు సైతం.. గవర్నర్ (బీజేపీ నేపథ్యం నుంచి వచ్చారు) అనుమతి రాలేదు అని తిప్పికొట్టింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసి, కాంగ్రెస్ అభ్యర్థే గెలిచిన వారం రోజులకు కేటీఆర్ పై విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి అనుమతి లభించింది.
ఇప్పటికే విచారణకు హాజరైన కేటీఆర్
ఫార్ములా ఈ రేస్ విషయంలో అవకతవకలకు ఆస్కారమే లేదని కేటీఆర్ కొట్టిపారేస్తున్నారు. ఇదే అంశాన్ని పలుసార్లు చెప్పిన ఆయన ఏసీబీ విచారణలకు సైతం హాజరయ్యారు. కాగా, ఫార్ములా ఈ రేస్ లో అక్రమాలపై కేటీఆర్ పాత్రపై సాక్ష్యాలు ఉన్నట్లుగా ఏసీబీ గతంలో గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొంది. ఇప్పుడు ఇక మిగిలింది చార్జిషీట్ దాఖలు చేయడమే. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి గత ప్రభుత్వంలోని పెద్దలు ఆదేశిస్తేనే విదేశీ సంస్థలు నిధులు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, వారు నోట్ ఫైల్ గాని, ఆదేశాల పత్రాలు కానీ జారీ చేయలేదు. మరి ఏం జరగనుందో చూడాలి. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపడం మాత్రం ఖాయం.