వార్ వేళ భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో పెట్రోల్ ధర ఎంత పెరిగింది?
కరోనా తర్వాత నుంచి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య యుద్దాలు.. ఉద్రిక్తతలు పెరుగుతున్న పరిస్థితి.;
కరోనా తర్వాత నుంచి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య యుద్దాలు.. ఉద్రిక్తతలు పెరుగుతున్న పరిస్థితి. ఇవి సరిపోవన్నట్లు ఫిబ్రవరి 28 నుంచి ప్రపంచ నెత్తిన మరో యుద్దం వచ్చి కూర్చుంది. వేర్వేరు దేశాల మధ్య జరిగిన యుద్దాలకు ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య నడుస్తున్న యుద్ధం కాస్తంత భిన్నమైంది. ఇది ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేయగల సత్తా దీని సొంతం. వార్ మొదలై పది రోజులు కూడా కాక ముందే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. తాజాగా బ్యారెల్ ముడి చమురు ధర ఏకంగా 110 డాలర్లను దాటేసింది. ఫిబ్రవరి 28నాటికి బ్యారెల్ ధర 73 డాలర్లు ఉంటే.. పది రోజుల్లో 37 డాలర్లు పెరిగింది.
ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు. ఫిబ్రవరి 28 నాటికి ఉన్న ధర ప్రకారం చూస్తే ఒక లీటరు రూ.38 వరకు ఉంటుంది. ఈ పది రోజుల్లో పెరిగిన ధరల ప్రకారం ఇప్పుడు లీటరు ధర సుమారు రూ.64 చేరుకున్న పరిస్థితి. పది రోజుల్లో ముడి చమురు ధర భారీగా పెరిగిన నేపథ్యంలో పెట్రోల్ ధరలు ఇప్పటివరకు పెరిగిన పరిస్థితి లేదు. మరి.. మన చుట్టుపక్కల ఉన్న దేశాలు.. కొన్ని సంపన్న దేశాల్లో పరిస్థితి ఎలా ఉందన్నది ఆసక్తికరం. ఇదే విషయాన్ని చూస్తే.. బోలెడన్ని అంశాలు కనిపిస్తాయి.
మన దేశంలో పెట్రోల్ ధర హైదరాబాద్ లో రూ.107.46గా ఉంటే.. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.94.77 చొప్పున ఉంది. ముంబయిలో రూ.103.50 చొప్పున ఉంటే.. చెన్నైలో రూ.101.23 చొప్పున అమ్ముతున్నారు. యుద్ధం మొదలైన ఈ పది రోజుల్లో ధరల్లో మార్పు వచ్చింది లేదు. ఆ మాటకు వస్తే గడిచిన నెల రోజుల్లో దేశంలోని పెట్రోల్ ధరలు పెరిగిన పరిస్థితి లేదు. రాష్ట్రాల వారీగా ధరల్లో కాస్త ఎక్కువ తక్కువ ఉండొచ్చు. కానీ.. ఎక్కడా కూడా యుద్ధం కారణంగానో.. పెరిగిన ముడిచమురు ధరల ఆధారంగా పెట్రోల్ ధరల్ని పెంచింది లేదు. అంటే.. నెల వ్యవధిలో భారతదేశంలోని ఏ ప్రాంతంలోనూ పెట్రోల్ ధర పెరుగుదల సున్నాగా చెప్పాల్సి ఉంటుంది.
భారతదేశం సంగతి సరే.. మన చుట్టుపక్కల దేశాల మాటేంటి? అన్నది చూస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాల జాబితాను చూస్తే..
- చైనా
- పాకిస్తాన్
- బంగ్లాదేశ్
- నేపాల్
- చైనా
- శ్రీలంక
- అఫ్గానిస్తాన్
- మయన్మార్
- మల్దీవులు
గడిచిన నెల వ్యవధిలో దేశాల వారీగా పెట్రోల్ ధర పెరిగిందా? తగ్గిందా? మన రూపాయిల్లో దాని ధర ఎంత? ఎంత శాతం పెరిగింది? అన్న వివరాల్ని పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. మన పొరుగున ఉండే పాకిస్థాన్ లో నెల వ్యవధిలో 10 శాతం ధరలు పెరిగాయి. పాకిస్తానీ రూపాయిల్లో కాకుండా మన రూపాయిల్లో దాని ధర చూస్తే.. లీటరు పెట్రోల్ ధర రూ.116.15 ఉంది. ఈ ధరను రూపాయితో అమెరికా డాలర్ మారకం ధర రూ.92.22 ప్రాతిపదికన లెక్కించటం జరిగింది. చైనా విషయానికి వస్తే గడిచిన నెలలో 11 శాతం వరకు పెట్రోల్ ధర పెరిగింది. ప్రస్తుతం ఆ దేశంలో లీటరు పెట్రోల్ ధర రూ.116.44 ఉంది. మాల్దీవుల్లో లీటరు పెట్రోల్ ధర రూ.119.84 ఉండగా..గడిచిన నెలలో రూ.11 చొప్పున పెరిగింది. నేపాల్ లో లీటరు పెట్రోల్ రూ.117.25 ఉండగా, నెల వ్యవధిలో రూ11 చొప్పున పెరిగింది.
బంగ్లాదేశ్ లో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.96.23 ఉండగా, గడిచిన నెలలో లీటరు మీద రూ.9.36 చొప్పున పెరిగింది. శ్రీలంకలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ రూ.96.23 లభిస్తోంది. గడిచిన నెలలో రూ.9.03 చొప్పున పెరిగింది. భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాల్లో అందరి కంటే తక్కువ ధరలకు పెట్రోల్ లభిస్తున్న దేశం అప్ఘనిస్తాన్. నమ్మలేరు కానీ ఇది నిజం. ఇక్కడ లీటరు పెట్రోల్ రూ.90.60 మాత్రమే. గడిచిన నెలలో రూ.8.50 చొప్పున పెరిగింది.
భారత చుట్టుపక్కల దేశాల్లో పెట్రోల్ ధరల సంగతి ఇలా ఉంటే.. ఆసియాలోని సంపన్న దేశాలుగా చెప్పే సింగపూర్, దక్షిణ కొరియా, జపాన్, మలేషియా లాంటి దేశాల్లో ధరలు ఎలా ఉన్నాయి? గడిచిన నెలలో.. అందునా యుద్ధం నేపథ్యంలో ధరలు ఎలా ఉన్నాయి? అన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్నదేశంగా చెప్పే ఇండోనేషియాలో పెట్రోల్ ధరల సంగతి మరింత ఆసక్తికరంగా ఉంటుంది.
ముందుగా సంపన్న దేశాలైన మలేషియా, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియాలను చూస్తే.. అనూహ్య తేడాలు కనిపిస్తాయి. ఉదాహరణకు సింగపూర్ ను తీసుకుంటే.. ఈ దేశంలో ప్రపంచంలో అత్యధికంగా పెట్రోల్ ధర ఉంటుంది. ఆ దేశంలో లీటరు పెట్రోల్ ధర మన రూపాయిల్లో అక్షరాల రూ.261.94 చొప్పున ఉంటుంది. గడిచిన నెలలో లీటరు పెట్రోల్ మీద పెరిగిన ధర రూ.25 వరకు పెరిగింది. ఎందుకిలా? అంటే.. వ్యక్తిగత వాహనాల్ని సింగపూర్ లో ప్రోత్సహించరు. సంపన్నులు సైతం ప్రజారవాణాను వినియోగిస్తారు. చిన్న దేశం కావటం.. కాలుష్యం లాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు పెట్రోల్ ధర అత్యధికంగా ఉంటుంది.
అదే సమయంలో మరో సంపన్న దేశం.. సింగపూర్ కు అనుకొని ఉండే మలేషియాలో పెట్రోల్ ధరలు అత్యంత చౌకగా ఉంటాయి.ఈ దేశంలో లీటరు పెట్రోల్ మన రూపాయిల్లో కేవలం రూ.47 మాత్రమే. ఈ దేశంలో పెట్రోల్ మీద పెద్ద ఎత్తున రాయితీ ఇస్తారు.ఈ కారణంగా ఇక్కడ పెట్రోల్ కారుచౌకగా లభిస్తుంది. గడిచిన నెలలో ఈ దేశంలో లీటరు పెట్రోల్ మీద రూ.4 వరకు పెరిగింది. సంపన్న దేశాల జాబితాలో ముందుండే జపాన్ లో లీటరు పెట్రోల్ రూ.93.13గా ఉంది.నెల వ్యవధిలో లీటరు పెట్రోల్ మీద దగ్గర దగ్గర రూ.9 వరకు పెరిగింది. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన దక్షిణ కొరియాలో లీటరు పెట్రోల్ ధర రూ.108.82 (మన రూపాయిల్లో లెక్కిస్తే) ఉంది. నెల వ్యవధిలో లీటరు పెట్రోల్ మీద పెరిగిన మొత్తం రూ.10గా చెబుతారు.
ఈ పోలిక పోల్చినప్పుడు.. ఈ వివరాల్ని చదివినప్పుడు సాధారణంగా ఒక సందేహం మనసుకు కలుగుతుంది. మన దేశంలో ఆదాయానికి.. జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, చైనా దేశాల్లోని ఆదాయాలకు భారతదేశంలోని సగటు ఆదాయానికి మధ్య వ్యత్యాసం ఉంది కదా అని. నిజమే.. అందుకే.. ధరల పరంగా పోల్చటం బాగానే ఉన్నా.. లాజికల్ గా సరి కాదనే చెప్పాలి.
ఎందుకంటే.. మన దేశంలో సగటు రోజువారీ ఆదాయం రూ.650-800 వరకు ఉంటుంది. అదే విధంగా పాకిస్తాన్ సగటు రోజువారీ ఆదాయం రూ.250-350 ఉంటుంది. అదే సమయంలో మలేషియాలో సగటు రోజువారీ ఆదాయం రూ.3200 అయితే.. సింగపూర్ లో ఏకంగా ర.18వేలు, అదే సమయంలో జపాన్ లో రూ.9500. ఇలా సంపాదన భారీగా ఉన్నప్పుడు పెట్రోల్ ధరల్ని పోల్చి చూడటం సహేతుకత కాదనే చెప్పాలి. ఆ లెక్కన చూసినప్పుడు మన దేశంలో పెట్రోల్ ధరలు భారీగా ఉన్నట్లుగా చెప్పాలి. మొత్తంగా చూస్తే.. ముడి చమురు ధరలు భారీగా పెరిగినా.. అన్ని దేశాల్లో పెట్రోల్ ధరలు పెరుగుతుంటే.. భారత్ లో మాత్రం ధరలు పెరగకుండా స్థిరంగా ఉండటం విశేషం.