విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పవర్ గ్రిడ్ ఆధారితమా? గ్యాస్ ఆధారితమా?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం విపరీతంగా పెరగడంతో డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.;
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. విశాఖపట్నం నగర శివార్లలోని తర్లవాడ గ్రామంలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న భారీ డేటా సెంటర్ ఈ నెల 28న అట్టహాసంగా ప్రారంభం కానుంది. కేంద్ర అతిథుల సమక్షంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించనున్నారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ డేటా సెంటర్ రాకతో ఉత్తరాంధ్ర ప్రాంతం ఐటీ హబ్‌గా మారుతుందని అంచనా వేస్తున్నా.. ఈ తరహా పరిశ్రమల నిర్వహణ వల్ల కలిగే పర్యావరణ పరిణామాలపై ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం విపరీతంగా పెరగడంతో డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. సాధారణంగా డేటా సెంటర్లు స్థానిక ఎలక్ట్రిక్ గ్రిడ్ల ద్వారా విద్యుత్‌ను పొందుతాయి. అయితే 24/7 అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం గ్రిడ్లు సరిపోనప్పుడు.. టెక్ కంపెనీలు తమ సొంత గ్యాస్ పవర్ ప్లాంట్లను నిర్మించుకుంటున్నాయి. విశాఖలో ప్రారంభం కాబోతున్న ఈ కేంద్రం కేవలం గ్రిడ్ విద్యుత్ పైనే ఆధారపడుతుందా లేక భవిష్యత్తులో గ్యాస్ ఆధారితంగా మారుతుందా అన్నది పర్యావరణ వేత్తల ముందున్న ప్రధాన ప్రశ్న.
ఒకవేళ డేటా సెంటర్లు గ్యాస్ ఆధారితంగా నడిస్తే.. అవి విడుదల చేసే గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది. గ్యాస్ ప్లాంట్ల ద్వారా కార్బన్ డయాక్సైడ్‌తో పాటు అత్యంత ప్రమాదకరమైన మీథేన్ వాయువు కూడా లీక్ అయ్యే ప్రమాదం ఉందని అంతర్జాతీయ పత్రికలు తమ కథనాల్లో వెల్లడించాయి. కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం... ఇలాంటి ఒక్కో డేటా సెంటర్ కొన్ని చిన్న దేశాలు విడుదల చేసే మొత్తం ఉద్గారాల కంటే ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఇది గూగుల్ వంటి సంస్థలు 2030 నాటికి నిర్దేశించుకున్న `నెట్ జీరో` లక్ష్యాలకు పెద్ద అడ్డంకిగా మారవచ్చు.
కేవలం గాలి కాలుష్యమే కాకుండా.. డేటా సెంటర్ల నిర్వహణలో నీటి వినియోగం కూడా మరొక క్లిష్టమైన సమస్య. డేటా సెంటర్లలోని సర్వర్ల నుంచి వచ్చే వేడిని తగ్గించడానికి లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుంది. దీనికి తోడు సొంతంగా గ్యాస్ ప్లాంట్లు ఉంటే నీటి వినియోగం మరింత పెరుగుతుంది. అమెరికాలోని వర్జీనియా వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఇలాంటి గ్యాస్ పైప్‌లైన్ల నిర్మాణం - పర్యావరణ నష్టంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ వంటి తీర ప్రాంత నగరంలో ఇటువంటి భారీ ప్రాజెక్టుల వల్ల స్థానిక వనరులపై పడే ఒత్తిడిని ముందే అంచనా వేయాల్సి ఉంటుంది.
సాంకేతిక పురోగతి .. ఏఐ విప్లవం సమాజానికి అవసరమే అయినా... పర్యావరణాన్ని పణంగా పెట్టి సాధించే అభివృద్ధి దీర్ఘకాలంలో చేదు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. శిలాజ ఇంధనాల వైపు మళ్లకుండా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా మాత్రమే ఈ డేటా సెంటర్లను నిర్వహించేలా ప్రభుత్వాలు.. టెక్ సంస్థలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించే సమయంలోనే వాటి నిర్వహణ తీరుపై పారదర్శకత ఉంటేనే... పర్యావరణ పరిరక్షణతో కూడిన సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇప్పటికే విశాఖపట్నం నుంచి కాకినాడ వరకూ తీర ప్రాంతంలోని భారీ ఫార్మా కంపెనీలు వెలువరిస్తున్న భయానక విష రసాయనాల ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు డేటా సెంటర్లు, అదుపు తప్పిన భవన నిర్మాణాలతో పచ్చదనం కరువై, భూగర్భ జలాలు అడుగంటి ప్రజా జీవనాన్ని ప్రమాదంలో పడేస్తే ఎవరు బాధ్యులు? అనేది ఆలోచించుకోవాలి.