అద్దెకు ఉండేవారికి బిగ్ రిలీఫ్... కొత్త నియమాలు తెలుసుకోండి!

ఈ క్రమంలో... అద్దె గృహ ప్రక్రియను క్రమబద్దీకరించడంతోపాటు సురక్షితంగా ఉంచడానికి ప్రభుత్వం కొత అద్దె నియమాలు-2025ను అమల్లోకి తెచ్చింది.;

Update: 2025-12-02 10:59 GMT

ఈ రోజుల్లో సిటీల్లో ప్రధానంగా మెట్రోపాలిటన్ నగరాల్లో ఇంటి అద్దెల కష్టాలు ఏ స్థాయిలో ఉంటున్నాయనే సంగతి అనుభవించేవారికి తెలుసు! దానికి తోడు సుమారు 6 నుంచి 10 నెలల డిపాజిట్ కట్టే కార్యక్రమం మరో గుదిబండగా మారిన పరిస్థితి! ఇది ఏ స్థాయిలో అంటే.. ఇళ్లు అద్దెకు దిగేందుకు కట్టాల్సిన డిపాజిట్ కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి. ఈ సమయలో అద్దె దారులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది.

అవును... సిటీల్లో అద్దె కష్టాలు అన్నీ ఇన్నీ కావని అంటారు. బ్రతుకు దెరువు కోసం సిటీలకు వచ్చి ఉండే పేద, మధ్యతరగతి వారికి ఈ కష్టాలు పీక్స్ లో ఉంటుంటాయి! ఇక ఇంటికి అడ్వాన్సులు చెల్లించే విషయం మరో లెక్క. ఉదాహరణకు ఇటీవల బెంగళూరులో ఓ డూప్లెక్స్ ఇంటి ఓనరు.. అద్దెకు చేరాలంటే రూ.30 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలని బోర్డు పెట్టారు. ఇది కాస్తా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో... అద్దె గృహ ప్రక్రియను క్రమబద్దీకరించడంతోపాటు సురక్షితంగా ఉంచడానికి ప్రభుత్వం కొత అద్దె నియమాలు-2025ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం... రెంటల్ అగ్రిమెంట్స్ డిజిటలైజ్ చేయడం, సెక్యూరిటీ డిపాజిట్లను పరిమితం చేయడం, అద్దె పెంపులను నియంత్రించడం, అద్దెదారులకు రక్షణ కల్పించడం, యజమానికి - అద్దెదారులకు మధ్య పారదర్శకతను మెరుగుపరచడం ప్రధానంగా ఉన్నాయి.

ఈ నియమాల ప్రకారం... ఇకపై అన్ని రెంటల్ అగ్రిమెంట్స్ డిజిటల్ స్టాంప్ చేసి, సంతకం చేసిన తర్వాత 60 రోజుల్లోపు ఆన్ లైన్ లో నమోదు చేయాలి. నమోదు చేయని అగ్రిమెంట్స్ కు ఆయా రాష్ట్రాలను బట్టి రూ.5 వేల వరకూ జరిమానా విధించవచ్చు. ఈ నిబంధన... అద్దెదారుల దోపిడీకి దారితీసే నమోదు చేయని చేతితో రాసిన అగ్రిమెంట్ వంటి దీర్ఘకాలిక సమస్యను పరిష్కరిస్తుందని అంటున్నారు!

ఇదే సమయంలో... ఇంటి యజమానులు ఇకపై సెక్యూరిటీ డిపాజిట్ ను రెండు నెలల కంటే ఎక్కువ వసూలు చేయలేరు. ఇక కమర్షియల్ బిల్డింగ్స్ విషయానికొస్తే... పరిమితి 6 నెలల అద్దెగా నిర్ణయించబడింది. ఇది ప్రధానంగా బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో సెక్యూరిటీ డిపాజిట్లతో ఇబంది పడేవారికి బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.

ఇక ప్రస్తుత ఒప్పందం ప్రకారం 12 నెలల వ్యవధి తర్వాత మాత్రమే ఇంటి యజమానులు అద్దెను పెంచగలరు. అదేవిధంగా... పెంపుదల చేయడానికి కనీసం 90 రోజుల ముందుగా వ్రాతపూర్వక నోటీసును కూడా అద్దెకు ఉండేవారికి అందించాలి. ఇది అద్దెకు ఉండేవారు నిర్ణయాలు తీసుకోవడానికి తగినంత సమయం ఉంటుందని చెబుతున్నారు.

వాస్తవానికి ఇవన్నీ తొలుత అద్దెకు ఉండేవారికి మాత్రమే అనుకూలంగా ఉన్నట్లు అనిపించొచ్చు, ఇంటి యజమానులకు అసౌకర్యంగా అనిపించొచ్చు కానీ... దీనివల్ల ఇళ్లు ఖాళీగా ఉండటం అనే సమస్య పోతుందని అంటున్నారు! అద్దెలకు వేగంగా వస్తారని.. ఇదే సమయంలో అద్దెకు ఉండేవారు అస్తమానం ఇళ్లు మారకుండా దీర్ఘకాలం అదే ఇంట్లో ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

Tags:    

Similar News