ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగం ఉన్న టాప్-5 దేశాలు ఇవే
ఒక దేశ ఆర్థిక వ్యవస్థను, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేయడానికి `నిరుద్యోగిత రేటు` అత్యంత కీలకమైన సూచికగా పనిచేస్తుంది.
ఒక దేశ ఆర్థిక వ్యవస్థను, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేయడానికి `నిరుద్యోగిత రేటు` అత్యంత కీలకమైన సూచికగా పనిచేస్తుంది. ఉపాధి అవకాశాలు కరువై.. యువత ఉద్యోగాల కోసం అలమటించే పరిస్థితి ఏ దేశానికైనా పెద్ద శాపంగా మారుతుంది. ఇటీవల విడుదలైన అంతర్జాతీయ రిపోర్టుల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ అనిశ్చితి, అంతర్గత కలహాల కారణంగా భారీ స్థాయిలో నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ జాబితాలో కొన్ని దేశాల నిరుద్యోగిత రేటు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు భారత్ లేదా చైనాలో నిరుద్యోగిత రేటు టాప్ ప్లేస్ లో ఉంటుందని భావిస్తాం.. కానీ అందుకు భిన్నంగా అత్యధిక నిరుద్యోగంతో తల్లడిల్లుతున్న దేశంగా ఆఫ్రికా ఖండంలోని సుడాన్ నం.1గా రికార్డులకెక్కింది. ఇక్కడ నిరుద్యోగిత రేటు ఊహించని విధంగా దాదాపు 62.1 శాతంగా నమోదైంది. అంటే ఆ దేశంలో సగానికి పైగా జనాభాకు ఎలాంటి ఉపాధి మార్గాలు లేవు. గత కొన్ని సంవత్సరాలుగా సుడాన్‌లో కొనసాగుతున్న అంతర్గత సైనిక యుద్ధాలు, తీవ్రమైన ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత , ఆర్థిక వనరుల కొరత అక్కడి ప్రజలను ఘోరమైన పేదరికంలోకి నెట్టేశాయి. పారిశ్రామిక రంగాలు పూర్తిగా దెబ్బతినడంతో యువతకు ఉద్యోగాలు దొరకడం గగనంగా మారింది.
ఈ సంచలన జాబితాలో సుడాన్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది ఆఫ్రికా ఖండంలోని మరో దేశమైన దక్షిణాఫ్రికా. అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందినా ఇక్కడ నిరుద్యోగిత రేటు దాదాపు 32.9 శాతంగా ఉంది. దేశంలో ఉన్న నల్లజాతీయులు- శ్వేతజాతీయుల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలు... నైపుణ్యాల కొరత .. ప్రభుత్వ విధానాల లోపాల కారణంగా ఇక్కడ మూడో వంతు జనాభా నిరుద్యోగులుగా మిగిలిపోయారు. దీని తర్వాత స్థానంలో జార్జియా దేశం దాదాపు 18.3 శాతం నిరుద్యోగిత రేటుతో కొనసాగుతోంది. ఉపాధి లేని దేశాల టాప్-5 జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉత్తర ఆఫ్రికాకు చెందిన అల్జీరియా దాదాపు 12.5 శాతం నిరుద్యోగితతో.. అలాగే ఐరోపా సరిహద్దుల్లో ఉండే టర్కీ దాదాపు 10.1 శాతం నిరుద్యోగిత రేటుతో నిలిచాయి.
ప్రపంచ దేశాలు 20శాతం చమురు, గ్యాస్ కోసం హర్మూజ్ జలసంధిపై ఆధారపడటం ఎంత ముప్పుగా మారిందో.. అదే విధంగా అల్టీరియా కూడా ఆదాయం కోసం చమురు-గ్యాస్ పై ఆధారపడటం ఆ దేశానికి అంతకంటే పెద్ద ముప్పుగా మారింది. కేవలం ఈ రెండు రంగాల పైనే ఆర్థిక వ్యవస్థ డిపెండ్ అవ్వడం శాపంగా మారింది. వేరే ఏ రంగంలోను వారికి ఆదాయం లేదు. అలాగే టర్కీలో ద్రవ్యోల్బణం ప్రమాదకర స్థాయికి చేరుకోవడం .. కరెన్సీ విలువ పడిపోవడం కూడా నిరుద్యోగాన్ని పెంచి పోషించింది.
మొత్తంగా చూస్తే.. ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగితను ఎదుర్కొంటున్న సుడాన్, దక్షిణాఫ్రికా, జార్జియా, అల్జీరియా, టర్కీ దేశాలు టాప్ 5లో ఉన్నాయి. ఈ పరిస్థితి అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ప్రపంచ దేశాలు సాంకేతికంగా, ఆర్థికంగా దూసుకుపోతుంటే.. మరోవైపు ఈ దేశాలు కనీస ఉపాధి కల్పించక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ దేశాల్లోని ప్రభుత్వాలు తక్షణమే మేల్కొని కొత్త పారిశ్రామిక విధానాలు, విదేశీ పెట్టుబడులు, యువతకు ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణను అందిస్తే తప్ప ఈ భయంకరమైన నిరుద్యోగ రక్కసి నుండి బయటపడటం సాధ్యం కాదు.